ఆటవిక పాలన

ఆటవిక పాలన - Sakshi


♦ భూములివ్వని రైతులపై చంద్రబాబు దాష్టీకం

♦ రాజధాని పేరుతో దుర్మార్గం

♦ నిప్పులు చెరిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

 

 సాక్షి, విజయవాడ బ్యూరో: ‘బిహార్‌లో జంగల్ రాజ్ (ఆటవిక పాలన) ఉండేదని విన్నాం... ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన అంతకన్నా దుర్మార్గంగా మారిపోయింది. చంద్రబాబు రాక్షసుడిలా మారిపోయాడు. రాజధానికి భూములు ఇవ్వని రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నానా ఇబ్బందులు పెడుతున్నారు. పొలాల్లో డ్రిప్‌లు తీసేస్తున్నారు. పాస్‌బుక్‌లు ట్యాంపర్ చేసేస్తున్నారు. చివరకు రైతుల పంటలు కూడా కాల్చేస్తున్నారు.’ అని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సోమవారం రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన తుళ్లూరు మండలం మల్కాపురంలో దగ్ధమైన చెరకు తోటను పరిశీలించారు. చెరకుతోట రైతు గద్దె చంద్రశేఖరరావును పరామర్శించారు. అక్కడకు చేరుకున్న రైతులు తాము పడుతున్న కష్టాలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన ఉద్ధండరాయునిపాలెంలోనూ పర్యటించారు. రెండుచోట్లా రైతులను ఊరడించిన జగన్ రాష్ర్టప్రభుత్వ దాష్టీకాలపై తీవ్రంగా మండిపడ్డారు. మల్కాపురంలో ఆయనేమన్నారంటే... అక్కడ కేసులుండవ్ అరెస్టులుండవ్..

 రాజధానికి భూములు ఇవ్వని రైతుల పంటలు కాల్చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కి వెళితే కేసులు పెట్టరు. కేసులు పెట్టినా ఎవరినీ అరెస్టు చేయరు. పంటలు తగులబెట్టిన సంఘటనలు ఇప్పటికి 13 జరిగాయి. ఇంతవరకూ ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. పంట తగలబెట్టారని కాకుండా తగలబడిందని రాయాలని శేఖరన్న (చెరకుతోట రైతు)కు డీఎస్‌పీ చెప్పారట. ఎవరో సిగరెట్ తాగి పడేస్తే పంట కాలిపోయిందని చెబుతాడా? డీఎస్‌పీ సిగరెట్ ఏమైనా ఇక్కడ పొరపాటున పడిందా? లేకపోతే ఆయనే తగులబెట్టించాడా? చంద్రబాబు పురమాయిస్తూనే ఉన్నాడు, ఆయన మంత్రులు చేయిస్తూనే ఉన్నారు, ఎవరినీ అరెస్టు కూడా చేయరు.చంద్రబాబు, మంత్రుల భూముల మీద ఇదే మాదిరిగా ఎవరైనా వచ్చి.. మీ భూముల్ని బలవంతంగా లాక్కుంటాం, ఇవ్వకపోతే తగులబెడతామంటే ఒప్పుకుంటారా? చంద్రబాబు, వాళ్ల మంత్రులు ఒప్పుకోనప్పుడు, ఒప్పుకోని రైతుల మీద, శేఖరన్న లాంటి వారి మీద ఇలా దాష్టీకం చేయడం ఎంతవరకూ ధర్మం? ఇలా చేయడం న్యాయమేనా. మనుషులం రాక్షసులం అవుతున్నాం. చంద్రబాబు మానవత్వం అన్న గీతను దాటి అధికార మత్తుతో రాక్షసుడైపోయాడు. ఇది ధర్మమేనా అని చంద్రబాబు తన మనస్సాక్షిని అడగాలి. అధికారం శాశ్వతం కాదు. కోర్టుకెళ్లి అడ్డుకుంటాం...

 పూలింగ్‌కు భూమి ఇవ్వలేదని పాస్‌పుస్తకాలను రద్దుచేశారు. ఇంతకన్నా హేయం మరొకటి ఉంటుందా?. ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేయడం నిజంగా భావ్యం కాదు. ఎవరైతే ఇస్తానన్నారో వాళ్ల దగ్గర భూములు తీసుకోండి. ఎవరైతే ఇవ్వనంటారో వాళ్లని  వదిలేయండి. అధికారం ఉంది కదా అని దౌర్జన్యంగా లాక్కునే కార్యక్రమం మాత్రం పూర్తిగా ఖండించదగ్గ విషయం. చంద్రబాబు ఇప్పటికైనా మనసు మార్చుకోవాలి. శేఖరన్నలాంటి రైతులందరికీ అండగా ఉంటాం. చంద్రబాబు బలవంతంగా లాక్కునే కార్యక్రమం చేస్తే కోర్టుకు వెళదాం. కేసు వేసి దీన్ని అడ్డుకునే కార్యక్రమం చేద్దాం. బలవంతంగా లాక్కునే ప్రక్రియను పూర్తిగా అడ్డుకుంటాం. అయినా కూడా చంద్రబాబు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బలవంతం చేస్తే అది ఎల్లకాలం చెల్లదు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుంటుందో, మూడేళ్లుంటుందో... అంతకంటే ఎక్కువుండదు. తర్వాత మనం వస్తాం.  రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూముల్ని అప్పుడు తిరిగి వెనక్కిస్తాం. బీదలపైనే ప్రతాపం...

 పేదవాళ్లకు అంతో ఇంతో ఎక్కువ ఇవ్వాల్సిందిపోయి తక్కువ ఇస్తున్నారు. పూలింగ్‌కి భూములిస్తే వేరేచోట 1200 గజాలు ఇస్తూ అసైన్డ్ భూములిచ్చిన పేదలకు మాత్రం 800 గజాలు ఇస్తున్నాడు చంద్రబాబు. అది కూడా ఇష్టం వచ్చినట్లు లాక్కోవాలని చూస్తున్నాడు. పేదలకు ఒకసారి భూములిచ్చిన తర్వాత తిరిగి లాక్కునే అధికారం చంద్రబాబుకు ఎక్కడుంది? సంతకాలు పెట్టకపోయినా రెవెన్యూ రికార్డులను మార్చేసుకుని వాళ్లంతట వాళ్లే భూములను లాక్కునే నీచమైన కార్యక్రమానికి సాక్షాత్తూ ప్రభుత్వం ఒడిగడుతోంది. ఇంతకన్నా అన్యాయం ఏదైనా ఉంటుందా? బీదవాడికి అన్యాయం చేసిన ఉసురు చంద్రబాబుకు తప్పక తగులుతుంది.రైతుల దగ్గర  భూములు లాక్కుంటున్నారు. చంద్రబాబు బినామీలు మురళీమోహన్, సుజనాచౌదరి లాంటి వాళ్లు మాత్రం ఇక్కడ తక్కువకు వాటిని కొని గజం రూ.15 వేలకుపైగా అమ్ముకుంటున్నారు. వాళ్ల భూములు మాత్రం ఎవరూ తీసుకోరు. భూములివ్వడంలేదని పెన్షన్లు కూడా ఎత్తేస్తున్నారు. పనులు లేని వాళ్లకి రూ 2,500 పెన్షన్ ఇస్తామన్నారు. దాని సంగతి దేవుడెరుగు ఇచ్చే వెయ్యి రూపాయలుకూడా ఇవ్వడంలేదు. పనులు లేవని అడిగితే రోడ్లు ఊడవడానికి రావాలని బలవంతం చేస్తున్నారు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? ఈ భూములపై కోర్టుకు వెళదాం. మనం వచ్చాక అసైన్డ్ భూముల చట్టాన్ని మారుస్తాం.ఒకసారి భూములిచ్చిన తర్వాత వారి అంగీకారం లేకుండా బలవంతంగా తీసుకునే అవకాశం లేకండా మార్పులు చేస్తాం. అన్ని రకాలుగా పోరాటం చేద్దాం. చంద్రబాబుకు రాబోయేరోజుల్లో దేవుడు మొట్టికాయలు వేస్తాడు. ఆయన ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసే రోజు వస్తుంది. ఆరోజు దగ్గర్లోనే ఉంది. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది’

 

 అసైన్డ్ భూములు బాబు అత్తగారి సొత్తు కాదు


 మల్కాపురం నుంచి ఉద్దండరాయునిపాలెం దళితవాడకెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డికి అక్కడి రైతులు తమ గోడు వినిపించారు. అందరి సమస్యలు అడిగి తెలుసుకున్న జగన్ ఆ తర్వాత మాట్లాడారు... ‘ఈ గ్రామంలో పేదవాళ్లు బతకడం కోసం అసైన్డ్ భూములను ఇచ్చారు. వాటిని చంద్రబాబు తన అత్తగారి సొత్తు అన్నట్లు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు, ఇష్టం వచ్చినట్లు తీసుకునే కార్యక్రమం చేస్తున్నాడు. మనకు సంబంధం లేకుండా, ఒప్పుకోకపోయినా, ఇష్టం వచ్చినట్లు బలవంతంగా తీసుకుంటున్నాడన్న విషయం అందరికీ తెలియాలి. అసైన్డ్ భూములంటే చంద్రబాబు అత్త సొత్తు కాదని, అవి పేదవాడి భూములని, వాటిని తీసుకునే హక్కు వాళ్ల నాయనక్కూడా లేదని అర్థమయ్యేట్లు చెప్పాలి.రైతులు ఒప్పుకోకపోయినా రికార్డుల్ని వారే రాసేసుకుని ఈ భూముల్ని తీసుకుంటున్నారు. 50, 60 సంవత్సరాల నుంచి ఈ భూములను రైతులు సాగుచేసుకుంటున్నారు. పన్నులు వాళ్లే కడుతున్నారు. రశీదులు వారివద్దే ఉన్నాయి. సంతకాలు పెట్టకపోయినా, వాళ్ల అంగీకారం లేకపోయినా భూములు తీసుకుంటున్నారు. బొంగులు వాళ్లు తగులబెట్టి... మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి చెబితే చేశానని చెప్పాలంటూ రైతులను చిత్రహింసలు పెట్టారు. అయినా వారు నిజాయితీగా జగన్‌మోహన్‌రెడ్డిని ఇంతవరకూ చూడనేలేదని చెప్పారు. ఆ పేదరికంలో నిజాయితీ ఉంది, ఆ నిజాయితీ మంత్రులకు, చంద్రబాబుకు లేదు. రైతులు ఒప్పుకోకపోయినా వారి భూములను తీసుకుని శంకుస్థాపన కోసం అందులోనే హెలీప్యాడ్‌లు కూడా కట్టారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top