సోషల్ ఆడిట్‌లో అక్రమాలు కప్పిపుచ్చేందుకు ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వసూళ్లు
బాపట్ల జిల్లాలో డ్వామా పీడీ వేధిస్తున్నారని ఉద్యోగుల తిరుగుబాటు
కేంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు లేఖలు
ఏసీబీకి కూడా ఫిర్యాదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలులో అవినీతి పెరిగిపోయింది. ఇటీవల అధికారులే సోషల్ ఆడిట్ పేరుతో కింది స్థాయిలో పథకం అమలు చేసే సిబ్బంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాపట్ల జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలును పర్యవేక్షించే కీలక అధికారి ఒకరు అక్రమ వసూళ్ల కోసం సాగిస్తున్న వేధింపులను భరించలేక కింది స్థాయి సిబ్బంది ఏకంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయానికే తమ జిల్లా అధికారిపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.
ఆ లేఖను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లతోపాటు ఏసీబీకి కూడా పంపినట్లు బాపట్ల జిల్లా ఉపాధి హామీ పథకం సిబ్బంది మీడియాకు తెలిపారు. గత రెండు, మూడు నెలలుగా జిల్లాలో ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతికి సంబంధించి వివిధ పత్రికల్లో ప్రచురితమైన 20 వార్తల క్లిప్పింగ్‌లను కూడా జత చేశారు.
ఇద్దరు, ముగ్గురిని అనుచరులుగా చేసుకుని వసూళ్లు
‘బాపట్ల జిల్లా ఉపాధి హామీ పథకం ఎంప్లాయీస్’ పేరుతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు పంపిన లేఖలో బాపట్ల జిల్లా డ్వామా పీడీని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ... ‘ఆ అధికారి జిల్లాలో పనిచేసే ఇద్దరు, ముగ్గురు సిబ్బందిని అనుచరులుగా చేసుకున్నారు. వారి ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారు. బాపట్ల జిల్లాలోని నగరం, అద్దంకి మండలాల్లో ఉపాధి హామీ పథకం సిబ్బంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు.
జిల్లాలోని ఏ మండలంలో సోషల్ ఆడిట్ జరిగినా ఓ రాష్ట్ర స్థాయి అధికారి పేరు చెప్పి డ్వామా పీడీ తన అనుచర సిబ్బంది ద్వారా ఆయా మండల ఉపాధి సిబ్బంది నుంచి రూ.లక్ష చొప్పున డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. డబ్బులు ఇవ్వని సిబ్బందిపై ఎక్కువ మొత్తంలో రికవరీకి సిఫార్సు చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు..’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.


