
ఆకాశంలో ట్రాఫిక్ జామ్!
రోడ్డు మీదే కాదు.. ఆకాశంలోనూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రమాదాలు జరిగే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి.
* విశాఖలో ఫ్లీట్ రివ్యూ ప్రభావం
* ల్యాండింగ్‌కు అనుమతి లేక విమానాల చక్కర్లు
* ఆ క్రమంలో ఎదురుపడిన మూడు విమానాలు
గోపాలపట్నం (విశాఖపట్నం): రోడ్డు మీదే కాదు.. ఆకాశంలోనూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రమాదాలు జరిగే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇదంతా ఎక్కడా అనుకుంటున్నారా..? మన విశాఖలోనే. దీనికి కారణం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ప్లీట్ రివ్యూ ప్రభావమేనని తెలుస్తోంది. ఫ్లీట్ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయానికి వచ్చే విమానాలను ఇప్పటికే నియంత్రించారు. అలాగే విన్యాసాల రిహార్సల్స్ జరుగుతున్న సమయాల్లో కొన్ని విమానాల రాకపోకలు నిలిపివేయడం..
మరికొన్నింటిని దారి మళ్లించడం చేస్తున్నా విమానాల ల్యాండింగ్ సమయంలో ఉత్కంఠ నెలకొం టోంది. ఈ క్రమంలో గురువారం మూడు విమానాలు ఒకదానికొకటి ఎదురుపడ్డాయని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు ఆందోళన చెందారు. పరిస్థితి అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. నేవీ విన్యాసాల దృష్ట్యా విశాఖ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకూ విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగింది. దీంతో సాయంత్రం 5 గంటలకు విశాఖకు రావలసిన ఎయిరిండియా విమానం రాత్రి 7 గంటలకు రన్‌వేపై ల్యాండైంది.
అంతకుముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంకేతాలు రాకపోవడంతో ఈ విమానం ఎస్.కోట మీదుగా చక్కర్లు కొట్టింది. అలాగే సాయంత్రం 4.20కి హైదరాబాద్ నుంచి విశాఖకు రావాల్సిన ఇండిగో విమానం రాత్రి 7.05కి చేరింది. ఈ విమానం కూడా యలమంచిలి వైపు సుమారు నలభై నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. మరోవైపు హైదరాబాద్ నుంచి రాత్రి 7.10కి విశాఖకు చేరిన మరో ఇండిగో విమానం కూడా అరగంట సేపు చక్కర్లు కొట్టింది. ఇలా చక్కర్లు కొట్టే క్రమంలో ఈ మూడు విమానాలూ ఒకదానికొకటి ఎదురుపడ్డాయని సమాచారం.
అధికారులు బయటకు ఏమీ చెప్పకపోయినా.. దీనిపై చర్చించుకున్నట్లు తెలిసింది. విమానాలు ఎదురెదురుగా రావడంపై వారొక ఊహా చిత్రం కూడా రూపొం దించారని తెలిసింది. ఇక ముందు ఈ పరిస్థితి రాకుండా చేపట్టాల్సిన రక్షణచర్యలపై విమానాశ్రయ అధికారులు చర్చిస్తున్నారు.
సాగర తీరంలో గగుర్పొడిచే విన్యాసాలు
విశాఖపట్నం: ఇటీవలే భారత నావికా దళంలోకి చేరిన ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నుంచి మిగ్ 29కే యుద్ధ విమానాలు.. మరోవైపు సీ హారియర్స్ ముందుకు దూసుకువచ్చే సన్నివేశాలు విశాఖ సాగరతీరంలో నగర వాసులకు గగుర్పాటు కల్పించాయి. సముద్రంలో కొలువు తీరిన యుద్ధ నౌకల నుంచి గగనతలంలోకి బాంబులు ఒకదాని వెంట మరొకటిగా లక్ష్యాన్ని ఛేదించడం.. ల్యాండింగ్ డాక్ ప్లాట్‌ఫాం నుంచి సైనికులు తీరప్రాంతంలోకి దూసుకువచ్చి శత్రుస్థావరాలపై దాడి చేసే సన్నివేశాలు కనువిందు చేస్తున్నాయి.
అంతర్జాతీయ నేవీ ఫ్లీట్‌కు సన్నాహకంగా బుధవారం ప్రారంభించిన రిహార్సల్స్ గురువారం సాయంత్రం కూడా కొనసాగించారు. పలు యుద్ధ నౌకలు, సీ హారియర్స్ వంటి యుద్ధ విమానాలకు తోడు యుద్ధ ట్యాంకులు, కమెండోలు, పారాట్రూపర్స్ ఈ ఆపరేషన్ డెమోలో పాల్గొని తమ ప్రతిభ చాటుతున్నారు. యుద్ధం వస్తే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించారు. శుక్రవారం కూడా రిహార్సల్స్ జరగనున్నాయి.