
టీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టేదెలా?
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు టీపీసీసీ వ్యూహరచన చేస్తోంది.
టీపీసీసీ మల్లగుల్లాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు టీపీసీసీ వ్యూహరచన చేస్తోంది. గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం టీపీసీసీ సర్వే నిర్వహిస్తోంది. తెలంగాణకు గుండెకాయ లాం టి హైదరాబాద్‌లో కాంగ్రెస్ బలాన్ని నిరూపించుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. పార్టీ అభ్యర్థుల జాబితా రూపకల్పనను నియోజకవర్గాల ఇన్‌చార్జీలకు, ముఖ్యనేతలకు, సీనియర్లకు వదిలేయకుండా అప్రమత్తంగా ఉండాలని భావిస్తోంది. డివిజన్లు, నియోజకవర్గాల వారీగా ఒక వర్గానికి లేదా నాయకునికి అనుకూలంగా కాకుండా పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టికెట్లపై నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది.
దీనికోసం డివిజన్ల వారీగా ఆశావహుల పేర్లు, వారి బలాబలాలు, ప్రజలతో ఉన్న సంబంధాలు వంటివాటిపై రహస్యంగా సర్వే నిర్వహిస్తోంది. దీన్నిబట్టి గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వడానికి టీపీసీసీ స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో తక్కువ బలమున్న టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను తమ పార్టీలో భారీగా చేర్చుకుంది. ప్రతిపక్షాల మనోస్థైర్యాన్ని దెబ్బకొట్టాలనే మైండ్‌గేమ్‌తో టీఆర్‌ఎస్ వ్యూహరచన ఉందని టీపీసీసీ ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు.
టీఆర్‌ఎస్ మైండ్‌గేమ్‌ను ఎదుర్కొని, కాంగ్రెస్ శ్రేణుల్లో గెలుపు విశ్వాసాన్ని కల్పించేలా ప్రతి వ్యూహం కోసం టీపీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు, పార్టీ సీనియర్లు, ముఖ్యులు తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతల మధ్య జరిగిన వివాదాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క సీరియస్‌గా తీసుకున్నారు. నియోజకవర్గాలు, డివిజన్ల వారీగా నేతల మధ్య వ్యక్తిగత విభేదాల పరిష్కారానికి స్థానిక స్థాయిలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయనున్నట్టు టీపీసీసీ ముఖ్యనేత ఒకరు చెప్పారు.