ప్రతి రైతుకు బీమా వచ్చేవరకు పోరాడుతాం

ysrcp leaders fire on cm chandrababu naidu - Sakshi

టీడీపీ పాలనలో ప్రతిఒక్కరూ రోడ్డెక్కుతున్నారు

ఎవరూ రోడ్డుమీదికి రాలేదని బాబు అనడం హాస్యాస్పదం

అన్ని జిల్లాల్లో 75 శాతం పంపిణీ చేసినా...వైఎస్సార్‌ జిల్లాలో ఆలస్యమెందుకు?

కేంద్రం సిద్ధంగా ఉన్నా నిధులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్న రాష్ట్రం

కమలాపురం ధర్నాలో నిప్పులు చెరిగిన వైసీపీ నేతలు

సాక్షి, కడప/కమలాపురం అర్బన్‌ :
‘టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రతి ఒక్కరూ, ప్రతిరోజూ ఏదో ఒకచోట రోడ్డెక్కి ఉద్యమాల బాట పడుతూనే ఉన్నారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం ఎవరూ రోడ్డుమీదికి రాలేదని చెప్పుకోవడం సిగ్గుచేటు’ అని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. పంట సాగుచేసిన రైతులందరికీ బీమా ఇవ్వాలంటూ కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలోని కమలాపురం క్రాస్‌రోడ్డులో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో రైతులు ఒక్కరోజైన రోడ్డెక్కారా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్‌ పాలన స్వర్ణయుగం అని, ఆయన రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్, గిట్టుబాటు ధర అన్ని సౌకర్యాలు ముందే కల్పించారని తెలిపారు. 2016 రబీలో ప్రీమియం చెల్లించిన ప్రతి రైతు ఖాతాకు బీమా జమచేసే వరకు పోరాడుతామని తెలిపారు. 2012 బుడ్డశగన మూడో విడత బీమా విషయంలో కూడా ఆలస్యం సాగుతోందని,  మిగతా జిల్లాల్లో 75శాతం రైతులకు అందిందని, వైఎస్సార్‌ జిల్లాలో మాత్రం రాలేదన్నారు.

కేంద్రం తన వాటా వేయడానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్రప్రభుత్వం ఏదో ఒక సాకుతో వెనుకంజ వేస్తోందన్నారు. తాను 17నెలల క్రితం లేఖ రాస్తే ఇంతవరకు రాష్ట్రప్రభుత్వం నుంచి స్పందన కరువైందన్నారు. అలాగే ఎన్నోమార్లు వ్యవసాయ కమిషనర్‌ దృష్టికి కూడా ఈ లేఖ విషయాన్ని తీసుకెళ్లానని అయినప్పటికి స్పందన లేదన్నారు. రూ.50 కోట్లు వాటా వేయాల్సి వస్తుందని రాష్ట్రప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016 రబీలో మరో 57వేల మంది ప్రీమియం చెల్లిస్తే వారిలో 16 వేల దరఖాస్తులు తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్‌ కంపెనీల ఎదుటే ధర్నా నిర్వహించి ప్రతిరైతుకు ఇన్సూరెన్స్‌ వచ్చేలా పోరాడుతామన్నారు. టీడీపీ పాలనలో ఏ సమస్య పరిష్కరించుకోవాలన్నా రోడ్డెక్కే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

కడప దెబ్బ పుణేకు తెలియాలి
2016 రబీలో రైతుల నుంచి బీమా ప్రీమియం వసూలు చేసి ఇప్పుడు పరిహారం విషయంలో నిర్లక్ష్యం చేస్తున్న ఐసీఐసీఐ ఇన్సూరెన్స్‌ కంపెనీకి కడప దెబ్బ తెలియాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. 2012–13కు సంబంధించి రు.120కోట్ల వరకు ఇన్సూరెన్స్‌ రావాల్సి ఉందన్నారు. అప్పట్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి ఇన్సూరెన్స్‌ కంపెనీ ఎదుట ధర్నా నిర్వహిస్తే 18వేల మందికి ఇన్సూరెన్స్‌ చెల్లించారని గుర్తుచేశారు. ఇంకా 21వేల మందికి రావాల్సి ఉందన్నారు. 2016 రబీలో ప్రీమియం చెల్లించిన రైతులకు అమౌంట్‌ తక్కువ కట్టారని రిజెక్ట్‌ చేశారని, ఇది సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. వెలుగు అధికారుల ద్వారా ప్రీమియం తీసుకున్న ఇన్సూరెన్స్‌ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ ఈ విషయంపై స్పందించడం లేదని, ఒక్కో సారు ఒక్కో గడువు విధిస్తున్నారన్నారు. ఇన్సూరెన్స్‌ కంపెనీలు స్పందించకపోతే పుణేలో ఉన్న ఐసీఐసీఐ హెడ్డాఫీస్‌ ఎదుట ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు.

సర్కార్‌ పాలనపై టీడీపీలో వ్యతిరేకత
రాష్ట్రంలో చంద్రబాబు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలతోపాటు పాలకపక్షమైన టీడీపీలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందని, అందుకు సంబంధించి 51శాతం ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు టీడీపీలోనే చర్చ సాగుతోందని ఎమ్మెల్యే అంజద్‌బాష, పార్టీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబులు మండిపడ్డారు. వ్యతిరేకత ఉన్న విషయాన్ని స్వయంగా ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్‌ స్పష్టం చేస్తున్నారని వారు వివరించారు. మన రాష్ట్రం 82శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉందన్నారు. అలాంటిది రైతులకు ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించక పోతే ఎలా? అని ప్రశ్నించారు. రైతులు, మహిళలు అన్నివర్గాల ప్రజలను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రీమియం కట్టి పంట నష్టపోయిన ఇన్సూరెన్స్‌ చెల్లించకపోవడం దారుణమన్నారు. అదే సమయంలో జన్మభూమి–మాఊరు కార్యక్రమానికి వెళుతున్న వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో వైఎస్సార్‌సీపీనేతలు వినతిపత్రం అందించి....ప్రీమియం కట్టిన ప్రతి రైతుకు బీమా వచ్చేలా చూడాలని కోరారు.

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top