దురదృష్టకరం.. అవాంఛనీయం! | Sakshi
Sakshi News home page

దురదృష్టకరం.. అవాంఛనీయం!

Published Thu, Oct 15 2015 1:59 AM

దురదృష్టకరం.. అవాంఛనీయం! - Sakshi

దాద్రి ఘటన, గులాం అలీ కచేరీ రద్దుపై నోరు విప్పిన మోదీ
* ఆలస్యంగా, మొక్కుబడిగా స్పందించారన్న విపక్షాలు
* గోద్రా’ను గుర్తు చేసిన శివసేన
కోల్‌కతా/న్యూఢిల్లీ: గోమాంసం తిన్నాడన్న కారణంగా ఇఖ్లాక్ అనే వ్యక్తి హత్యకు గురైన ‘దాద్రి’ ఘటనపై ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పారు. దాద్రి ఘటన, పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖగజల్ గాయకుడు గులాం అలీ కచేరీ కార్యక్రమాన్ని అడ్డుకోవడం మొదలైన ఘటనలు దురదృష్టకరమని, అవాంఛనీయమని వ్యాఖ్యానించారు.

అయితే, వాటికి, కేంద్రప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నిం చారు. ప్రతిపక్షాలు కుహనా లౌకికవాదంతో విభజన రాజకీయాలకు పాల్పడుతున్నాయం టూ విమర్శించారు. బెంగాలీ డైలీ ‘ఆనంద్ బజార్‌పత్రిక’కు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయా ఘటనలపై ఆయన మొదటిసారి ప్రత్యక్షంగా స్పందించారు.  బీజేపీపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ.. ‘బీజేపీ ఇలాంటివాటిని ఎన్నడూ సమర్ధించదు.

ఈ ఘటనలను చూపుతూ ప్రతిపక్షాలు బీజేపీపై మతతత్వ ఆరోపణలు చేస్తున్నాయి. కానీ నిజానికి విభజన రాజకీయాలు చేస్తోంది విపక్షాలే.  కుహనా లౌకికవాదాన్ని బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంది. గతంలోనూ ఈ చర్చ వచ్చింది. ఇప్పుడూ వస్తోంది. ఇలాంటి వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. బీజేపీపై విష ప్రచారం చేస్తున్న పార్టీలు వాస్తవానికి మైనారిటీలు  అభివృద్ది చెందాలని కోరుకోవడంలేదు. వారిని ఓటుబ్యాంకులుగానే చూస్తున్నాయి’ అని విపక్షాలపై ధ్వజమెత్తారు.
 
కొట్టి, సారీ చెప్పినట్లుగా..!
మోదీ తాజా స్పందనపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ‘ఇదేనా మౌనం వీడటమంటే? కొట్టి, సారీ చెప్పినట్లుగా ఉంది మోదీ తీరు.’ అంటూ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ట్వీట్ చేశారు. క్రికెట్లో భారత్ గెలిస్తే తక్షణమే శుభాకాంక్షలు తెలిపే మోదీ, దాద్రి ఘటనపై చాలా ఆలస్యంగా స్పందించారని జేడీయు చీఫ్ శరద్‌యాదవ్ వ్యాఖ్యానించారు. దాద్రి విషయంలో కచ్చితమైన కార్యాచరణ అవసరమని కాంగ్రెస్ ప్రధానికి సూచించింది.

‘మొత్తం దేశానికి ప్రధానినని, దేశంలోని మొత్తం 125 కోట్ల ప్రజల రక్షణ తన బాధ్యత అని మోదీ మరచిపోయారు. గులాం అలీ కచేరీ రద్దైన, సుధీంద్రపై ఇంకుపోసిన మహారాష్ట్రలో బీజేపీనే అధికారంలో ఉన్న విషయాన్నీ ఆయన మరిచారు’ అని కాంగ్రెస్ ముఖ్యఅధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు.
 
‘గోద్రా’ వల్లే మీకీ గౌరవం..!

పాక్ గాయకుడు గులాం అలీ సంగీత కచేరీని అడ్డుకోవడం దురదృష్టకరమన్న మోదీ వ్యాఖ్యలను సేన తప్పుబట్టింది. ‘గోద్రా, అహ్మదాబాద్‌ల వల్లనే మోదీకి గుర్తింపు, గౌరవం. అవే కారణాలతో మేమూ ఆయనను గౌరవిస్తాం.  అలాంటి మోదీనే గులాం అలీ కార్యక్రమాన్ని అడ్డుకోవడం, పాక్ మాజీ మంత్రి కసూరి పుస్తకావిష్కరణను వ్యతిరేకించడం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తే.. ఆ వ్యాఖ్యలు మాకందరికి నిజంగానే దురదృష్టకరం’ అని సేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
 
తెగతెంపుల దిశగా..!
శివసేన జాతీయవాదం, దేశభక్తి విసుగెత్తిస్తే.. సంకీర్ణం నుంచి వైదొలగవచ్చంటూ మంగళవారం సేన చేసిన వ్యాఖ్యలు, సంజయ్ రౌత్ తాజా విమర్శలతో.. కేంద్రంలో, మహారాష్ట్రలో మిత్రపక్షాలైన బీజేపీ, సేనల మధ్య దూరం పెరుగుతోంది. గురువారం జరిగే బీజేపీ సమా వేశంలో దీనిపై చర్చ జరగవచ్చని భా విస్తు న్నారు. అయితే బీజేపీ-శివసేన పార్టీలు గిల్లికజ్జాలు పెట్టుకున్నా ఒకరిని వదిలి మరొకరు ఉండలేరని..అధికారం కోసం ఇద్దరూ కలిసే ఉంటారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement