
నేడు తొలి దశ పోరు
బిహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం ఐదు దశల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో మొదటి విడతలో 49 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది
♦ బిహార్‌లో ఎన్నికలకు సర్వం సిద్ధం
♦ 49 స్థానాలకు పోలింగ్
పట్నా: బిహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం ఐదు దశల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో మొదటి విడతలో 49 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. మొత్తం 583 మంది అభ్యర్థుల తలరాతను 1,35,72,339 మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. 10 జిల్లాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి చెప్పారు. అయితే ఎక్కువ స్థానాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుందని తెలిపారు. 583 మంది అభ్యర్థుల్లో 50 మంది మహిళలున్నారు. మోదీ నేతృత్వంలో ఎన్డీఏ, సీఎం నితీశ్ నేతృత్వంలో మహాకూటమి హోరాహోరీగా ప్రచారం సాగించాయి.
సమస్తిపూర్, బేగుసరాయ్, భాగల్పూర్, బాంకా, ఖగారియా, ముంగేర్, లఖీసరాయ్, షేక్‌పురా, నవద, జాముయ్ జిల్లాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. మొత్తం 13,212 పోలింగ్ స్థానాల్లో పోలింగ్ శాంతియుతంగా జరిగేందుకు కట్టుదిట్ట భద్రతా ఏర్పాట్లు చేశామని అధికారి తెలిపారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో కేంద్ర పారామిలిటరీ బలగాలుంటాయని, అదనంగా ద్రోణ్, హెలికాప్టర్లను వినియోగించనున్నట్లు చెప్పారు. ఈ 49 నియోజకవర్గాలకు 2010లో జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా జేడీయూ 29 స్థానాల్లో గెలుపొందింది. ఆ ఎన్నికల్లో జేడీయూతో కలసి పోటీచేసిన బీజేపీ 13 స్థానాలను కైవసం చేసుకోగా, ఆర్జేడీ నాలుగు స్థానాలు దక్కాయి.
‘లాలూను మోసం చేసిన నితీశ్’
భభువా: లాలూ ప్రసాద్ యాదవ్‌ను నితీశ్ కుమార్ నిలువునా మోసం చేశారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం ఆదివారం ఆరోపించారు. బిహార్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన నితీశ్ వలలో లాలూ పడిపోయి ఆయనతో పొత్తు పొట్టుకున్నారన్నారు. దాణా స్కాం కేసుల విచారణలో కోర్టుల వెంటపడి లాలూకు అయిదేళ్ల జైలుశిక్ష పడేలా చేసింది నితీశ్ మనుషులేనని.. అలాంటి నితీశ్‌తో లాలూ ఎలా జతకలిశారో అర్థం కావటం లేదని ములాయం అన్నారు.
మోదీ ఎన్నికల సభకు ఈసీ అనుమతి
భభువా/పట్నా: బిహార్‌లోని కైమూర్ జిల్లా భభువాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఎన్నికల ప్రచార సభ నిర్వహించటానికి ఎన్నికల సంఘం అనుమతించింది. రాష్ట్రంలో సోమవారం తొలి దశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఈ సభను నిర్వహించటం కుదరదని జిల్లా కలెక్టర్ శనివారం అనుమతి నిరాకరించటం వివాదాస్పదమైంది.