బాలుడి హత్య కేసులో నిందితుడి అరెస్ట్
అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలో ఐదేళ్ల బాలుడు సుశాంత్‌ను దారుణంగా హత్య చేసిన పెన్నయ్యను మూడో పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ తెలిపిన మేరకు.. నగరంలోని అరుణోదయ కాలనీలో నివాసముంటున్న గోవిందహరి, నాగవేణి దంపతుల కుమారుడు సుశాంత్(5) దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. గత శనివారం రాత్రి 12 గంటల సమయంలో టిఫెన్ తినడానికి దంపతులిద్దరూ ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లిన సమయంలో పొరుగింటిలో నివాసముంటున్న ఆటోడ్రైవర్ పెన్నయ్య బాలుడిని హత్య చేసి సంచిలో తీసుకెళ్లి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ముళ్ల పొదల్లోకి పడేశాడు. అయితే బాలుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. అనుమానితుడు పెన్నయ్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో నేరాన్ని అంగీకరించాడు. ఇందుకు కారణాలను వెల్లడించాడు. పెన్నయ్య గతంలో పెళ్లి చేసుకున్న ఆమె విభేదించి వెళ్లిపోయింది. దీంతో సావిత్రి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కొద్దికాలంగా ఆమెతోనూ మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఇటీవల సావిత్రి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు కారణం సుశాంత్ తల్లి నాగవేణి అని కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వారిపై కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే బాలుడిని హత్య చేసినట్లు విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు మంగళవారం రిమాండ్‌కు తరలించారు.


