తల్లిదండ్రుల కష్టాన్ని మరచిపోరాదు : నగరి ఎమ్మెల్యే రోజా

comedian ali and rk roja partcipate in AITS mahothsav - Sakshi

ఉమ్మడి రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎందరికో ఉన్నతవిద్య

రాబోయే ఎన్నికల్లో విద్యార్థులు ముందుండాలి

రాయలసీమకే తలమానికం ఏఐటీఎస్‌ : సినీనటి, ఎమ్మెల్యే ఆర్‌కె రోజా

వైఎస్‌ఆర్‌ జిల్లా , రాజంపేట: నేటి విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని మరచిపోకుండా, పట్టుదల, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి వారి ఆశయాలను నెరవేర్చాలని సినీనటి, ఎమ్మెల్యే ఆర్‌కే రోజా పేర్కొన్నారు. రాజంపేటలోని ఏఐటీఎస్‌లో గురువారం జరిగిన మహోత్సవ్‌ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.   కన్నవారిని, చదువు చెప్పిన గురువును, చదివిన కళాశాలను మరచిపోరాదన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సక్సెస్‌ కావాలంటే నాణ్యమైన విద్యను అందించే ఏఐటీఎస్‌ లాంటి విద్యాసంస్థలో విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు. అన్నమయ్య నడయాడిన ప్రాంతంలో ఏఐటీఎస్‌ అధినేత చొప్పా గంగిరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలను స్థాపించడం వల్ల ఇక్కడ విద్యను అభ్యసించిన వారు ఎందరో దేశ, విదేశాలలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్‌ను తీసుకురావడం వల్ల ఎందరో పేదలకు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభించిందన్నారు.

ప్రతి ఇంట ఆయనను తలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమ ఫలాలు అందించడంలో భాగంగా కుటుంబలో ఒకరికి ఉన్నత విద్యను అందించగలిగితే ఆ కుటుంబం ఆర్థికంగా బలోపేతమవుతుందనే ఉద్దేశంతో దివంగత సీఎం వైఎస్సార్‌ ఫీజురీయింబర్స్‌మెంట్‌ను తీసుకువచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయన్నారు. ఉద్యోగం దక్కక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నేడు నెలకొన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ పుట్టిన రాయలసీమలో తాను జన్మించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాబోయే ఎన్నికల్లో విద్యార్థులు ముందుండి ప్రత్యేక హోదాను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఎవరైతే సాధించగలరనే నమ్మకం ఉందో వారికే ఓటు వేయించేలా విద్యార్థులు కృషి చేయాలన్నారు.

కులం కూడు పెట్టదు.. కష్టం కూడు పెడుతుంది: హాస్యనటుడు అలీ
కులం కూడు పెట్టదని..కష్టపడితే భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ సినీ హాస్య నటుడు అలీ అన్నారు. విద్యార్థి జీవితం చాలా విలువైనదన్నారు. అలాంటి జీవితం తనకు లేకుండా పోయిందన్నారు. చిన్నప్పుడే సినీ పరిశ్రమలో అడుగు పెట్టానన్నారు. విద్యార్థి జీవితం విలువలతో ఉన్నతంగా సాగితే జీవితానికి సార్థకత ఉంటుందన్నారు. తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా ముందుకు సాగాలన్నారు. తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు చూపాలన్నారు. నాకు అమ్మే సినిమా అన్నారు. చదువు ఉంటే సంస్కారం వస్తుందని, తాను జీవితంలోని అనుభవాలతో, ఎదుటివారిని చూసి ఆ సంస్కారం సంపాదించుకున్నానని చెప్పారు. అన్నమయ్య 108 అడుగుల విగ్రహానికి తన స్థలాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి ఏఐటీఎస్‌ అధినేత గంగిరెడ్డి అని కొనియాడారు.  అనంతరం ఏఐటీఎస్‌ అధినేత చొప్పా గంగిరెడ్డి, రాయలసీమ విద్యాసంస్థల డైరెక్టర్‌ ఆనందరెడ్డి, ఏఐటీఎస్‌ వైస్‌చైర్మన్‌ చొప్పా ఎల్లారెడ్డి, ఏఐటీఎస్‌ ఈడీ చొప్పా అభిషేక్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ నారాయణ పాల్గొన్నారు.

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top