రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఈ నెల 10వ తేదీ నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం
10న విద్యార్థి, యువకుల ర్యాలీలు.. 11న రైతులతో ట్రాక్టర్ల ర్యాలీలు
12న హైవేల దిగ్బంధం- వంటా వార్పు
14న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ర్యాలీలు, సభలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఈ నెల 10వ తేదీ నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు శనివారం తదుపరి కార్యాచరణను ప్రకటించారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయే ప్రాంతాల్లో డిసెంబర్ 10న విద్యార్థులు, యువకులతో ర్యాలీలు, 11న రైతులతో ట్రాక్టర్ల ర్యాలీలు, 12న రహదారులతో పాటు హైవేల దిగ్బంధం, అదే రోజు వంటా వార్పు, 14నజిల్లాల్లోని ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రోజు చొప్పున భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగితే తీవ్రంగా నష్టపోయేది విద్యార్థులు, యువకులు, రైతులే కనుక వారు ఈ ఉద్యమంలో పెద్ద సంఖ్య లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు అన్ని వృత్తి వర్గాల వారు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఏకమై ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు.
విభజన బిల్లు ముసాయిదా కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొంది రాష్ట్రపతికి చేరుకున్నది కనుక ఈ తరుణంలో గ్రామస్థాయి నుంచి ఉద్యమం ఉధృతం చేయాలని, ఈ తరుణంలో దేశం మొత్తం దృష్టిని ఆకర్షించే విధంగా విభజన వల్ల నష్టపోతున్న ప్రాంతాల ప్రజలు ఆందోళనల్లో పాల్గొనాలని జగన్ కోరారు. 75 శాతం మంది ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నా రాష్ట్రాన్ని చీల్చాలని చూడ్డం నిరంకుశత్వం అని ఆయన అన్నారు. పార్టీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు శోభా నాగిరెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఉద్యమ కార్యాచరణ వివరాలను వెల్లడించారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీల నేతలను జగన్ కలుసుకుని విభజనకు వ్యతిరేకంగా వారి అభిప్రాయాన్ని కూడగడుతున్నారని, విభజన బిల్లును పార్లమెంట్‌లో అన్ని పక్షాలతో కలిసి అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు.