breaking news
-
తుపాన్‌పై ఆందోళన వద్దు
తిరుపతి అర్బన్: మోంథా తుపాన్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఆయన సోమవారం కలెక్టరేట్ నుంచి మాట్లాడారు. జిల్లాలో మంగళ, బుధవారాలు వర్షాలు కురి సే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ, విపత్తుల నియంత్రణ శాఖ రెడ్ అలెర్ట్‌ను ప్రకటించిందని చెప్పారు. ఈ క్రమంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. అత్యవసర కమ్యూనికేషన్ కోసం మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకోవాలని, వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ ఉండాలని చెప్పారు. ప్రభుత్వ అధికారు లు సూచించిన వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని వెల్లడించారు. మీ పత్రాలు, సర్టిఫికెట్లు, విలువైన వస్తువులను వాటర్ ప్రూఫ్ కంటైనర్లు, కవర్లలో ఉంచుకోవాలన్నారు. ఎలక్ట్రికల్ మెయి న్ స్విచ్ ఆఫ్ చేయాలని, అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలు, గ్యాస్ కనెక్షన్‌ను తొలగించాలన్నారు. తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని హెచ్చ రించారు. ఇల్లు సురక్షితంగా లేకపోతే భారీ వర్షాలు కురవకముందే సురక్షితమైన షెల్టర్‌కు వెళ్లాలన్నారు. పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్లు స్తంభాల వద్ద ఉండకూడదని తెలిపారు. పశువులు, పెంపుడు జంతువులకు కట్టిన తాడును విప్పి వాటిని వదిలివేయాలని కోరారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడ దని సూచించారు. అత్యవసర సహాయ సమాచారం నిమిత్తం జిల్లా కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్‌తో పాటు తిరుపతి, శ్రీకాళహస్తి, గూడూ రు, సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయాల్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణలో 24/7 పనిచేసే టోల్ ఫ్రీ నంబర్లు : 112, 1070, 1800 425 0101 లకు కాల్ చేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో అధికారులుజిల్లాకు రెడ్ అలెర్ట్ కంట్రోల్ రూమ్ నంబర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం 0877-2236007 ఆర్డీఓ కార్యాలయం, తిరుపతి 7032157040 ఆర్డీఓ కార్యాలయం, శ్రీకాళహస్తి 8555003504 ఆర్డీఓ కార్యాలయం, గూడూరు 08624-252807, 8500008279 ఆర్డీఓ కార్యాలయం, సూళ్లూరుపేట 08623295345 -
వైద్యురాలి మృతి కేసులో మరో ట్విస్ట్.. దీపాలీ రిపోర్టు నిజమేనా?
ముంబై: మహారాష్ట్ర వైద్యురాలి ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైద్యురాలు మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా వైద్యురాలి కేసు మరో మలుపు తిరిగింది. తన కుమార్తె మరణానికి సంబంధించి వైద్యురాలు తప్పుడు నివేదిక ఇచ్చిందని సతారా జిల్లాకు చెందిన ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. చనిపోయిన వైద్యురాలు.. దీపాలీ మారుతీ అనే మహిళ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌పై దర్యాప్తు చేయాలని ఆమె తల్లి భాగ్యశ్రీ డిమాండ్ చేశారు.కాగా, మహారాష్ట్ర ఓ వైద్యురాలు.. ఎస్ఐ గోపాల్ బడ్నే, ఇంటి యజమాని కుమారుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్ తనపై లైంగిక దాడి చేశారని.. మానసిక, శారీరక వేధింపులు కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి వైద్యురాలు ప్రాణాలు తీసుకుంది. అలాగే, తప్పుడు వైద్య నివేదికలు ఇచ్చేలా ఉన్నతాధికారులు, పోలీసులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. రాజకీయ నాయకులు వైద్య నివేదికలు మార్చాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈ విషయంలో పై అధికారులకు తెలియజేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. దీంతో, ఆమె ఇచ్చిన రిపోర్టులకు సంబంధించి.. పాత కేసుల దర్యాప్తు విషయంలో సందేహాలు ఉన్నట్టు తాజాగా ఓ మహిళ అనుమానాలు వ్యక్తం చేశారు.తాజాగా సతారాకు చెందిన భాగ్యశ్రీ పచాంగ్నే.. తన కుమార్తె దీపాలీ మారుతీ మరణంపై తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. పోస్టుమార్టం రిపోర్టు మార్చాలని ఒత్తిడి తీసుకురావడంతో వైద్యురాలే రిపోర్ట్ మార్చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, భాగ్యశ్రీ పచాంగ్నే కుమార్తె దీపాలి మారుతిని సైన్యంలో పని చేస్తున్న అజింక్య హన్మంత్ నింబాల్కర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుంచి అత్త గారింట్లో దీపాలి.. తీవ్ర మానసిక క్షోభకు గురైంది. అనంతరం, ఆగస్టు 19న దీపాలి మారుతి చనిపోయింది. అల్లుడు ఫోన్ చేసి దీపాలి పరిస్థితి విషమంగా ఉందని బాధితురాలి తల్లికి తెలియజేశాడు. గర్భవతి కాబట్టి మూర్ఛపోయి ఉంటుందని తల్లి భాగ్యశ్రీ భావించింది. కానీ, ఆసుపత్రికి వెళ్లి చూసే సమయానికి దీపాలి చనిపోయి ఉండటం చూసి ఆవేదనకు గురైంది.అయితే, దీపాలి ఆత్మహత్య చేసుకుందని బంధువు ఒకరు తల్లికి తెలిపారు. కానీ, భాగ్యశ్రీ మాత్రం దీపాలి మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. మరోవైపు.. దీపాలి మరణం తర్వాత పోస్ట్‌మార్టం జరిగి ఐదు రోజులైనా నివేదిక ఇవ్వలేదు. నెల రోజుల తర్వాత నివేదిక వచ్చింది. తీరా ఆ నివేదికలో సహజ మరణం అని రావడంతో భాగ్యశ్రీ ఖంగుతిన్నది. ఆ నివేదికపై తల్లి స్పందిస్తూ.. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదు. దీపాలిని భర్త, అత్తమామలు చంపేశారని నమ్ముతున్నాను. ఆమె ఆరు నెలల గర్భవతి. ఏడాదిన్నర కుమార్తె కూడా ఉంది. నా కుమార్తె ఆత్మహత్య చేసుకోదు అని తెలిపారు. అనంతరం, దీపాలి మృతిపై మళ్లీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం రిపోర్టుపై అనుమానం వ్యక్తం చేశారు. -
ఇచ్చిన డబ్బు అడిగితే అవమానించారు
కళ్యాణదుర్గం: ‘అవసరానికి ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించలేదు. డబ్బు ఇవ్వాలని అడిగితే టీడీపీ నేతల అండ చూసుకుని అవమానించారు. ఫిర్యాదు చేసినా పోలీసులూ పట్టించుకోలేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మందు తాగాడు. వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గంలోని పుట్టగోసుల వీధిలో నివాముంటున్న ఆర్టీసీ ఉద్యోగి వెంకటస్వామి కుమారుడు కృష్ణగౌడ్ తాను చనిపోవడానికి కారణం బియ్యం జయమ్మ, ఆమె పెద్ద కుమారుడు ప్రకాష్, చిన్న కుమారుడు ప్రకాష్ అని సెల్ఫీ వీడియోలో విలపిస్తూ పురుగుల మందు తాగాడు. వారిని నమ్మి దాదాపుగా రూ.14.50 లక్షలు అప్పుగా ఇచ్చానని పేర్కొన్నాడు. అలాగే తన స్నేహితుడు సాయితేజ ద్వారా మరో రూ.3 లక్షలు ఇప్పించానన్నాడు. పది రోజుల క్రితం ఫిర్యాదు చేసినా పట్టణ పోలీసులు పట్టించుకోలేదని వాపోయాడు. రెండు రోజుల క్రితం టీడీపీ నాయకుడు కొండాపురం అనిల్‌చౌదరి దుకాణంలో ఆ పార్టీ నేతల సమక్షంలో పంచాయితీ పెట్టించారన్నారు. జయమ్మ దూషిస్తూ చెయ్యి చేసుకుందని, ఈ అవమానం భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. అనంతరం ఆ వీడియోను తన స్నేహితులకు షేర్ చేశాడు. దీంతో అప్రమత్తమైన స్నేహితులు, కుటుంబసభ్యులు కృష్ణగౌడ్ లొకేషన్ ఆధారంగా ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని అపస్మారకస్థితిలో పడి ఉన్న అతన్ని వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. తండ్రి వెంకటస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా పురుగుల మందు తాగుతూ యువకుడి సెల్ఫీ వీడియో -
‘బదిలీ’ మంత్రం... ‘వర్క్ అడ్జెస్ట్మెంట్’ తంత్రం
సాక్షి, అమరావతి: ‘వడ్డించేవాడు మనోడైతే..’ అన్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్యలో ఉద్యోగుల బదిలీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు, కావాల్సిన వారికి ‘వర్క్ అడ్జెస్ట్మెంట్’ పేరుతో జరిగిపోతున్నాయి. ఈ ఏడాది మే నుంచి ఇప్పటి దాకా నాలుగుసార్లు బదిలీలు చేపట్టగా, ఇప్పుడు ఐదోసారి బదిలీలకు రంగం సిద్ధమైంది. జూన్‌లో జరిగిన సాధారణ బదిలీలు మినహా, మిగిలిన అన్ని బదిలీలకు సర్ప్లస్, వర్క్ అడ్జెస్ట్మెంట్, డిప్యుటేషన్ పేరుతో కావాల్సిన వారిని నచ్చిన చోటుకు పంపేస్తున్నారు.అక్టోబర్ 8న వర్క్ అడ్జెస్ట్మెంట్ పేరుతో బదిలీలు చేసిన ప్రభుత్వం.. తాజాగా మరోసారి ఉద్యోగుల సర్దుబాటుకు సిద్ధమైందంటే పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సర్దుబాటుకు ఏకంగా కౌన్సెలింగ్‌కు సిద్ధపడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఎవరెవరికి పోస్టులు కావాలో వివరాలు సేకరించడం చర్చనీయాంశమైంది. ఈ నెల 25వ తేదీతో మొదటి సెమిస్టర్ కూడా పూర్తయిపోయింది. అయినప్పటికీ మరోసారి వర్క్ అడ్జెస్ట్మెంట్ చేయడం ఏంటని లెక్చరర్లు, ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నట్టని నిలదీస్తున్నారు. అడ్డగోలు బదిలీలు జూన్‌లో వీడియో కాల్స్ ద్వారా ఉత్తుత్తి బదిలీలు చేపట్టి రికార్డు సృష్టించిన సాంకేతిక విద్యాశాఖ... సెప్టెంబర్ లో ‘వర్క్ అడ్జెస్ట్మెంట్’ పేరుతో అడ్డగోలు డిప్యుటేషన్లు చేపట్టింది. ఇందులో ఫోకల్ (పట్టణాలు)లో పనిచేస్తూ మేలో నాన్ ఫోకల్ (గ్రామీణ నేపథ్యం)కు బదిలీ అయినవారిని, గతంలో ఆర్థిక తప్పులు చేసి పనిషిమెంట్ తీసుకున్నవారిని తిరిగి రాష్ట్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. అలాగే, జూన్‌లో సాధారణ బదిలీలు చేపట్టినా అన్ని ఖాళీలు చూపకుండా కేవలం డబ్బులిచ్చిన వారికి, నేతల సిరఫారసు ఉన్నవారికే ప్రాధాన్యం ఇచ్చారు.కీలకమైన స్థానాలను దాచిపెట్టి కేవలం వీడియో కాన్ఫరెన్స్‌తో బదిలీలు చేపట్టి దానికి ఆన్లైన్ బదిలీలుగా నామకరణం చేశారు. ఎస్బీటీఈటీ (స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్)లో దీర్ఘకాలంగా పనిచేస్తున్నవారికి కూడా సాధారణ బదిలీల్లో స్థానచలనం కల్పించినట్టు జీవోలతో కలరింగ్ ఇచ్చిన అధికారులు... తర్వాత ఆ ఉత్తర్వులు పట్టించుకోవద్దని కాలేజీలు, కార్యాలయాలకు సమాచారం అందించారు. అయితే, వీరికోసం గత నెలలో మరోసారి వర్క్ అడ్జెస్ట్మెంట్ చేస్తూ ఉన్న స్థానాల్లో కొనసాగేలా బదిలీ ఉత్తర్వులిచ్చారు. ఎస్బీటీఈటీలోనూ అవినీతి మకిలి సాంకేతిక విద్యలో సిబ్బంది కొరత ఉంది. దీంతో అవసరం మేరకు డిప్యుటేషన్‌పై సిబ్బందిని నియమిస్తారు. దీనికి ఓ విధానం కానీ, మార్గదర్శకాలు కానీ పాటించడం లేదు. పైరవీలు చేసేవారికే అవకాశం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా వచ్చిన వారు కార్యాలయాన్ని వదలకుండా కొత్తవారు రాకుండా అడ్డుకుంటున్నట్టు విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే గత నెలలో పలువురు అధికారులు డిప్యుటేషన్లు తెచ్చుకోగా, వారికి అనుకూలంగా ఉండే వారికోసం తాజాగా వర్క్ అడ్జెస్ట్మెంట్ బదిలీలకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. ⇒ 2014–17 మధ్య ఎస్బీటీఈటీలో పనిచేసిన ఓ అధికారిపై ఆర్థిక ఆరోపణలు రావడంతో పాలిటెక్నిక్ కాలేజీకి బదిలీ చేశారు. అయితే తనకున్న పలుకుబడితో రాష్ట్ర కార్యాలయానికి వచ్చేందుకు ఆయన ప్రయత్నించినా, గత ప్రభుత్వంలో కుదరలేదు. కూటమి ప్రభుత్వం రాగానే కాకినాడ ఆర్జేడీ కార్యాలయానికి బదిలీ చేయించుకున్నారు. మేలో జరిగిన బదిలీల్లో ఆయన్ను కలిదిండి పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బదిలీ చేసినా చేరకుండా డిప్యుటేషన్ కోసం ప్రయత్నించి చివరికి జాయింట్ సెక్రటరీగా రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ⇒ ఇప్పటి దాకా బోర్డులో సిస్టం అనలిస్ట్‌గా హెడ్ ఆఫ్ సెక్షన్ స్థాయి అధికారికి మాత్రమే అవకాశమిచ్చారు. తాజాగా ఆంధ్రా పాలిటెక్నిక్‌లో పనిచేసే ఓ లెక్చరర్‌ను తెచ్చి ఈ పోస్టులో నియమించారు. విజయవాడలో అత్యధిక సర్విసు చేసిన ఈయన తన పరిచయాలను వాడుకుని మళ్లీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ⇒ ఏళ్ల తరబడి తిరుపతి ఆర్జేడీ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న ఓ అధికారికి జూన్‌లో బేతంచర్ల పాలిటెక్నిక్ కాలేజీకి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా బదిలీ అయింది. అయితే, ఆయన ఆ పోస్టులో చేరకుండా పైరవీలతో బోర్డులో డిప్యూటీ కార్యదర్శిగా వచ్చారు. ⇒ బోర్డులో పనిచేసిన ఒకరిని పార్వతీపురం మన్యం జిల్లాలోని చినమేరంగి కాలేజీకి హెడ్‌గా ఇటీవల బదిలీ చేశారు. ఆయన కూడా తిరిగి వర్క్ అడ్జెస్ట్మెంట్ పేరుతో డెప్యూటీ కార్యదర్శిగా స్థానం సంపాదించారు. జూన్‌లో జరిగిన బదిలీలు బేఖాతరు సాంకేతిక విద్యలో బదిలీలకు ప్రభుత్వం జూన్ 16న ఉత్తర్వులిచ్చింది. జీవో నం.91 ద్వారా ప్రిన్సిపాల్స్/డిప్యూటీ డైరెక్టర్ల స్థాయి అధికారులను బదిలీ చేసింది. జీవో నంబర్ 92 ద్వారా సెక్షన్ హెడ్ కేడర్ అధికారులను బదిలీ చేసింది. ఇందులోనూ ప్రభుత్వంలోని పెద్దల అండదండతో బదిలీ అయినా ఆ పోస్టులోకి వెళ్లకుండా కొంతమంది డైరెక్టరేట్‌లోనే చక్రం తిప్పుతున్నారు. ఈ విషయాన్ని గత నెలలో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో ఉన్నత స్థాయిలో విచారణ చేపట్టారు. వాస్తవాలు వెలుగులోకి రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు నటించారు. యధాస్థానాల్లో కొనసాగుతూ బోర్డులో చక్రం తిప్పుతున్నారు. బోర్డులో పాతుకుపోయారు ⇒ 2017 నుంచి బోర్డులో ఏడీగా కొనసాగుతున్న అధికారిని జూన్‌లో జంగారెడ్డిగూడెం బదిలీ చేయగా ఆయన బోర్డును మాత్రం వదల్లేదు. ⇒ 2018 నుంచి బోర్డులో పనిచేస్తున్న మరో అధికారిని గుంతకల్లు బదిలీ చేశారు. ఆయన కూడా అంతే. మరో అధికారిని ఇటీవల రాయదుర్గం బదిలీ చేసినా, ఆయన తీరూ ఇలానే ఉంది. ఇక డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న మరో అధికారిని హిందూపూర్ బదిలీ చేసినా, బోర్డును పట్టుకునే వేలాడుతున్నారు. ⇒ 2016 నుంచి బోర్డులో కొనసాగుతున్న ఓ అధికారిపై అవినీతి ఆరోపణలు రావడంతో గత కమిషనర్ చర్యలు తీసుకున్నారు. అనంతరం ప్రభుత్వం మారగానే తాను కీలక మంత్రికి బంధువునంటూ మళ్లీ బోర్డులోకి వచ్చేశారు. ఈయన్ను ఎటపాక బదిలీ చేసినా జీవోను సైతం రద్దు చేయించుకుని డైరెక్టర్ పేషీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ అన్నీ చక్కబెడుతున్నట్టు ఆరోపణలున్నాయి. -
గాడి తప్పిన.. ఖాకీ
అనంతపురం సెంట్రల్: రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన ఆ పోలీసు అధికారి గాడి తప్పారు. మాఫియాతో కుమ్మక్కై ప్రతి నెలా రూ. లక్షలు ఆర్జిస్తున్నారు. నగరంలోని వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో జరుగుతున్న ఈ అవినీతి దందా ఇటీవల ఆ అధికారి చేసిన కనికట్టు వ్యవహారంతో వెలుగులోకి వచ్చింది. వివరాలు... రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మూడు వాహనాలను ఇటీవల ఓ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని నగరంలో వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. దీనిపై విచారణ చేసి కేసు నమోదు చేయాల్సిన పోలీసు అధికారి రేషన్ మాఫియాతో బేరం కుదుర్చుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌కే టోకరా వేసి మూడింటిలో ఒక వాహనాన్ని గుట్టు చుప్పుడు కాకుండా వదిలిపెట్టారు. ఇందుకు సదరు రేషన్ మాఫియా భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు తెలిసింది. దీనిపై మిగిలిన రెండు వాహనాలకు సంబంధించిన వ్యక్తులు కూపీ లాగడంతో అసలు విషయం బయటపడింది. ఇదే కాదు... సదరు అధికారి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు వచ్చిన తర్వాత రేషన్ మాఫియా ద్వారా నెలనెలా భారీగానే వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాసుల కక్కుర్తి..అనంతపురం నగరాన్ని కేంద్రంగా చేసుకొని రేషన్ మాఫియా దందా చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల నుంచి గ్రామాల్లో సేకరించిన బియ్యాన్ని నగర శివారులోని ఓ గోడౌన్‌కు చేర్చడం... తర్వాత లారీల్లో కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. రేషన్ మాఫియాకు రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి డాన్‌గా వ్యవహరిస్తుండగా, నగరంలో ఓ మహిళ, ఎస్కే యూనివర్సిటీ సమీపంలో ఉన్న మరో వ్యక్తి కీలకంగా ఉన్నారు. వీరి వ్యవహారం మొత్తం పోలీసులకు తెలిసినా నెలనెలా మామూళ్లు తీసుకుంటూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే అక్రమాల డొంక కదులుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.అవినీతికి పాల్పడితే కఠిన చర్యలుజిల్లాలో రేషన్ మాఫియాపై ఫిర్యాదులు వస్తున్నాయి. రేషన్ అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదు. దీని వెనుక ఎంతటి వారున్నా చట్ట ప్రకారం చర్యలు తప్పవు. రేషన్ అక్రమంగా తరలుతున్నట్లు ఫిర్యాదు వచ్చిన మరుక్షణమే సిబ్బందిని అప్రమత్తం చేసి దాడులు చేస్తున్నాం. నగరంలో జరిగిన ఆ వ్యవహారంపై విచారిస్తాం. అవినీతికి పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.– పి. జగదీష్, ఎస్పీ -
క్వాలిఫయర్–2కు తెలుగు టైటాన్స్
న్యూఢిల్లీ: వరుస విజయాలతో విజృంభిస్తున్న తెలుగు టైటాన్స్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో ఫైనల్‌కు విజయం దూరంలో నిలిచింది. మంగళవారం హోరాహోరీగా సాగిన ఎలిమినేటర్–3లో తెలుగు టైటాన్స్ 46–39 పాయింట్ల తేడాతో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌పై నెగ్గింది. టైటాన్స్ తరఫున భరత్ హూడా 23 పాయింట్లతో మెరిశాడు. పట్నా పైరేట్స్ తరఫున అయాన్ 22 పాయింట్లతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ సీజన్లో అయాన్ 20కి పైగా పాయింట్లు సాధించడం ఇది ఆరోసారి. తద్వారా ఒకే సీజన్లో అత్యధిక సార్లు 20కి పైగా పాయింట్లు సాధించిన రెయిడర్‌గా అయాన్ చరిత్ర సృష్టించాడు. పీకేఎల్ 12వ సీజన్లో అయాన్ 316 పాయింట్లు సాధించడం విశేషం. గత సీజన్లో 184 పాయింట్లు నమోదు చేసుకున్న అతడు... ఈసారి పట్నా పైరేట్స్ ఎలిమినేటర్–3 వరకు రావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇరు జట్లు మ్యాచ్‌ను దూకుడుగా ఆరంభించగా... టైటాన్స్ 29 రెయిడ్ పాయింట్లు, పట్నా 27 రెయిడ్ పాయింట్లు సాధించాయి. ఇరు జట్లు రెండేసి సార్లు ఆలౌట్ కాగా... రెండేసి ఎక్స్ట్రా పాయింట్లు సాధించాయి. ట్యాక్లింగ్‌లో మెరుగ్గా నిలిచిన టైటాన్స్ ముందంజ వేసింది. నేడు జరిగే క్వాలిఫయర్–2లో పుణేరి పల్టన్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం ఫైనల్లో దబంగ్ ఢిల్లీతో టైటిల్ కోసం పోటీపడుతుంది. -
‘స్టెమ్’లో జెమ్ అయ్యేలా...
చాలామంది పిల్లలు ‘అనగనగా ఒక రాజు’ లాంటి కథలు చెబితే ఆసక్తిగా వింటారు. సైన్స్, మ్యాథ్స్ విషయాలు చెప్పబోతే మాత్రం ముఖం అటువైపు తిప్పుకుంటారు.అలాంటి వారి కోసం ‘స్టెమ్ మాన్స్టర్’ను ప్రారంభించింది డా. సోనాలి దాస్ గుప్తా. కథలు ఎలాగైతే ఆసక్తిగా వింటారో అంతే ఆసక్తితో సైన్స్ పాఠాలు వినేలా ‘స్టెమ్ మాన్స్టర్’ను డిజైన్ చేసింది సోనాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ చేసిన సోనాలి స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం)కు సంబంధించిన సంక్లిష్టమైన అంశాలు పిల్లలకు సులభంగా అర్థం చేయించడానికి ‘స్టెమ్ మాన్స్టర్’ మొదలుపెట్టింది. సైన్స్ సిద్ధాంతాలను వివరించడానికి ఎన్నో పరికరాలు, బొమ్మలు తయారు చేసింది. జటిలమైన సైన్స్ విషయాలను అర్థం చేసుకోవడంలో ఇవి విద్యార్థులకు బాగా ఉపయోగపడుతున్నాయి.‘మన పాఠశాలలు సైన్స్‌కు సంబంధించి నిర్వచనాలకే పరిమితం అవుతున్నాయి. నేను ప్రపంచంలోని కొన్ని అత్యున్నత ప్రయోగశాలలలో పనిచేశాను. సైన్స్‌కు సంబంధించి జటిలమైన విషయాలను పిల్లలకు సులభంగా ఎలా వివరిస్తారో చూశాను. మన పాఠ్యాంశాలు అత్యున్నతమైనవిగా నేను భావిస్తున్నాను. కాని వాటిని మనం పిల్లలకు పరిచయం చేసే విధానంలో సమగ్ర మార్పు అవసరం. ఆ మార్పు కోసమే...స్టెమ్ మాన్స్టర్’ అంటుంది సోనాలిదాస్ గుప్తా. ‘స్టెమ్మాన్స్టర్’ కోర్సులను జూమ్, ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో జోగి రమేష్ సత్యప్రమాణం
సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నంత పని చేశారు. విజయవాడ కననదుర్గమ్మ అమ్మవారి ఎదుట సత్యప్రమాణం చేశారు. సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి చేరుకున్న ఆయన.. ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద చేతిలో దివ్వెను వెలిగించుకుని ఈ వ్యవహారంలో తనకే సంబంధం లేదని అన్నారు.నా వ్యక్తిత్వంపై నింద వేశారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూశారు. నా మనసును బాధ పెట్టారు. అందుకే కుటుంబంతో సహా వచ్చా. నేను ఏ తప్పు చేయలేదని నిండు మనసుతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేశా. నా కుటుంబాన్ని అవమానపరిచి నా హృదయాన్ని గాయపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మని కోరుకున్నా. నేను ఏ తప్పు చేయను చేయలేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి బెజవాడ దుర్గమ్మ పై ప్రమాణానికి నేను సిద్ధమని నేను చెప్పాను. ఆ సవాలకు కట్టుబడి నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేశారు. నకిలీ మద్యం కేసులో నార్కో అనాలసిస్ టెస్ట్ , లై డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధం అని అన్నారాయన. ‘‘నకిలీ మద్యం కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఏం చెబుతారు?. నాపై తప్పుడు ఆరోపణలు చేసినవాళ్లు సత్యప్రమాణానికి సిద్ధమా?. పోనీ.. లైడిటెక్టర్ టెస్టుకైనా వచ్చే దమ్ముందా?. కనక దుర్గమ్మ సాక్షిగా వాళ్లు నేను తప్పు చేసినట్లు నిరూపించాలి’’ అని జోగి రమేష్ మరోమారు సవాల్ విసిరారు. -
డ్రాగన్ చూపు... ఆఫ్రికా వైపు
‘డ్రాగన్’ చూపు నార్త్ ఆఫ్రికాపై పడిందట. హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ యాడ్ షూటింగ్లో భాగంగా ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలైన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది.కాగా ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ నార్త్ ఆఫ్రికా లొకేషన్స్‌లో... ముఖ్యంగా ట్యూనిషియా దేశంలో జరగనుందని సమాచారం. అక్కడి లొకేషన్స్‌ను ఫైనలైజ్ చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ నెలాఖర్లో నార్త్ ఆఫ్రికాకు వెళ్తున్నారని, నవంబరు నెలలో ట్యూనిషియా లొకేషన్స్‌లో ‘డ్రాగన్’ చిత్రీకరణ జరగనుందనే టాక్ వినిపిస్తోంది. నవంబరు మొదటి వారంలో హైదరాబాద్‌లో కొంత చిత్రీకరణ జరిపి, ఆ తర్వాత అదే నెల చివర్లో ఆఫ్రికా వెళ్లే ఆలోచనలో ఉన్నారని భోగట్టా. టీ–సిరీస్ ఫిల్మ్స్, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ల సమర్పణలో నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ యెర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
పత్తి విక్రయం ఇక సులువు
● అందుబాటులోకి కపాస్ కిసాన్ యాప్ ● స్లాట్ బుక్ చేసుకుంటేనే కొనుగోలు ● రైతులకు ఎంతో మేలంటున్న అధికారులుదుద్యాల్: పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా కపాస్ కిసాన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సీజన్లో పత్తి అమ్ముకోవాలనుకునే రైతులు తమ వివరాలతో పాటుగా, పంట సాగుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల రద్దీని తగ్గించడమే కాకుండా అక్రమాలను అడ్డుకోవచ్చని సీసీఐ భావిస్తోంది. తేమ శాతం ఆధారంగా ధర పత్తిలో తేమ శాతం ఆధారంగా సీసీఐ వారు ధరను చెల్లించనున్నారు. ప్రభుత్వం క్వింటాలు పత్తికి కనీస మద్దతు ధరను రూ.8,110గా నిర్ణయించింది. తేమ 12 శాతం మించి ఎక్కువ ఉంటే సీసీఐ వారు పత్తిని కొనుగోలు చేయరు. పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ సీసీఐ తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్‌ను స్మార్టు ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ను డౌన్లోడ్ తర్వాత పేరు, జండర్, పుట్టిన తేదీ, కులం, చిరునామా, ఆధార్, ఫోన్ నంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, తర్వాత తాము ఏ కొనుగోలు కేంద్రంలో పత్తి అమ్మాలనుకుంటు న్నారో వివరాలు సైతం యాప్‌లో నమోదు చేయాలి. అదేవిధంగా పట్టాదారు పాస్‌పుస్తకం, సర్వేనంబర్, రైతుకు ఉన్న భూమి, పత్తి సాగు చేసిన విస్తీర్ణం, రైతు ఫొటో, ఆధార్ కార్డును యాప్‌లో అప్లోడ్ చేయాలి. దీంతో ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. పత్తి అమ్మిన తర్వాత ఆధార్ నెంబర్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో అధికారులు నగదు జమ చేస్తారు. రైతుల సౌకర్యార్థం పత్తి కొనుగోలు సంబంఽధిత సేవలకు 18005995779 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కావాల్సిన పత్రాలు రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు పట్టాదారు పాసు పుస్తకం బ్యాంక్ ఖాతా పుస్తకం ఆధార్‌కు బ్యాంక్ ఖాతాతో లింక్ అయిన మొబైల్ ఫోన్ నంబర్ గతంలో పత్తి విక్రయించేందుకు జిన్నింగ్ మిల్లుల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. కపాస్ కిసాన్ యాప్‌తో ఈ సమస్య ఉండదు. ఒక కొనుగోలు కేంద్రం వద్ద ఒక రోజు పరిమిత సంఖ్యలో రైతులకు స్లాట్ బుక్ అవుతుంది. వారు మాత్రమే వచ్చి పంటను విక్రయించుకోవాలి. రైతుల సౌలభ్యం కోసమే ఈ య్యాప్‌ను రూపొందించారు. ఈ అవకాశాన్ని పత్తి రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – నాగరాజు, మండల వ్యవసాయాధికారి, దుద్యాల్
