పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పోలవరం ముంపు ప్రాంతాల నిర్వాసితులలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్ )రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. నవంబర్ 21, 22, 23 తేదీలలో పోలవరం నిర్వాసితుల ఆవేదన పేరిట బైక్ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 23వ తేదీన వేలేరుపాడులో ఆవేదన సభ జరుగుతుందన్నారు. విజయవాడలోని దాసరి భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాజేంద్ర బాబు మాట్లాడుతూ పోలవరం ముంపు ప్రాంతాల్లో 2016లో భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేశారని, పునరావాసం, పరిహారం ప్యాకేజి 2016వ సంవత్సరాన్ని కట్ ఆఫ్ డేట్ గా పరిగణనలోకి తీసుకున్నారన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతకు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. పూర్తి స్థాయిలో పరిహారం నిర్వాసితులకు అందలేదన్నారు. పోలవరం నిర్వాసిత కుటుంబాలను కాలనీలకు తరలించే నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతను ప్యాకేజీకి అర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు యుగంధర్, సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


