గాడి తప్పిన.. ఖాకీ
వన్‌టౌన్‌లో ఓ పోలీసు అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు
ఇటీవల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మూడు వాహనాలు
గుట్టు చప్పుడు కాకుండా ఓ వాహనాన్ని వదిలిపెట్టిన వైనం
రూ.లక్షల్లో ముడుపులు ముట్టాయని ఆరోపణలు
అనంతపురం సెంట్రల్: రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన ఆ పోలీసు అధికారి గాడి తప్పారు. మాఫియాతో కుమ్మక్కై ప్రతి నెలా రూ. లక్షలు ఆర్జిస్తున్నారు. నగరంలోని వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో జరుగుతున్న ఈ అవినీతి దందా ఇటీవల ఆ అధికారి చేసిన కనికట్టు వ్యవహారంతో వెలుగులోకి వచ్చింది. వివరాలు... రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మూడు వాహనాలను ఇటీవల ఓ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని నగరంలో వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. దీనిపై విచారణ చేసి కేసు నమోదు చేయాల్సిన పోలీసు అధికారి రేషన్ మాఫియాతో బేరం కుదుర్చుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌కే టోకరా వేసి మూడింటిలో ఒక వాహనాన్ని గుట్టు చుప్పుడు కాకుండా వదిలిపెట్టారు. ఇందుకు సదరు రేషన్ మాఫియా భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు తెలిసింది. దీనిపై మిగిలిన రెండు వాహనాలకు సంబంధించిన వ్యక్తులు కూపీ లాగడంతో అసలు విషయం బయటపడింది. ఇదే కాదు... సదరు అధికారి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు వచ్చిన తర్వాత రేషన్ మాఫియా ద్వారా నెలనెలా భారీగానే వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
కాసుల కక్కుర్తి..
అనంతపురం నగరాన్ని కేంద్రంగా చేసుకొని రేషన్ మాఫియా దందా చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల నుంచి గ్రామాల్లో సేకరించిన బియ్యాన్ని నగర శివారులోని ఓ గోడౌన్‌కు చేర్చడం... తర్వాత లారీల్లో కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. రేషన్ మాఫియాకు రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి డాన్‌గా వ్యవహరిస్తుండగా, నగరంలో ఓ మహిళ, ఎస్కే యూనివర్సిటీ సమీపంలో ఉన్న మరో వ్యక్తి కీలకంగా ఉన్నారు. వీరి వ్యవహారం మొత్తం పోలీసులకు తెలిసినా నెలనెలా మామూళ్లు తీసుకుంటూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే అక్రమాల డొంక కదులుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
జిల్లాలో రేషన్ మాఫియాపై ఫిర్యాదులు వస్తున్నాయి. రేషన్ అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదు. దీని వెనుక ఎంతటి వారున్నా చట్ట ప్రకారం చర్యలు తప్పవు. రేషన్ అక్రమంగా తరలుతున్నట్లు ఫిర్యాదు వచ్చిన మరుక్షణమే సిబ్బందిని అప్రమత్తం చేసి దాడులు చేస్తున్నాం. నగరంలో జరిగిన ఆ వ్యవహారంపై విచారిస్తాం. అవినీతికి పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.
– పి. జగదీష్, ఎస్పీ


