'సుల్తాన్‌' కలెక్షన్ల వెనుక గూడుపుఠాణి! | Sultan box office collection, Why the movie is yet to enter Rs 300 crore club | Sakshi
Sakshi News home page

'సుల్తాన్‌' కలెక్షన్ల వెనుక గూడుపుఠాణి!

Aug 4 2016 6:38 PM | Updated on Sep 4 2017 7:50 AM

'సుల్తాన్‌' కలెక్షన్ల వెనుక గూడుపుఠాణి!

'సుల్తాన్‌' కలెక్షన్ల వెనుక గూడుపుఠాణి!

జూలై 6న విడుదలైన సల్మాన్‌ ఖాన్‌ 'సుల్తాన్‌' సినిమా వస్తూనే కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది.

జూలై 6న విడుదలైన సల్మాన్‌ ఖాన్‌ 'సుల్తాన్‌' సినిమా వస్తూనే కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. తొలిరోజే రూ. 36 కోట్లకుపైగా కొల్లగొట్టిన ఈ సినిమా.. తొలి వీకెండ్‌లో రూ.100 కోట్లను తన ఖాతాలో వేసుకొంది. రెండోవారంలోనూ వసూళ్ల ప్రభంజనం కొనసాగడంతో కొన్నిరోజుల్లోనే 200 కోట్ల క్లబ్బులోనూ 'సుల్తాన్‌' చేరిపోయింది.

సల్మాన్‌ఖాన్‌, అనుష్క శర్మ జంటగా ఓ మల్లయోధుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులన్నింటినీ బద్దలుకొడుతుందని పరిశీలకులు భావించారు. సల్మాన్‌ ఖాన్‌ 'బజరంగీ భాయ్‌జాన్‌' తర్వాత దేశంలో రూ. 300 కోట్లు వసూలుచేసిన మరో సినిమాగా 'సుల్తాన్‌' నిలుస్తుందని ఆశించారు. కానీ, రానురాను 'సుల్తాన్‌' వసూళ్లు దారుణంగా తగ్గిపోయాయి. ఇప్పుడు నాలుగో వారంలోకి ప్రవేశించినప్పటికీ 'సుల్తాన్‌' రూ. 300 కోట్ల క్లబ్బులోకి ప్రవేశించలేదు. నాలుగో వారం ముగిసేసరికి ఈ సినిమా రూ. 297.56 కోట్లు వసూలు చేసిందని బాలీవుడ్‌ వాణిజ్య విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్ ట్విట్టర్‌లో తెలిపారు.

అభిమానుల అనుమానం!
'సుల్తాన్‌' కలెక్షన్ల విషయంలో సల్మాన్‌ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 'సుల్తాన్‌' నిర్మాత అయిన యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌ (వైఎఆర్‌ఎఫ్‌) సంస్థ కావాలనే సినిమా వసూళ్లను తక్కువచేసి చూపిస్తున్నదని మండిపడుతున్నారు. 'సుల్తాన్‌' సినిమా దేశీయంగా రూ.300 కోట్ల క్లబ్బులో చేరితే.. లాభాల్లో తనకు గణనీయమైన వాటా ఇవ్వాలని సల్మాన్‌ నిర్మాతతో ఒప్పందం చేసుకున్నాడట. సాధారణంగా బాలీవుడ్‌ ఖాన్‌ త్రయం తమ సినిమా లాభాల విషయంలో నిర్మాతతో ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. అదేవిధంగా నిర్మాతతో సల్మాన్‌ కూడా ఒప్పందం చేసుకున్నాడని, దీంతో 'సుల్తాన్‌' రూ. 300 కోట్ల క్లబ్బులో చేరకుండా తక్కువ వసూళ్లను నిర్మాత చూపిస్తున్నాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. 'సుల్తాన్‌ వసూళ్లను తక్కువ చేసి చూపడం మానండి' అంటూ (#YRFStopReducingSULTANFigures) ట్విట్టర్‌లో సల్మాన్‌ ఫ్యాన్స్‌ చేస్తున్న ప్రచారం ఇప్పుడు ట్రేండ్‌ అవుతోంది. దీనిపై చిత్రయూనిట్‌ ఏమంటుందో చూడాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement