breaking news
-
భారత్ సెమీస్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా
ఇండోర్: మహిళల వన్డే వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్లో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో తలపడనుంది. ఆడిన 7 మ్యాచ్‌లలో 6 విజయాలతో (1 రద్దు) పాయింట్ల పట్టికలో ఆసీస్ అగ్రస్థానాన్ని అందుకుంది. నేడు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్‌కు నాలుగో స్థానం ఖాయమైంది. భారత్, ఆ్రస్టేలియా సెమీస్ 30న ముంబైలో జరగనుండగా, గువాహటిలో 29న జరిగే తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ తలపడనుంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 24 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. లారా వోల్వర్ట్ (30), సినాలో జాఫ్తా (29) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలానా కింగ్ (7/18) తన లెగ్ స్పిన్‌తో 7 వికెట్లు పడగొట్టి సత్తా చాటింది. మహిళల వన్డేల్లో ఇది నాలుగో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం. అనంతరం ఆ్రస్టేలియా 16.5 ఓవర్లలో 3 వికెట్లకు 98 పరుగులు చేసి విజయాన్నందుకుంది. బెత్ మూనీ (42), జార్జియా వోల్ (38 నాటౌట్) కలిసి జట్టును గెలిపించారు. -
AI Film Hackathon: ఏఐ సినిమాలకు పోటీ..
యాక్టింగ్, షూటింగ్, మ్యూజిక్, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్.. ఇలా అన్నీ ఏఐ (Artificial Intelligence) చూసుకుంటోంది. అవును, హీరోహీరోయిన్లతో పనే లేకుండా కేవలం ఏఐను వాడుకుని సినిమాలు తీస్తున్నారు. అలాంటి సినిమాలకు ఓ పోటీ కూడా పెట్టారు. అదే ఏఐ హాకథాన్. దేశంలో తొలిసారి ఈ ఏఐ హాకథాన్ జరుగుతోంది. ముంబైలో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ హాకథాన్‌లో 50 మంది క్రియేటర్స్ పాల్గొననున్నారు. వీరు విడివిడిగా లేదా జట్లుగా తయారై ఏఐ టూల్స్ ఉపయోగించి షార్ట్ ఫిలింస్ రూపొందించాల్సి ఉంటుంది. పోటీ చివరిరోజు ఈ సినిమాలను ప్రదర్శించి విజేతలను ప్రకటిస్తారు. విజేతలకు రూ.10 లక్షల ప్రైజ్‌మనీ ఉంటుంది. అమెరికా వంటి దేశాల్లో ఇలాంటి ఏఐ ఈవెంట్స్ తరచూ జరుగుతూ ఉంటాయి.చదవండి: 14 ఏళ్ల బంధానికి స్వస్తి! భర్తకు టాలీవుడ్ హీరోయిన్ విడాకులు! -
కొద్దిరోజులుగా మాస్క్‌తోనే రష్మిక.. కారణం ఇదేనా..?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొద్దిరోజులుగా మాస్క్‌లోనే కనిపించేది.. కానీ, తాను నటించిన కొత్త సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ ఈవెంట్ కోసం మాస్క్ లేకుండా మెరిసింది. ట్రైలర్‌ను చూస్తే ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. తన నటనకు ఎక్కువ స్కోప్ ఉందని తెలుస్తోంది. అయితే, ఈ మూవీ విడుదల తర్వాత తన గురించి మరోసారి పాన్ ఇండియా రేంజ్లో గట్టిగా మాట్లాడుకోవడం ఖాయమని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అయితే, కొద్దిరోజులుగా రష్మిక ఎక్కడ కనిపించినా సరే మాస్క్ పెట్టుకునే ఉండేది. తాజాగా జరిగిన ట్రైలర్ ఈవెంట్‌కు మాత్రం మాస్క్ లేకుండానే వచ్చేశారు.రష్మిక తరచూ ముఖానికి మాస్క్ వేసుకుని కనిపించడంతో అభిమానులు కూడా ఏమై ఉంటుందనే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఆమె గత వారం చెన్నై విమానాశ్రయంలో మాస్క్ ధరించే మెరిశారు. ఆ సమయంలో ముఖానికి మాస్క్ తొలగించమని ఫొటోగ్రాఫర్లు కోరగా, ట్రీట్మెంట్ తీసుకుంటున్నందువల్ల కుదరదని ఆమె పేర్కొన్నారు. దీంతో రష్మిక మందన్నాకు ఏమైందని ఆరా తీయగా ఆమె తన అందాన్ని మరింత మెరుగు పరచుకునే విధంగా ముక్కుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారని తెలిసింది. చాలారోజుల తర్వాత ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా కోసం మాస్క్ లేకుండా కనిపించి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. మరింత గ్లామర్‌గా కనిపిస్తున్న రష్మిక ఫోటోలు, వీడియోలు నెట్టింట షేర్ అవుతున్నాయి.రీసెంట్గా థామా సినిమాతో మెప్పించిన రష్మిక.. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాతో మరోసారి అభిమానులను పలకరించనున్నారు. దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో నటించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా నవంబరు 7న విడుదల కానుంది. -
నీళ్లు బంద్ చేస్తే సమాచారం ఏదీ?
బంజారాహిల్స్‌లోని ఒక కాలనీకి రోజు విడిచి రోజు తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో నల్లా నీటిని విడుదల చేస్తారు. ఎప్పటి మాదిరిగా ఒక కుటుంబం తెల్లవారు జామున లేచి నల్లా నీటి కోసం వేచి చూసింది. పదిగంటల తర్వాత సంబంధిత స్థానిక అధికారులకు ఫోన్ చేసి అడిగితే పైప్‌లైన్ లీకేజీ కారణంగా నీటిని విడుదల చేయలేదని సమాధానం చెప్పారు. ముందస్తు సమాచారం ఇవ్చవచ్చని కదా.. అడిగితే పత్రికలు చూడలేదా ? అని ఎదురు ప్రశి్నంచారు. ప్రతి నెల నల్లా బిల్లుకు సంబంధించి వివరాలు రిజిస్ట్రర్డ్ మొబైల్‌కు సంక్షిప్త సమాచారం ద్వారా అందిస్తారు కదా..నీటి సరఫరా అంతరాయం సమాచారం కూడా పంపవచ్చు కదా అని ప్రశ్నిస్తే..సమాధానం లేదు. ఇది ఈ ఒక్క కుటుంబానికి సంబంధించిన సమస్య కాదు.. ప్రతి నెల ఏదో ఒక లైన్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతూనే ఉంటుంది. వినియోగదారులు మాత్రం ఎలాంటి సమాచారం ఉండదు. ఐటీ సేవలు ఇంతగా అభివృద్ధి చెందుతున్నా..కనీసం నల్లా నీరు రావడం లేదనే మెసేజ్ పంపడం సాధ్యం కాదా అంటూ జనం ప్రశ్నిస్తున్నారు.సాక్షి, హైదరాబాద్: మహానగరంలో మరింత మెరుగైన సేవలందించేందుకు ఏడాది కాలంగా సరికొత్త సంస్కరణలతో ఆత్య«ధునిక సాంకేతి పరిజ్ఞానాన్ని అందిపుచుకొని ఐటీ బాట పట్టిన జలమండలి.. వినియోగదారులకు నీటి సరఫరా అంతరాయం ‘సమాచారం’ అందించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. క్షేత్రస్థాయి యంత్రాంగం పనితీరును జీఐఎస్ నెట్వర్క్ డేటా బేస్ మ్యాపింగ్‌తో ప్రత్యేక ఆన్లైన్ లైవ్ లొకేషన్ డ్యాష్ బోర్డు ద్వారా పర్యవేక్షిస్తున్న జలమండలి..వినియోగదారులకు నీటి సరఫరా అంతరాయం సమాచారానికి మాత్రం ఐటీని వినియోగించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. 14.21 లక్షల కనెక్షన్ల పైనే.. జలమండలి పరిధిలో సుమారు 14.21 లక్షలపైనే తాగు నీటి నల్లా కనెక్షన్లు ఉండగా, అందులో 96 శాతంపైగా గృహోపయోగ నీటి కనెక్షన్లు ఉంటాయి. ప్రధాన జలాశయాల నుంచి నీటిని తరలించి శుద్ధి చేసి సరఫరా చేసేందుకు నగరంలో నీటి సరఫరా నెట్వర్క్ పైప్‌లైన్ వ్యవస్థ సుమారు 12,978.75 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలోని మెయిన్ పైపులైన్లు తరచూ పగలడం, లీకేజీలకు గురికావడంతో మరమ్మతు తప్పడం లేదు. దీంతో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం తప్పడం లేదు. అయితే జలమండలి అధికారులు నీటిసరఫరా అంతరాయం సమాచారం కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. పత్రికల ద్వారా సమాచారం కొద్దిమేర మాత్రమే తెలుస్తుంది. దాదాపు 90 శాతం మందికి ఈ సమాచారం తెలియక నీటి కోసం తిప్పలు పడుతున్నారు. కాబట్టి వినియోగదారులకు బిల్లింగ్ వివరాలు పంపించే మొబైల్ నెంబర్‌కు అంతరాయం సమాచారం కూడా పంపిస్తే బాగుంటుందని వినియోగదారులు అంటున్నారు. ఈ నెలలో అంతరాయం ఇలా.. తాజాగా మంజీరా నీటి సరఫరా పథకం–3 కు సంబంధించి జాతీయ రహదారి 65 సమీపంలోని 1600 ఎంఎం డయా పంపింగ్ మెయి¯న్లో భారీ లీకేజీ ఏర్పడటంతో జలమండలి అత్యవసరంగా షట్‌డౌన్ తీసుకుంది. దీంతో సుమారు 20 ఎంజీడీల నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు ఆయా రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల వినియోగదారులకు సమాచారం అందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్యారడైజ్ జంక్షన్ నుండి డెయిరీ ఫాం రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భాగంగా ప్యారడైజ్ జంక్ష¯న్ వద్ద గల తాగునీటి సరఫరాకు సంబంధించిన 800 ఎంఎం డయా పైప్‌లైన్ విస్తరణ కోసం పనులు చేస్తుండడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. దీంతో తాజాగా సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 18 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. -
ఫేస్‌బుక్‌తో కలిసిన రిలయన్స్: రూ.855 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (AI) సేవలను అభివృద్ధి చేసేందుకు మెటా ప్లాట్‌ఫామ్స్, ఫేస్బుక్ ఓవర్సీస్ భాగస్వామ్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.ఈ జాయింట్ వెంచర్లో రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ ఇంటెలిజెన్స్లిమిటెడ్ వాటా 70%, ఫేస్బుక్ ఓవర్సీస్ వాటా 30 శాతం ఉంటుందని పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ కోసం రెండు కంపెనీలు రూ.855 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన అనుబంధ సంస్థ రిలయన్స్ఇంటెలిజెన్స్లిమిటెడ్ 2025 అక్టోబర్ 24న రిలయన్స్ఎంటర్ ప్రైజ్ ఇంటెలిజెన్స్లిమిటెడ్(ఆర్ఈఐఎల్)ను ప్రారంభించింది.ఈ జాయింట్ వెంచర్ ఎంటర్ప్రైజ్ ఏఐ సొల్యూషన్స్‌పై దృష్టి సారించిందని రిలయన్స్ పేర్కొంది. ఈ జేవీ ఏర్పాటుకు ప్రభుత్వం, నియంత్రణ సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు అవసరం లేదని రిలయన్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.ఇదీ చదవండి: పెయింట్ కోసమే రూ.13 లక్షలు.. ఈ బైక్ ధర ఎంతో తెలుసా? -
‘ఉపాధి’లో అవినీతి కంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలులో అవినీతి పెరిగిపోయింది. ఇటీవల అధికారులే సోషల్ ఆడిట్ పేరుతో కింది స్థాయిలో పథకం అమలు చేసే సిబ్బంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాపట్ల జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలును పర్యవేక్షించే కీలక అధికారి ఒకరు అక్రమ వసూళ్ల కోసం సాగిస్తున్న వేధింపులను భరించలేక కింది స్థాయి సిబ్బంది ఏకంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయానికే తమ జిల్లా అధికారిపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఆ లేఖను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లతోపాటు ఏసీబీకి కూడా పంపినట్లు బాపట్ల జిల్లా ఉపాధి హామీ పథకం సిబ్బంది మీడియాకు తెలిపారు. గత రెండు, మూడు నెలలుగా జిల్లాలో ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతికి సంబంధించి వివిధ పత్రికల్లో ప్రచురితమైన 20 వార్తల క్లిప్పింగ్‌లను కూడా జత చేశారు.ఇద్దరు, ముగ్గురిని అనుచరులుగా చేసుకుని వసూళ్లు ‘బాపట్ల జిల్లా ఉపాధి హామీ పథకం ఎంప్లాయీస్’ పేరుతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు పంపిన లేఖలో బాపట్ల జిల్లా డ్వామా పీడీని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ... ‘ఆ అధికారి జిల్లాలో పనిచేసే ఇద్దరు, ముగ్గురు సిబ్బందిని అనుచరులుగా చేసుకున్నారు. వారి ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారు. బాపట్ల జిల్లాలోని నగరం, అద్దంకి మండలాల్లో ఉపాధి హామీ పథకం సిబ్బంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. జిల్లాలోని ఏ మండలంలో సోషల్ ఆడిట్ జరిగినా ఓ రాష్ట్ర స్థాయి అధికారి పేరు చెప్పి డ్వామా పీడీ తన అనుచర సిబ్బంది ద్వారా ఆయా మండల ఉపాధి సిబ్బంది నుంచి రూ.లక్ష చొప్పున డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. డబ్బులు ఇవ్వని సిబ్బందిపై ఎక్కువ మొత్తంలో రికవరీకి సిఫార్సు చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు..’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. -
‘కూటమి ప్రభుత్వం భూమిని లాగేసుకుంది.. కారుణ్య మరణానికి అనుమతించండి’
తాడికొండ: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరి శేషగిరమ్మ, ఆమె కుమార్తె చెరుకూరి వెంకాయమ్మ, మానసిక వైకల్యం గల మనవరాలు చెరుకూరి శ్యామల కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తమ జీవితానికి చివరి ఆసరాగా ఉన్న 5 సెంట్ల భూమిని కూటమి ప్రభుత్వం లాక్కుందని.. తాము ఎన్ని ఫిర్యాదులు, వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని హైకోర్టుకు సమర్పించిన రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఆ కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న 5 సెంట్ల భూమిని కూటమి ప్రభుత్వం తీసుకుంది. తమ ఏకైక ఆధారాన్ని లాగేసుకోవడం వల్ల తమ జీవనాధారం పోయిందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ తమ ఫిర్యాదులు, వినతులు పట్టించుకోవడం లేదని.. తద్వారా రాజ్యాంగంలోని మౌలిక హక్కులు ముఖ్యంగా జీవన హక్కు (ఆర్టికల్ 21), సమానత్వ హక్కు (ఆరి్టకల్ 14), ఆస్తి హక్కు (ఆర్టికల్ 300ఏ) ఉల్లంఘించబడిందని వాపోయారు. తమ దుస్థితి దృష్ట్యా పిటిషనర్లు ముగ్గురూ హైకోర్టును రెండు ప్రధాన అంశాలపై వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా ఒక కేర్ టేకర్‌ను నియమించి తమ ఆహారం, వైద్యచికిత్స, విద్యుత్ బిల్లులు, జీవనాధార ఖర్చులు భరించాలని అభ్యర్థించారు. ప్రభుత్వం ఈ సహాయం అందించలేని స్థితిలో ఉంటే.. కారుణ్య మరణానికి తమకు న్యాయపరమైన అనుమతి ఇవ్వాలని కోరారు. ‘మానవ గౌరవం లేకుండా జీవించడం కన్నా.. గౌరవంగా మరణించడం మేలు. మమ్మల్ని ఈ స్థితికి ప్రభుత్వం నెట్టేసింది’ అని వృద్ధురాలు శేషగిరమ్మ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసు అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లోని మానవ హక్కుల ఉల్లంఘణ కోణాన్ని బయటపెడుతోంది. వికాసం పేరుతో పేదలు, వృద్ధులు, దివ్యాంగులు తమ భూములు, గౌరవం, జీవన హక్కులు కోల్పోతున్న వైనాన్ని పిటిషన్ చాటి చెబుతోంది. -
పిల్లలతో తీసిన హారర్ సినిమా.. వాళ్లు చూడకపోవడమే బెటర్!
హారర్ సినిమా అంటే ఓ రేంజులో భయపెట్టాలి. మొదటి సీన్ నుంచే మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోవాలి. కానీ మన దగ్గర రీసెంట్ టైంలో తీసే మూవీస్‌లో చాలావరకు అలాంటి మ్యాజిక్ చేయలేకపోతున్నాయి! అందుకే మూవీ లవర్స్.. కొరియన్, హాలీవుడ్ హారర్ చిత్రాల వెంటపడుతున్నరు. ఇప్పుడు అలాంటి వాళ్లని ఓ గుజరాతీ సినిమా తెగ భయపెట్టేస్తోంది. అదే 'వష్ 2'. ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ సంగతేంటి? ఎలాంటి థ్రిల్ ఇచ్చిందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)2023లో గుజరాతీలో 'వష్' అనే సినిమా రిలీజైంది. వశీకరణం స్టోరీతో వచ్చిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది. దీన్ని హిందీలో అజయ్ దేవగణ్ 'సైతాన్' పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. దీంతో 'వష్' గురించి అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ దర్శకనిర్మాతల నుంచి సీక్వెల్ వచ్చింది. 'వష్ లెవల్ 2' పేరుతో తీశారు. ఇది ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. గుజరాతీతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.కథేంటి?తొలి భాగానికి కొనసాగింపుగా 'వష్ 2' మొదలవుతుంది. మొదటి భాగంలో మాంత్రికుడికి ఉన్న శిష్యుడు.. ఓ స్కూల్లో చదివే 50 మందికి పైగా అమ్మాయిలని వశీకరణం ద్వారా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఇతడి వశంలో ఉన్న కొందరు అమ్మాయిలు.. స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. మరికొందరైతే ఊరిమీద పడి జనాలని దారుణంగా చంపేస్తుంటారు. అసలు దీనంతటికీ మూలకారణం ఏంటి? ఆ మాంత్రికుడి శిష్యుడిని ఎవరు ఎదుర్కొన్నారు? చివరకు అమ్మాయిలు బతికి బయటపడ్డారా లేదా అనేది మిగతా స్టోరీ.స్కూల్ పిల్లలు, ఓ మాంత్రికుడు, దుష్టశక్తులు.. ఇదే 'వష్ 2' సినిమా మెయిన్ ప్లాట్. వింటుంటేనే వామ్మో అనిపిస్తుంది కదా! అయినా పిల్లలతో హారర్ మూవీ ఎవరైనా తీస్తారా అని మీరు అనుకోవచ్చు. కానీ చూస్తున్నంతసేపు ఓవైపు భయమేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందా అనే ఆత్రుత మరోవైపు కలుగుతూ ఉంటుంది. చెప్పాలంటే లోకల్‌గా తీసినప్పటికీ హాలీవుడ్ రేంజ్ కంటెంట్ డెలివరీ చేశారని చెప్పొచ్చు.ఆగస్టులో ఈ సినిమా థియేటర్లలో రిలీజైతే.. అదే నెలలో 'వెపన్స్' అనే హాలీవుడ్ మూవీ కూడా విడుదలైంది. విచిత్రం ఏంటంటే ఈ రెండింటి కాన్సెప్ట్ దాదాపు ఒక్కటే. కొన్ని షాట్స్ అయితే అరే ఒకేలా ఉన్నాయేంటి అని కచ్చితంగా అనిపిస్తుంది. ఒకే నెలలో రిలీజ్ కావడం వల్ల కాపీ అనే ప్రసక్తి రాదు. సరే 'వష్ 2' విషయానికొస్తే ఓ స్కూల్, ఉదయం కాగానే వచ్చే పిల్లల సందడితో సినిమా మొదలవుతుంది. సరిగ్గా 13 నిమిషాల తర్వాత నుంచి అసలు కథ మొదలవుతుంది. పదిమంది ఆడపిల్లలు.. బిల్డింగ్ పైకెక్కి అక్కడినుంచి దూకి చనిపోతారు. అలా మొదలయ్యే టెన్షన్, థ్రిల్.. ఎండ్ కార్డ్ పడేవరకు ఆపకుండా ఉంటుంది.కేవలం 100 నిమిషాలు మాత్రమే ఉండే ఈ సినిమా.. చూస్తున్నంతసేపు మనల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది. సినిమా అంతా భయంకరమైన, షాకింగ్ విజువల్స్ ఉంటాయి. మోనాల్ గజ్జర్ తప్పితే తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మరో ముఖం లేదు. అయినా సరే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. పిల్లలందరూ యాక్టింగ్ అదరగొట్టేశారు. వీళ్లకు తోడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత భయపెడుతుంది. చిన్న చిన్న సౌండ్స్ కూడా సినిమాని మరింత ఎలివేట్ చేశాయి.అన్ని ప్లస్సులేనా మైనస్సులు ఏం లేవా అంటే ఉన్నాయి. చాలా హింసాత్మక సన్నివేశాలున్నాయి. వాటిలో టీనేజీ పిల్లలు ఉండటం కొందరికి ఇబ్బందిగా అనిపించొచ్చు. సెన్సిటివ్‌గా ఉండేవారు ఈ మూవీ చూడకపోవడమే మంచిది. మొదటి పార్ట్‌లో ఏదైతే స్టోరీ ఉందో దాన్ని అటుతిప్పి ఇటుతిప్పి చూపించినట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగానే అనిపిస్తాయి. కానీ ఓవరాల్‌గా మాత్రం మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. మంచి హారర్ సినిమా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కావొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్) -
మరో సోషల్ మీడియా యాక్టివిస్టు అక్రమ అరెస్టు..
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామానికి చెందిన అంబోజి వినయ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నందుకు వినయ్‌పై కూటమి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పోలీసులు అంబోజి వినయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.వినయ్‌పై డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు.డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదుతో హైదరాబాద్‌లో ఉన్న వినయ్‌ను ఆదివారం తెల్లవారుజామున ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.వినయ్ అక్రమ అరెస్టును ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ , జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఖండించారు. వినయ్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
ఫ్యాషన్ సెన్స్.. కారాదు నాన్సెన్స్..
నగరం.. ఫ్యాషన్‌కి.. కొత్త ట్రెండ్స్‌కి కేంద్ర బిందువు. అయితే దీనిని పాటించడానికీ ఫ్యాషన్ సెన్స్ ఉండాలి.. అయితే ఆ సెన్స్ నాన్సెన్స్ కాకూడదని పలువురు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఫ్యాషన్, ట్రెండ్ పేరుతో ఇష్టారీతిన ఫ్యాషన్ ఉత్పత్తులను వినియోగిస్తూ.. వాటిని భారీ స్థాయిలో డంప్ చేస్తున్నారు. దీంతో మనకు తెలియకుండానే ఈ డంప్ ప్రకృతిపై ప్రభావం చూపుతోంది.. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో నిత్యం ఉత్పత్తయ్యే 9,000 టన్నుల వ్యర్థాల్లో 800 టన్నులు ఫ్యాషన్, వ్రస్తాలే ఉంటున్నాయని అంచనా.. వీటిలో చాలా వాటిని రీసైకిల్ చేయకుండానే డంప్ చేస్తున్నారని, ఇది పర్యావరణానికి ఓ సవాలుగా మారుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇష్టారీతిన ఫ్యాషన్ ఉత్పత్తులను వినియోగించేవారు రీసైకిల్/ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను వినియోగించడం ఓ జీవన విధానంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.యువతలో పెరుగుతున్న ఫాస్ట్ ఫ్యాషన్ ధోరణి పర్యావరణానికి ప్రధాన సవాలుగా మారుతోంది. అధునాత జీవనశైలి పేరుతో మనం ధరించే ప్రతి ఉత్పత్తి వెనుక ఎకో ఫ్రెండ్లీ సూత్రం దాగుంది. దానిని గ్రహించి ఉత్పత్తులు ఎంపిక చేసుకుంటే.. అటు ప్రకృతికి.. ఇటు భవిష్యత్తు తరాలకు మేలుచేసినట్లవుతుంది. ఇందుకు సామాజిక బాధ్యతతో పాటు.. ఎకో ఫ్రెండ్లీ జీవన విధానం అలవర్చుకోవాలని నినదిస్తున్నారు. సింథటిక్ ఫ్యాబ్రిక్‌తో సమస్య.. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా కొత్త దుస్తులు కొనడం, తరచూ ట్రెండ్స్ మార్చుకోవడం అలవాటుగా మారింది. మార్కెట్లో తక్కువ ధరకే దొరికే సింథటిక్ ఫ్యాబ్రిక్స్ డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి పరిమాణం భారీగా పెరిగింది. ఇది అధిక వ్యర్థాలకు దారి తీస్తోంది. అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం ఫ్యాషన్ పరిశ్రమలు ప్రపంచవ్యాప్తంగా 10 శాతం కర్బన ఉద్గారాలకు, 20 శాతం నీటి కాలుష్యానికీ కారణమవుతోంది. ఒక జీన్స్ తయారీకి సగటున 7,000 లీటర్ల నీరు అవసరమవుతుందంటే కాలుష్యం తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. రీ యూజ్, రీ సైకిల్ పరిష్కారం.. గతంలో ఏ వస్తువునైనా పూర్తిగా వినియోగించి, రిపేర్ చేసుకొని, తదుపరి తరానికి అందించే అలవాటు మన సంస్కృతిలో ఉండేది. అదే ‘స్లో ఫ్యాషన్’ భావన. నాణ్యమైన, దీర్ఘకాల మన్నిక కలిగిన వ్రస్తాలు వాడటం, వాడిన వాటిని ఇతర అవసరాలకు వినియోగించడం ద్వారా వ్యర్థాలను తగ్గించవచ్చు. హైదరాబాద్‌లో ఇటీవల ఔత్సాహిక యువత, స్టార్టప్‌లు ఈ మార్గాన్ని ఎంచుకున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ‘థ్రిఫ్ట్ మార్కెట్స్’ నిర్వహించి వాడిన దుస్తులను మళ్లీ అమ్మడం లేదా ఇతరులకు వితరణ చేయడం మొదలైంది. ఈ కల్చర్ ద్వారా ఫ్యాషన్ వ్యర్థాలు తగ్గుతాయి. సెలబ్రిటీలు కూడా ఈ మార్పుకు తోడ్పడుతున్నారు. నటి సమంతా ఆ మధ్య ఓ ఈవెంట్లో ‘రీయూజ్ వస్త్రాలు కూడా నా ఫ్యాషన్ స్టేట్మెంట్’ అని చెప్పడం ఆహా్వనించదగ్గ పరిణామం. మోతాదుకు మించి.. హైదరాబాద్‌లో టైMð్ట్సల్ వేస్ట్ మోతాదుకు మించుతోంది. జీహెచ్ఎంసీ ల్యాండ్‌ఫిల్ ప్రాంతాల్లో రోజూ వందల టన్నుల పాత దుస్తులు, ఫ్యాబ్రిక్ డంప్ చేస్తోంది. వీటిలో 40 శాతం రీసైకిల్ చేయగలిగినవే అయినా, అవగాహన లేక నేరుగా భూమిలోకి వెళ్తున్నాయి. నిత్యం 720 నుంచి 800 టన్నుల టెక్స్టైల్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. సింథటిక్ ఫ్యాబ్రిక్‌లో ఉన్న నైలాన్, పాలిస్టర్ వంటి పదార్థాలు సహజంగా కరగవు. వీటి నుంచి విడుదలయ్యే మైక్రోఫైబర్లు నీటిని కలుషితం చేస్తున్నాయి. వ్రస్తాల్లో ఉపయోగించే రసాయనాలు, సింథటిక్ కలర్స్ చర్మవ్యాధులకు కారణమవుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు..హ్యాండ్లూమ్, ఖాదీ, ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్ వంటి దేశీయ ఉత్పత్తులు పర్యావరణానికి కాస్త సహాయకారిణిగా ఉంటాయి. ఇవి సహజంగా భూమిలో కరిగిపోతాయి. రసాయనాల మోతాదు తక్కువగా ఉంటుంది. తెలంగాణ హ్యాండ్లూమ్ ఉత్పత్తులు, ఇక్కత్ శారీస్, నారాయణపేట ఫ్యాబ్రిక్స్, మంగళగిరి కాటన్ వంటి ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటమే కాక, కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. ముఖ్యంగా అవసరాన్ని బట్టి దుస్తులు కొనడం, మన్నికైన, నాణ్యమైన ఫ్యాబ్రిక్ ఎంపిక చేయడం, వాడిన బట్టలను దానం చేయడం, రీసైకిల్ సెంటర్లకు ఇవ్వడం..వంటి మార్పుకు నాంది పలకాలి.
