ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చేదు అనుభవం ఎదురైంది.
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చేదు అనుభవం ఎదురైంది. పలువురు విద్యార్థులు సీఎం యోగి కాన్వాయ్‌ను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సీఎంకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. యోగి హయాంలో ముస్లింలు, దళితులపై హింస పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీఎం కాన్వాయ్ కొంతసేపు ఆగిపోయి.. గందరగోళ వాతావరణం ఏర్పడింది. బుధవారం సాయంత్రం లక్నో యూనివర్సిటీ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. సీఎం కాన్వాయ్ వస్తుండగానే విద్యార్థులు కాన్వాయ్‌కు అడ్డంగా రోడ్డు మీద పడుకొని నిరసనకు దిగారు.
సీఎం యోగి తొలిసారి యూనివర్సిటీ వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. సీఎం కాన్వాయ్ నిలిచిపోయి.. గలాటా వాతావరణం నెలకొనడంతో ఉన్నతాధికారులు ఫైర్ అయ్యారు. భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక సబ్ ఇన్‌స్పెక్టర్, ఆరుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో సీఎం పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్ష ఏఐఎస్‌ఎఫ్, సమాజ్‌వాదీ పార్టీ విద్యార్థి విభాగం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సీఎం కాన్వాయ్‌ను అడ్డుకొని ఉద్రిక్తతకు కారణమైన మొత్తం 14మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అందులో నలుగురు విద్యార్థినులు ఉన్నారు.