వ్యర్థాలతో అందమైన తోట | Beautiful garden waste | Sakshi
Sakshi News home page

వ్యర్థాలతో అందమైన తోట

Feb 11 2015 11:34 PM | Updated on Sep 2 2017 9:09 PM

వ్యర్థాలతో  అందమైన తోట

వ్యర్థాలతో అందమైన తోట

పనికిరాని వస్తువులను ఉపయోగించి ఇంటిపంటలు సాగు చేస్తున్నారు నివేదిత. ఆసక్తికి కాస్త సృజనాత్మకతను జోడిస్తే ఇంటిపంటల పెంపకానికి కావేవీ అనర్హం అంటున్నారామె.

పనికిరాని వస్తువులను ఉపయోగించి ఇంటిపంటలు సాగు చేస్తున్నారు నివేదిత. ఆసక్తికి కాస్త సృజనాత్మకతను జోడిస్తే ఇంటిపంటల పెంపకానికి కావేవీ అనర్హం అంటున్నారామె.
 
హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన సురవరం నివేదిత(9490952201)కు కాలేజీ రోజుల నుంచి మొక్కల పెంపకం హాబీ ఉంది. ఆ ఆసక్తితోనే పాత వస్తువులను వృథాగా పారేయకుండా సృజనాత్మకంగా ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. పాత డబ్బాలు, మగ్గులు, టీ జార్‌లు, కూల్ డ్రింకు బాటిళ్లు , టైర్లు, టిన్నులు, షూలు, కుండలు, తినుబండారాల పార్శిల్ పాత్రలు, పైపులు, బూట్లు, సాక్స్‌లు, పాత టీవీల క్యాబినెట్లు, ట్రాన్సిస్టర్ క్యాబినెట్లు, నీళ్ల డ్రమ్ములు, సీడీల పార్శిల్ డబ్బాలు, విద్యుత్ బల్బులు.. ఇలా సుమారు రెండు  వందల వరకూ పనికిరాని వస్తువుల్లో ఇంటిపంటలను పండిస్తున్నారామె. పాత డబ్బాలకు రంగులేసి, బొమ్మలు వేసి ఇంటిపంటలకు సిద్ధం చేస్తారు. స్వతహాగా పెయింటర్ అయిన ఆమె సంప్రదాయ, ఆధునిక, మధుబని, ట్రైబల్ పెయింటింగ్స్‌ను మొక్కల కుండీలపై చిత్రిస్తుంటారు. చూడముచ్చటగా ఉండటమే కాకుండా ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండించడాన్ని కుటుంబ సభ్యులతోపాటు అతిథులూ అభినందిస్తున్నారని, పరిసరాలను మరింత అందంగా మార్చుకోవటం ద్వారా మనోల్లాసం కలుగుతున్నదని ఆమె తెలిపారు.  
‘పెద్ద బకెట్లు, పాత్రలు వంటి వాటిలో కరివేపాకు, మిరప, వంగ, టమాటా వంటి మొక్కలు పెట్టాలి. సన్నగా, పొడవుగా ఉండే పైపుల్లో కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరలు పెంచాలి. మొక్కల ఆకులు, ఇంట్లో కూరగాయ వ్యర్థాలతో తయారైన కంపోస్టు, పశువుల ఎరువు, టీ పౌడర్ వంటి వాటిని కలిపిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నా’ అన్నారామె.

రోజువారీ పనులకు అడ్డం రాకుండా గదుల్లో, హాలులో, కిటికీల బయట, మెట్ల దగ్గర, ప్రహరీ గోడలకు వేలాడ దీసేలా పాత వస్తువులతో కుండీలను రూపొందించడం నివేదిత ప్రత్యేకత. స్థలం కలిసి రావాలంటే ఒకే పొడవాటి తాడుకు కట్టి  ఒకదాని వెంట ఒకటి ఒకే వరుసలో పైనుంచి కింద వరకూ వేలాడదీయవచ్చు. ఇలా చేస్తే తక్కువ స్థలంలోనే ఎక్కువ పంటలు పెంచవచ్చు. కుటుంబానికి అవసరమయ్యే కూరగాయలు, ఆకుకూరల్లో సగం వరకు తాను ఇలాగే పెంచుతున్నారు.

‘శని, ఆదివారాలు పూర్తిగా ఇంటిపంటలకే కేటాయిస్తున్నా. అపార్ట్‌మెంట్లు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు, స్కూళ్లలో ఈ పద్ధతుల్లో మొక్కల పెంపకంపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. స్నేహితుల కోరిక మేరకు శుభకార్యాల సందర్భంలోనూ సృజనాత్మక ఇంటిపంటల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నా. ఇవి చూసి కొందరు ఇంటిపంటల సాగు ప్రారంభిస్తున్నారు. ఈ పంటలను చూసినప్పుడల్లా వాళ్లు నన్ను తలుచుకుంటారనే భావన ఎంతో సంతోషం కలిగిస్తోంది’ అంటున్నారు నివేదిత.         
                
- దండేల కృష్ణ, సాగుబడి డెస్క్,  ఫొటోలు : గడిగె బాలస్వామి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement