మంచి రోజులు మళ్లీ వస్తాయి | ys sharmila paramarsha yatra fourth day in warangal district | Sakshi
Sakshi News home page

మంచి రోజులు మళ్లీ వస్తాయి

Sep 11 2015 1:45 AM | Updated on Sep 3 2017 9:08 AM

మంచి రోజులు మళ్లీ వస్తాయి

మంచి రోజులు మళ్లీ వస్తాయి

‘‘అంతా మంచే జరుగుతుంది. ఇక నుంచి మీరు మా కుటుంబమే. ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నాం.

ఓరుగల్లు పరామర్శ యాత్రలో షర్మిల భరోసా
* నాలుగో రోజు ఏడు కుటుంబాలకు ఓదార్పు
* షర్మిల రాకతో పులకిస్తున్న కుటుంబాలు
* నేడు ముగియనున్న రెండో దశ యాత్ర
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘‘అంతా మంచే జరుగుతుంది. ఇక నుంచి మీరు మా కుటుంబమే. ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నాం. మంచి రోజులు మళ్లీ వస్తాయి’’ - అంటూ పరామర్శ యాత్రలో తనను ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటున్న వారికి షర్మిల భరోసా ఇచ్చారు.

వరంగల్ జిల్లాలో ఆమె రెండో దశ పరామర్శ యాత్ర గురువారం నాలుగో రోజు నర్సంపేట, పరకాల, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగింది. మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మరణించిన ఏడుగురి కుటుంబాలను షర్మిల పరామర్శించారు. నర్సంపేటలోని సెయింట్ మేరీ స్కూల్ ఆవరణ నుంచి మొదలై దుగ్గొండి, శాయంపేట, రేగొండ, పరకాల మండలాల్లో 98 కిలోమీటర్ల దూరం యాత్ర జరిగింది.

వైఎస్ తనయ, జగన్‌మోహన్‌రెడ్డి సోదరి తమ గ్రామాలకు వస్తోందని తెలియగానే ఆమెను చూసేందుకు ప్రజలు బారులుతీరారు. దారిపొడవునా ఘనస్వాగతం పలికారు. ఆత్మీయంగా ఆదరించారు. తమ ఇంటి మనిషే తిరిగొచ్చినట్టుగా ఆనందపడ్డారు. వైఎస్ మృతితో తమ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినట్టే అయిందంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘మీ నాయన మాకు చేసిన మేలు మాటల్లో చెప్పలేమమ్మా. పింఛన్లు, ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ వంటి పథకాలతో మాకందరికీ ఆత్మీయుడయ్యాడాయన.

ఆయన పోయాక అంతా మారిపోయింది’’ అని పరకాల మండలం కామారెడ్డిపల్లెలోని కొయ్యడ రాజమౌళి కుటుంబసభ్యులు అన్నారు. ‘వైఎస్ ఉంటే మాకు భరోసా ఉండేది. ఇంత దూరం మాకోసం వచ్చిన నిన్ను మరవమమ్మా’ అని ఆత్మకూరు మండలం పెద్దాపురంలో వేల్పుల వీరమ్మ కుటుంబసభ్యులు అన్నారు.

డిమాండ్ల సాధన కోసం నిరసన దీక్షలు చేస్తున్న ఆశ వర్కర్లు ఆత్మకూరు, రేగొండ మండల కేంద్రాల్లో షర్మిల దగ్గరికి వచ్చి కలిశారు. తమ డిమాండ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావించేలా చూడాలని కోరారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని షర్మిల హామీ ఇచ్చారు. జిల్లాలో షర్మిల రెండో దశ పరామర్శ యాత్ర శుక్రవారంతో ముగియనుంది.
 
అన్నం పెట్టిన మహానేత
నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం బంధంపల్లిలో ఎల్లాపురం కొమురమ్మ ఇంటికి షర్మిల వెళ్లారు. కొమురమ్మ మనుమరాలు అంకిళ్ల జ్యోతిని పరామర్శించారు. పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం పెద్దాపురంలోని వేల్పుల వీరాస్వామి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం పత్తిపాకలో బోయిని నర్సయ్య కుటుంబసభ్యులను ఓదార్చారు. ‘అమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్త’ అని నర్సయ్య భార్య పోచమ్మతో అన్నారు.

షర్మిల తమ ఇంటికి రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం రేగొండ మండలం కోనారావుపేటలోని తిప్పారపు మల్లమ్మ, సుల్తాన్‌పూర్‌లో గజవెల్లి వెంకట్రాజం కుటుంబాలను ఓదార్చారు. ‘ధైర్యంగా ఉండండి. మీకు అండగా ఉంటా’నంటూ వెంకట్రాజం భార్య రాధక్కకు భరోసా ఇచ్చారు. అనంతరం కనిపర్తిలోని పల్లెబోయిన ఓదెలు కుటుంబాన్ని పరామర్శించారు. ‘ఆరోగ్యం ఎలా ఉంది? నాతో వస్తావా’ అని ఓదెలు భార్య సారమ్మను అడిగారు.

రాజన్న బిడ్డ తన ఇంటికొచ్చిందంటే నమ్మలేకపోతున్నానంటూ సారమ్మ ఆనందపడ్డారు. తర్వాత పరకాల మండలం కామారెడ్డిపల్లెలో రాజమౌళి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో జరుగుతున్నపరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మునిగాల విలియం, నాడెం శాంతికుమార్, భీమయ్యగౌడ్, ఎస్.భాస్కర్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌రావు, ఎ.కుమార్, ఎం.శంకర్, టి.నాగారావు, ఎ.సంతోష్‌రెడ్డి, ఎస్.భిక్షపతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement