ఇచ్చిన డబ్బు అడిగితే అవమానించారు
కళ్యాణదుర్గం: ‘అవసరానికి ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించలేదు. డబ్బు ఇవ్వాలని అడిగితే టీడీపీ నేతల అండ చూసుకుని అవమానించారు. ఫిర్యాదు చేసినా పోలీసులూ పట్టించుకోలేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మందు తాగాడు. వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గంలోని పుట్టగోసుల వీధిలో నివాముంటున్న ఆర్టీసీ ఉద్యోగి వెంకటస్వామి కుమారుడు కృష్ణగౌడ్ తాను చనిపోవడానికి కారణం బియ్యం జయమ్మ, ఆమె పెద్ద కుమారుడు ప్రకాష్, చిన్న కుమారుడు ప్రకాష్ అని సెల్ఫీ వీడియోలో విలపిస్తూ పురుగుల మందు తాగాడు. వారిని నమ్మి దాదాపుగా రూ.14.50 లక్షలు అప్పుగా ఇచ్చానని పేర్కొన్నాడు. అలాగే తన స్నేహితుడు సాయితేజ ద్వారా మరో రూ.3 లక్షలు ఇప్పించానన్నాడు. పది రోజుల క్రితం ఫిర్యాదు చేసినా పట్టణ పోలీసులు పట్టించుకోలేదని వాపోయాడు. రెండు రోజుల క్రితం టీడీపీ నాయకుడు కొండాపురం అనిల్‌చౌదరి దుకాణంలో ఆ పార్టీ నేతల సమక్షంలో పంచాయితీ పెట్టించారన్నారు. జయమ్మ దూషిస్తూ చెయ్యి చేసుకుందని, ఈ అవమానం భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. అనంతరం ఆ వీడియోను తన స్నేహితులకు షేర్ చేశాడు. దీంతో అప్రమత్తమైన స్నేహితులు, కుటుంబసభ్యులు కృష్ణగౌడ్ లొకేషన్ ఆధారంగా ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని అపస్మారకస్థితిలో పడి ఉన్న అతన్ని వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. తండ్రి వెంకటస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా
పురుగుల మందు తాగుతూ
యువకుడి సెల్ఫీ వీడియో


