సేంద్రియ సాగు.. బాగు


 చెన్నూర్ రూరల్ : మండలంలోని శివలింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో దిగుబడి సాధిస్తూ మిగితా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటి వద్దే సేంద్రియ ఎరువులు తయారు చేస్తూ పంటలు పండిస్తున్నారు.



గ్రామానికి చెందిన పది మంది రైతులు సుమారు 20 ఎకరాల్లో కూరగాయలు, బెండ, వంకాయ, బీరకాయ, కాకరకాయ, గోరుచిక్కుడు, మిరప, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది 20 మంది రైతులు సేంద్రియ పద్ధతిలో పత్తి, వరి పంటలు పండించారు. ఈసారి సరైన వర్షాలు లేకపోవడంతో కూరగాయల సాగు వైపు మొగ్గు చూపారు. వివిధ రకాల చెట్ల ఆకులతో రసాయనాలు తీసి అందులో ఆవు మూత్రాన్ని కలిపి పురుగు నివారణ మందులు తయారు చేస్తూ ఖర్చు తగ్గించుకుంటున్నారు. రైతులు సతీశ్, అక్కెం బానయ్య, రాజయ్య ఎరువుల తయారీపై వివరించారు.



 ఎరువుల తయారీ విధానం

 దుక్కులు దున్నేందుకు మూడు నెలల ముందే నాడెపు కంపోస్టు ఎరువు తయారు చేసుకోవాలి. ముందుగా ఇటుకలతో ఒక తొట్టి ఏర్పాటు చేసుకుని అందులో వివిధ రకాల చెట్ల ఆకులు, వ్యర్థ పదర్థాలు, పేడ వేయాలి. మూడు నెలల తర్వాత నాడెపు కంపోస్టు ఎరువు తయారవుతుంది. దుక్కులు దున్నిన తర్వాత ఎకరానికి 2 క్వింటాళ్ల చొప్పున నీటిలో కలిపి చల్లాలి.



ఆ తర్వాత మొలకలు వచ్చాక 15రోజుల నుంచి 20 రోజులలోపు మళ్లీ ఈ ఎరువు వేయాలి. ఇలా చేస్తే భూసారం పెరగడమే కాకుండా మొక్కల వేర్లు బలంగా తయారవుతాయి. మొక్కలకు ఎలాంటి చీడపీడలు ఆశించకుండా వేప ఆకులతో తయారు చేసిన కషాయాన్ని రెండు వారాలకోసారి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. ఇలా చేయడంతో ఎటువంటి చీడపీడలు సోకవు. ద్రవ జీవామృతం, నీమాస్త్రం అనే సేంద్రియ ఎరువులు మొక్కలు బలంగా ఎదగాడానికి ఉపయోగపడుతాయి.



వీటిని ఆవుపేడ, ఆవు మూత్రం, బెల్లం, శెనగపిండి, పుట్టమట్టి తదితర మిశ్రమాలతో తయారు చేసి సుమారు 48గంటలపాటు డబ్బాలో ఉంచి గట్టిగా మూత పెట్టాలి. అనంతరం ఈ కషాయాన్ని కర్రతో కలిపిన తర్వాత మొక్కలకు అందించే నీటి కాలువల్లో కలిపి మొక్కలకు అందించాలి. ఇలా ఎకరానికి ఐదు లీటర్ల వరకు నీటిలో కలపాలి. ఈ సేంద్రియ ఎరువుల వాడకంతో మొక్కలు బలంగా తయారై ఎలాంటి చీడపీడలు సోకకుండా దిగుబడులు వస్తాయి. రసాయనిక ఎరువులు వాడడంతో ఖర్చు ఎక్కువగా ఉంటుందని, ఇలా ఇళ్ల వద్ద సేంద్రియ ఎరువులు తయారు చేసుకుంటే ఖర్చు చాలా తగ్గుతుంది.

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top