మరో వెన్నుపోటు విషాదం | Sakshi
Sakshi News home page

మరో వెన్నుపోటు విషాదం

Published Wed, Mar 15 2017 12:14 AM

మరో వెన్నుపోటు విషాదం - Sakshi

డేట్‌లైన్‌ హైదరాబాద్‌
నాగిరెడ్డిని మంత్రిని చేస్తానని, తామే పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేస్తాననీ చెప్పి పార్టీ ఫిరాయించేటట్టు చేసిన చంద్రబాబు ఆయనను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేశారు. తీరా చివరకు నీ ప్రత్యర్థి వర్గ అభ్యర్థిని ఎంఎల్‌సీగా గెలిపించుకోనిస్తేనే అవన్నీ చేస్తామన్నారు. ఆ కారణంగానే నాగిరెడ్డి తీవ్ర మానసిక వ్యధకు గురై మరణించారని బాబుకు బాగా తెలుసు. కాబట్టే నాగిరెడ్డి మరణ వార్త విన్నప్పటి నుంచి ఆయన ఏ పదవీ ఆశించలేదు, ఆయనకు ఏ కోరికలూ లేవు అంటూ పదే పదే మాట్లాడుతున్నారు.

శవయాత్ర సాగుతుండగా పాడె మీదకు విసిరే చిల్లర డబ్బులు, పేలాలు ఏరుకునే వారు ఉంటారు. అది వారి వృత్తి కావొచ్చు లేదా పేదరికం వారిచేత ఆ పని చేయిస్తూ ఉండొచ్చు. అంత హీన స్థితిలో ఉన్న మనుషులు ఇంకా మన మధ్య జీవిస్తున్నందుకు, వారి బ్రతుకులను మార్చలేక పోతున్నందుకు మనం అందరం సిగ్గుపడాలి తప్ప వారిని అగౌరవంగా చూడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, దాని అధినాయకుడు చంద్రబాబునా యుడు నాయకత్వంలో ప్రస్తుతం చేస్తున్న రాజకీయం అంతకన్నా హీనంగా ఉన్నది. ఇటువంటి రాజకీయం చేస్తున్న వారిని చూసి సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునే పరిస్థితి.

కర్నూల్‌ జిల్లా నంద్యాల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ శాసన సభ్యుడు భూమా నాగిరెడ్డి మొన్న ఆకస్మికంగా మరణించారు. ఆయన ఏడాది క్రితం ఏవో ప్రలోభాలకో లేదా ఒత్తిడులకో లొంగి తెలుగుదేశం పార్టీ పంచన చేరినా సాంకేతికంగా ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యుడే. అందుకే ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేస్తానని గవర్నర్‌ దగ్గరికి వెళ్లినప్పుడు... తాను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేదిలేదని, వారి శాసనసభ సభ్యత్వాలకు రాజీ నామా చేయించి అప్పుడు రండని చెప్పి పంపేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించి మంత్రివర్గంలో చేరిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేత ప్రమా ణం చేయించినందుకు తెలుగుదేశం వాళ్లు తిట్టిన తిట్లను గవర్నర్‌ ఎలా మరచి పోతారు? కాబట్టి భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ, ఆయన బావమరిది ఎస్‌వీ మోహన్‌రెడ్డి సహా మొత్తం 21 మంది ఎంఎల్‌ ఏలూ సాంకేతికంగా ఇంకా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలే. అఖిలప్రియ, మోహన్‌రెడ్డి సహా ఆ ఫిరాయింపుదారుల్లో ఎవరికి మంత్రి పదవి కట్టబెట్టాల నుకున్నా ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర గవర్నర్‌ను మార్పించి, అందుకు అను కూలంగా నడుచుకునే గవర్నర్‌ను వేయించుకోవాలి. ప్రస్తుతానికి అది ఆయన వల్ల జరిగే పనిలా కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్ని కల్లో సాధించిన అద్భుత విజయం తరువాత మోదీకి చంద్రబాబు కోరికలను తీర్చాల్సిన పరిస్థితి లేదు. మోదీ గురించి తెలిసిన వారు ఇప్పుడు అసలు బాబుకు ప్రధాని అపాయింట్మెంట్‌ దొరకడం కూడా కష్టమే అంటున్నారు.

క్షుద్ర రాజకీయంతోనే గుండెలు పగిలే వ్యధ
నాగిరెడ్డి చితి మంటలు ఇంకా ఆరక ముందే ఆయన కుమార్తెను, బావమరి దిని శాసనసభకు రప్పించి వారి చేత రాజకీయాలు మాట్లాడించిన వైనం చూసి విస్తుపోవాల్సి వచ్చింది. అందువల్లనే మంత్రి పదవుల విషయంలో అఖిలప్రియ, మోహన్‌రెడ్డిల పేర్లను ప్రస్తావించాల్సి వచ్చింది. నాగిరెడ్డి మర ణించిన విషయం తెలిసినప్పటి నుండి ఆయన భౌతిక కాయానికి అంత్య క్రియలు జరిగే వరకూ... ఆయన ఏ పదవీ ఆశించలేదు, ఆయనకు ఏ కోరి కలూ లేవు అంటూ పదే పదే అరిగిపోయిన రికార్డ్‌లా బాబు మాట్లాడిన తీరు అట్లాగే ఉంది. నాగిరెడ్డిని మంత్రిని చేస్తానని, తామే పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేస్తాననీ ప్రలోభపెట్టి, పార్టీ ఫిరాయించేటట్టు చేసి ఒక ఏడాది పాటు తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేశారు. తీరా చివరి రోజున నీ ప్రత్యర్ధి ముఠా వ్యక్తిని ఎంఎల్‌సీగా గెలిపించుకోనిస్తేనే అవన్నీ చేస్తామని చెప్పి పంపించిన కార ణంగానే నాగిరెడ్డి తీవ్ర మానసిక వ్యథకు గురై, దాన్ని తట్టుకోలేకనే మర ణించారని బాబు మనసుకు బాగా తెలుసు. కాబట్టే ఆయన ఇప్పుడు ఈ మాటలు వల్లెవేస్తున్నాడు. శిల్పా చక్రపాణిరెడ్డిని గెలిపించుకు రావడం అంత సులభం కాదు. రాయలసీమలో ముఠాలు, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ముఠాలు ఎట్లా పని చేస్తాయో అందరికీ తెలుసు. చట్టసభలోకి ప్రవేశించే నాటికే నాగిరెడ్డికి అది అనుభవపూర్వకంగా తెలుసు. ఆ తరువాత కూడా అదే రాజకీయాల్లో జీవించాడు కాబట్టి ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపు చేయించిన చంద్రబాబే షరతులు పెట్టే దగ్గరికి వచ్చే సరికి తట్టుకోలేక పోయాడు. ఏం జరిగిందో తెలిపే వాస్తవాలన్నీ కాలక్రమేణా తప్పకుండా బయటకు వస్తాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement