breaking news
-
కస్టమ్స్ అధికారిపై మూక దాడి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మూక దాడి ఘటన చోటుచేసుకుంది. ఒక కస్టమ్స్ ఇన్స్పెక్టర్, అతని భార్యపై వారి ఇంటిలో ఆటో డ్రైవర్ నేతృత్వంలోని 50 మంది గుంపు దాడికి పాల్పడింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ఇంటికి ఆలస్యంగా వచ్చారు.ఇంతలో దాడికి పాల్పడినవారంతా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, అతని భార్య కారులో ఇంటికి వస్తుండగా వారి ఇంటి సమీపలో వారి కారును ఒక ఆటో ఢీకొంది. ఈ నేపధ్యంలో ఆటోడ్రైవర్ అజీజుల్ గాజీతో ప్రదీప్ కుమార్ ఘర్షణకు దిగారు. ఇది జరిగిన కొద్దిసేపటి తరువాత ఆటోడ్రైవర్ అజీజుల్ గాజీ కొంతమందిని తనతోపాటు తీసుకువచ్చి, ఆ అధికారి అపార్ట్మెంట్లోకి చొరబడ్డాడు. తరువాత అక్కడ విధ్వంసం సృష్టించారు.బాధితుడు ప్రదీప్ కుమార్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 50 మంది అతని ఇంటిలోనికి చొరబడి, అతనిని అతని భార్యను దారుణంగా కొట్టారు. తరువాత అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు వెంటనే బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందుకున్న తర్వాత ప్రదీప్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. దాడిలో పాల్గొన్న ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
1996 ప్రళయం.. కోనసీమ వాసుల భయం
మోంథా తుపాను కాకినాడ జిల్లా వాసుల్లో భయాందోళన రేపుతోంది. పెను తుపానుగా మారి ఊహించని రీతిలో విధ్వంసం కలిగిస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా ప్రజలు భీతిల్లుతున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. పెను తుపానుగా మారిపోయి, కాకినాడ సమీపంలో తీర దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. తుపాను తీరం దాటే సమయంలో సుమారు 110 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని, కుండపోతగా వర్షం పడుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో 1996 నాటి ప్రళయాన్ని గుర్తు చేసుకుని కాకినాడ జిల్లా వాసులు కంపితులవుతున్నారు.1996 ప్రళయం 1996 నవంబరు 6న కాకినాడ – యానాం మధ్య తీరం దాటిన ప్రపంచ తుపాను కోనసీమను కకావికలం చేసింది. సుమారు 215 కిలోమీటర్ల వేగంతో వీచిన పెను గాలులు ధాటికి కోనసీమ ప్రాంతం చిన్నాభిన్నమైంది. సముద్ర తీరంలో అలలు భారీ ఎత్తున అలలు ఎగసిపడి ఉప్పెన ముంచెత్తడంతో కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో సముద్ర తీర మత్స్యకార గ్రామాలు ధ్వంసమయ్యాయి. కాట్రేనికోన మండలం భైరవపాలెం, బలుసుతిప్ప గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయి.భారీగా ప్రాణ, ఆస్తి నష్టంఅధికారిక లెక్కల ప్రకారం.. నాటి తుపాను బీభత్సానికి 1,077 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 2.25 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 6.47 లక్షల ఇళ్లు దెబ్బ తిన్నాయి. వీటిలో 40 వేల ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వేలాది పశువులు, మూగ ప్రాణులు మృత్యువాత పడ్డాయి. 5.97 లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. 20 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు నేల కూలాయి. ఆ తుపాను వచ్చి సుమారు 30 ఏళ్లవుతున్నా నాటి విషాదం ఈ ప్రాంత వాసులకు ఇప్పటికీ కళ్ల ముందే కదలాడుతోంది.ప్రభుత్వ వైఫల్యం1996 నాటి తుపాను నుంచి కోలుకునేందుకు కోనసీమ (Konaseema) వాసులకు పదేళ్ల సమయం పట్టిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నాటి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి చంబ్రాబు నాయుడు సీఎంగా ఉన్నారు. తుపాను ముందు హెచ్చరికలు చేయకపోవడంతో పాటు కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోవడంతో కోనసీమకు తీరని నష్టం జరిగింది.ప్రస్తుతం.. అప్రమత్తంనాటి అనుభవాలను గమనంలోకి తీసుకుని కాకినాడ జిల్లా (Kakinada District) అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మోంథా తుపాను (Cyclone Montha) నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఉప్పాడ రోడ్డును ముందు జాగ్రత్తగా మూసివేశారు. జిల్లాలోని స్కూల్స్, కాలేజీలు అన్నింటికీ నాలుగు రోజులు సెలువులు ప్రకటించారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా కట్టడి చేశారు. అలాగే పొలం పనులను వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించారు.చదవండి: కాకినాడ తీరానికి ఉప్పెన ముప్పు!గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులందరినీ అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొవడానికి సిద్ధం చేశారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలితో పాటు జిల్లా ప్రత్యేక అధికారి మైలవరపు కృష్ణతేజ (Krishna Teja Mylavarapu) ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, కిందిస్థాయి అధికారులకు తగువిధంగా ఆదేశాలిస్తున్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సహాయక చర్యలను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా వైద్యపరంగా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నారు. -
బాలుడి హత్య కేసులో నిందితుడి అరెస్ట్
అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలో ఐదేళ్ల బాలుడు సుశాంత్‌ను దారుణంగా హత్య చేసిన పెన్నయ్యను మూడో పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ తెలిపిన మేరకు.. నగరంలోని అరుణోదయ కాలనీలో నివాసముంటున్న గోవిందహరి, నాగవేణి దంపతుల కుమారుడు సుశాంత్(5) దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. గత శనివారం రాత్రి 12 గంటల సమయంలో టిఫెన్ తినడానికి దంపతులిద్దరూ ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లిన సమయంలో పొరుగింటిలో నివాసముంటున్న ఆటోడ్రైవర్ పెన్నయ్య బాలుడిని హత్య చేసి సంచిలో తీసుకెళ్లి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ముళ్ల పొదల్లోకి పడేశాడు. అయితే బాలుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. అనుమానితుడు పెన్నయ్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో నేరాన్ని అంగీకరించాడు. ఇందుకు కారణాలను వెల్లడించాడు. పెన్నయ్య గతంలో పెళ్లి చేసుకున్న ఆమె విభేదించి వెళ్లిపోయింది. దీంతో సావిత్రి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కొద్దికాలంగా ఆమెతోనూ మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఇటీవల సావిత్రి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు కారణం సుశాంత్ తల్లి నాగవేణి అని కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వారిపై కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే బాలుడిని హత్య చేసినట్లు విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 566.96 పాయింట్లు లేదా 0.67 శాతం లాభంతో.. 84,778.84 వద్ద, నిఫ్టీ 170.90 పాయింట్లు లేదా 0.66 శాతం లాభంతో 25,966.05 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్, భారత్ వైర్ రోప్స్, భాగ్యనగర్ ఇండియా, PSP ప్రాజెక్ట్స్, ఎస్సార్ షిప్పింగ్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరగా.. నిరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్, లాటీస్ ఇండస్ట్రీస్, డెల్ఫి వరల్డ్ మనీ, జీఎం బ్రూవరీస్, శ్యామ్ టెలికాం కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పోలవరం ముంపు ప్రాంతాల నిర్వాసితులలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్ )రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. నవంబర్ 21, 22, 23 తేదీలలో పోలవరం నిర్వాసితుల ఆవేదన పేరిట బైక్ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 23వ తేదీన వేలేరుపాడులో ఆవేదన సభ జరుగుతుందన్నారు. విజయవాడలోని దాసరి భవన్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాజేంద్ర బాబు మాట్లాడుతూ పోలవరం ముంపు ప్రాంతాల్లో 2016లో భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేశారని, పునరావాసం, పరిహారం ప్యాకేజి 2016వ సంవత్సరాన్ని కట్ ఆఫ్ డేట్ గా పరిగణనలోకి తీసుకున్నారన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతకు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. పూర్తి స్థాయిలో పరిహారం నిర్వాసితులకు అందలేదన్నారు. పోలవరం నిర్వాసిత కుటుంబాలను కాలనీలకు తరలించే నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతను ప్యాకేజీకి అర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు యుగంధర్, సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఐక్యరాజ్య సమితి సమావేశానికి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి
ఢిల్లీ: 80వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి వైఎస్సార్సీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి హాజరుకానున్నారు. యూఎన్ సమావేశాల కోసం ఆయన న్యూయార్క్ చేరుకున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో మిథున్‌రెడ్డి పాల్గొనున్నారు. ఐక్యరాజ్యసమితి హెడ్ క్వార్టర్స్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి మిథున్‌రెడ్డి నివాళులర్పించారు. మిథున్‌రెడ్డితో పాటు ఎంపీల బృందం సమావేశాల్లో పాల్గొననుంది.ఐక్య రాజ్యసమితి సమావేశాల్లో మిథున్‌రెడ్డి.. భారత వాణి బలంగా వినిపించనున్నారు. ఐక్య రాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు భారత ఎంపీలు రెండు బృందాలుగా హాజరవుతున్నారు. ఒక్కో బృందంలో 15 మంది ఎంపీలు ఉన్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు ఐక్యరాజ్యసమితి సమావేశాలలో ఎంపీల బృందం పాల్గొననుంది. -
జాబ్ చేస్తూ యాక్టింగ్.. కానీ 25 ఏళ్లకే తనువు చాలించి
ఈనెలలో బాలీవుడ్లో పలువురు సెలబ్రిటీల మరణాలు కలిచివేశాయి. వీటి నుంచి తేరుకోకముందే ఇండస్ట్రీలో మరో విషాదం. 'జమత్ర' అనే వెబ్ సిరీస్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నమరాఠీ నటుడు సచిన్ చంద్వాడే (25) తనువు చాలించాడు. ఇంట్లోనే ఊరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ప్రస్తుతం జమత్ర 2, అసురవన్ అనే సిరీస్‌లు చేస్తున్న సచిన్.. మరోవైపు విప్రో పుణె బ్రాంచ్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం కూడా చేస్తున్నాడు. కారణం ఏంటో తెలీదు గానీ ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో ఇంట్లోనే ఊరి వేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఇది తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు.. సచిన్‌ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ధులే సిటీకి తీసుకెళ్లారు. అలా దాదాపు 24 గంటల పాటు మృత్యువుతో పోరాడి 24వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో తుదిశ్వాస విడిచాడు.చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టమున్న సచిన్.. అందుకు తగ్గట్లే ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు సినిమాలు, సిరీస్‌ల్లో నటిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం కూడా 'జమత్ర 2'లో తన పాత్ర గురించి పోస్ట్ పెట్టాడు. ఇంతలోనే ఇలా ప్రాణాలు తీసుకోవడంతో సన్నిహితులు, సహ నటీనటులు షాక్ అవుతున్నారు. -
Shreyas Iyer: పక్కటెముక గాయం అంటే..? వామ్మో.. మరీ అంత డేంజరా?
టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పక్కటెముక గాయంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తొలుత చిన్నగాయంలా అనిపించినా.. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన తర్వాత పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం శ్రేయస్ సిడ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు బీసీసీఐ పేర్కొంది. సాధారణంగా ఆటగాళ్లు మైదానంలో గాయపడటం సహజమే. కానీ కొన్ని గాయాలు మాత్రం ఆటగాళ్లను చాలా ఇబ్బంది పెడుతుంటాయి. మరి ఇక్కడ శ్రేయస్ ఎదుర్కొంటున్న పక్కటెముక గాయం అంత తీవ్రతరమైనదా..? అసలేంటి గాయం వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.పక్కటెముక గాయం అంటే..ఈ గాయం ఎక్కువగా కారు ప్రమాదాలు, క్రీడల్లోనూ జరుగుతుంటాయని చెబుతున్నారు నిపుణులు. మరికొన్ని ఇతర గాయాల వల్ల కూడా ఈ పక్కటెముకల గాయం సంభవిస్తుందట. ఒక్కోసారి ఎలాంటి గాయం అవ్వకుండానే పక్కటెముకలు విరిగే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. అంతర్గత అవయవాలు దెబ్బతీస్తే తప్ప పక్కటెముక గాయం సివియర్ అవ్వదని చెబుతున్నారు. దీనికి ఆపరేషన్ చేయడం అనేది కూడా అరుదు అని. చెబుతున్నారు. పక్కెటెముకల మధ్య పగుళ్లు వస్తే..తగిన విశ్రాంతి, శ్వాస వ్యాయామాలు, చికిత్స అవసరం అవుతాయని, కోలుకోవడానికి కనీసం ఒక నెల పడుతుందటని చెబుతున్నారు వైద్యులు. పక్కటెముక విరిగితే..పక్కటెముక విరగడాన్ని వైద్య పరిభాషలో సాధారణంగా ఎముక తప్పిందని(స్థానభ్రంశం) చెబుతుంటారు. ఇలా ఎముక విరిగినప్పుడూ చుట్టు పగులు, ఖాళీ ఏర్పుడుతుంది. అలాంటప్పుడు విశ్రాంతి ఒక్కటే సరిపోదట. దాన్ని సరిచేసేందుకు శస్త్ర చికిత్స అవసరం అవుతుందని చెబుతున్నారు. అలాగే ఇవి విరగడం అనేది కూడా అత్యంత అరుదేనట. ఎందుకంటే పెద్దపెద్ద యాక్సిడెంట్లు, లేదా ఆటల్లోనే ఇలాంటి గాయాల బారినపడే అవకాశం ఉంటుందట. ఇవి మన శరీరంలోని బలమైన ఎముకల్లో ఒకటి కావడంతో అంత సులభంగా గాయలవ్వడం అత్యంత అరుదని చెబుతున్నారు నిపుణులు. లక్షణాలు..శ్వాస తీసుకున్న, దగ్గినా, ఛాతీ పైభాగాన్ని కదిలించిన త్రీమైన నొప్పిముట్టుకున్న తట్టుకోలేనంత నొప్పి, వాపుగాయం లేదా రంగు మారడంవామ్మో.. మరీ అంత డేంజరా? అంటే..పక్కటెముకలు గాయం ఒక్కోసారి ప్రాణాంతకంగా మారతాయట. అప్పుడు ఇతర అంతర్గత అవయవాలైనా.. గుండె, కాలేయం, కడుపు, మూత్రపిండాలు, ప్లీహాన్ని కూడా ప్రభావితం చేస్తుందట. దీనివలన రక్తస్రావం కూడా జరుగుతుందని చెబుతున్నారు.ఒక్కోసారి ఊపిరి ఆడకపోవడం, శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడటం వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయట. ఫలితంగా న్యుమోనియా వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని, ప్రత్యేక పరిస్థితుల్లో ఊపిరితిత్తులు వైఫల్యం చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Weight Loss Tips: సన్నజాజిలా స్లిమ్‌గా అవ్వాలంటే..సిమర్ టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సిందే!) -
ఎల్రక్టానిక్స్ విడిభాగాల స్కీము కింద 7 ప్రాజెక్టులు ఓకే..
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ విడిభాగాల తయారీ స్కీము (ఈసీఎంఎస్) కింద ఏడు ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీటి విలువ రూ. 5,532 కోట్లని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సదరు ప్రాజెక్టుల కింద దేశీయంగా ఎలక్ట్రానిక్స్ విడిభాగాలను ఉత్పత్తి చేయడం వల్ల రూ. 20,000 కోట్ల మేర దిగుమతి బిల్లుల భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఇవి సుమారు 5,195 ఉద్యోగావకాశాలు కల్పించగలవని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. స్కీము కోసం మొత్తం 249 ప్రతిపాదనలు వచ్చినట్లు మంత్రి చెప్పారు. పీసీబీ ప్రాజెక్టులు దేశీయంగా 27 శాతం అవసరాలను, కెమెరా మాడ్యూల్స్ 15% డిమాండ్‌ను తీరుస్తాయన్నారు. ప్రాజెక్టులివీ..గ్రీన్ సిగ్నల్ లభించిన వాటిల్లో మదర్బోర్డ్ బేస్, కెమెరా మాడ్యూల్స్, కాపర్ ల్యామినేట్స్, పాలీప్రొపిలీన్ ఫిలిమ్ ప్రాజెక్టులు మొదలైనవి ఉన్నాయి. కేనెస్ గ్రూప్‌నకు చెందినవి నాలుగు, సిర్మా గ్రూప్, యాంబర్ గ్రూప్‌లో భాగమైన ఎసెంట్ సర్క్యూట్స్, ఎస్ఆర్ఎఫ్ సంస్థలకు సంబంధించి తలా ఒక ప్రాజెక్టు ఉన్నాయి. నాలుగు ప్రాజెక్టులపై కేనెస్ రూ. 3,280 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. రూ. 4,300 కోట్లు విలువ చేసే మల్టీ లేయర్ పీసీబీలు, రూ. 12,630 కోట్ల విలువ చేసే కెమెరా మాడ్యూల్ సబ్–అసెంబ్లీలు, రూ. 6,875 కోట్ల విలువ చేసే హెచ్‌డీఐ (హై–డెన్సిటీ కనెక్ట్) పీసీబీలను తయారు చేయనుంది. మరోవైపు, రూ. 991 కోట్ల పెట్టుబడులతో ఎసెంట్ సర్క్యూట్స్ రూ. 7,847 కోట్ల మలీ్ట–లేయర్ పీసీబీలను ఉత్పత్తి చేయనుంది. సిర్మా స్ట్రాటెజిక్ ఎల్రక్టానిక్స్ రూ. 765 కోట్లతో రూ. 6,933 కోట్ల విలువ చేసే మలీ్ట–లేయర్ పీసీబీలను, ఎస్ఆర్ఎఫ్ రూ. 496 కోట్ల పెట్టుబడులతో రూ. 1,311 కోట్ల పాలీప్రొపిలీన్ ఫిలింలను ఉత్పత్తి చేయనున్నాయి. -
కాకినాడ తీరానికి ఉప్పెన ముప్పు!
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: మోంథా తీవ్ర తుపాను ప్రభావంతో కాకినాడ తీరానికి ఉప్పెన అవకాశం పొంచి ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గంటకు 8 కి.మీ. వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. విశాఖపట్నానికి ఆగ్నేయ దిశలో 790 కి.మీ., కాకినాడకు ఆగ్నేయంగా 780 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ 28న మంగళవారం ఉదయానికి మరింత బలపడి మోంథా తుపానుగా (Cyclone Montha) మారనుంది. మోంథాగా మారిన అనంతరం వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం మధ్యాహ్నం నాటికి తీవ్ర తుపానుగా మారనుంది. ఆ తరువాత ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. మోంథా.. తీవ్ర తుపానుగా మారిన సమయంలో గంటకు 90 నుంచి 100 కి.మీ., గరిష్టంగా 110 నుంచి 120 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీరం దాటిన తర్వాత క్రమేపీ బలహీనపడుతూ వాయుగుండంగా మారుతుందని ఈ సమయంలో పెనుగాలులు, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 28న 14 జిల్లాలకు రెడ్ అలెర్ట్ 28వ తేదీన తీవ్ర తుపాను తీరం దాటే సమయం కావడంతో రాష్ట్రంపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. కోస్తా, రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిలా్లలకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది. పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 29న 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్ 29వ తేదీన కూడా తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటూ.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 30వ తేదీన కూడా తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రాకాసి అలలు విరుచుకుపడతాయ్ కోస్తాంధ్ర తీరమంతటా బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలెవరూ సముద్రం వైపు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. విశాఖలో ముఖ్యమైన బీచ్‌ల వద్దకు సందర్శకులు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 28న మోంథా తీరం దాటే వరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. అలలు ఉప్పెనలా ఎగిసి పడతాయని హెచ్చరించారు. ముఖ్యంగా తీరం దాటే సమయంలో ఆంధ్రప్రదేశ్, యానాం తీరంలో అలలు విరుచుకుపడతాయని.. సముద్రం ఒడ్డున ఉన్న మత్స్యకార గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని సముద్ర తీరంలో అలలు 2 నుంచి 3.5 మీటర్లు, విశాఖపట్నం నుంచి పశ్చిమగోదావరి తీరం వెంబడి 2.1 నుంచి 4 మీటర్ల ఎత్తున రాకాసి అలలు విరుచుకుపడనున్నాయి. తీరం దాటే ప్రాంతంలో అలలు ఉప్పెనలా ఎగిసిపడి తీరం కోతకు గురి చేస్తాయని.. సమీపంలో ఉన్న మత్స్యకార గ్రామాల్లోకి నీరు చొచ్చుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 29 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ మోంథా విరుచుకుపడనున్న నేపథ్యంలో పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గంగవరం, కాకినాడ పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరికతో పాటు సిగ్నల్ నంబర్–5ని జారీ చేశారు. కళింగపట్నం, వాడరేవు, భీమునిపట్నం పోర్టుల్లో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తుపాను సమాచారం, సహాయక చర్యలు అవసరమైన వారి కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అవసరమైతే ప్రజలు 112, 1070, 1800–425–0101 నంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు. నేడు 7 జిల్లాలకు రెడ్ అలెర్ట్కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది.జిల్లాల్లో ప్రత్యేక అధికారుల నియామకం తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా ఐఏఎస్‌లని నియమించింది. శ్రీకాకుళం జిల్లాకు చక్రధర్‌బాబు, విజయనగరం జిల్లాకు రవి సుభాష్, పార్వతీపురం మన్యం జిల్లాకు నారాయణ భరత్‌గుప్తా, విశాఖపట్నం జిల్లాకు అజయ్‌జైన్, అనకాపల్లి, ఏఎస్సార్ జిల్లాలకు వాడ్రేవు వినయ్‌చంద్, తూర్పుగోదావరికి కె.కన్నబాబు, కాకినాడకు కృష్ణతేజ, కోనసీమకు విజయరామరాజు, పశ్చిమగోదావరికి ప్రసన్న వెంకటేష్, ఏలూరుకు కాంతిలాల్ దండే, కృష్ణా జిల్లాకు ఆమ్రపాలి, ఎన్టీఆర్ జిల్లాకు శశిభూషణ్‌కుమార్, గుంటూరుకు ఆర్పీ సిసోడియా, బాపట్లకు వేణుగోపాల్‌రెడ్డి, ప్రకాశం జిల్లాకు కోన శశిధర్, నెల్లూరుకు యువరాజ్, తిరుపతికి అరుణ్‌బాబు, చిత్తూరు జిల్లాకు గిరీషాను నియమించారు.శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు ఉన్న జిల్లాలకు జోనల్ ఇన్చార్జిగా అజయ్జైన్ని నియమించగా.. పశ్చిమగోదావరి నుంచి చిత్తూరు వరకూ జోనల్ ఇన్చార్జిగా ఆర్పీ సిసోడియాని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
