ముహూర్తం మార్చుకున్న ముఖ్యమంత్రి | secretariat innagration Muhurtam changed: APCM | Sakshi
Sakshi News home page

ముహూర్తం మార్చుకున్న ముఖ్యమంత్రి

Jun 25 2016 6:50 PM | Updated on Mar 28 2019 5:39 PM

ముహూర్తం మార్చుకున్న ముఖ్యమంత్రి - Sakshi

ముహూర్తం మార్చుకున్న ముఖ్యమంత్రి

అనుకున్న సమయంలో.. అనుకున్న విధంగా తాత్కాలిక సచివాలయ పనులు పూర్తి కాకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగుల తరలింపు ముహూర్తాన్ని మార్చారు.

సాక్షి, అమరావతి: అనుకున్న సమయంలో.. అనుకున్న విధంగా తాత్కాలిక సచివాలయ పనులు పూర్తి కాకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగుల తరలింపు ముహూర్తాన్ని మార్చారు. సచివాలయం నుంచి పాలనా కార్యక్రమాలు ప్రారంభించేందుకు మరో రెండురోజులు వాయిదా వేశారు. ఈనెల 29న కేవలం ఐదవ బ్లాక్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌ను ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు శనివారం ప్రకటించారు. అదే రోజు పాలనా కార్యక్రమాలు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. జూలై 6న ఐదవ బ్లాక్‌లోని మొదటి అంతస్తు, 15న 2, 3, 4 బ్లాక్‌ల్లోని గ్రౌండ్‌ఫ్లోర్లు, 21వ తేదీ 2, 3, 4 బ్లాక్‌ల్లోని మొదటి అంతస్తులను ప్రారంభించి పాలనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

మిగిలిన రెండవ అంతస్తు, ఆరవ బ్లాక్‌లను ఎప్పుడు పూర్తిచేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం! మొత్తంగా జూలై చాలా ముఖ్యమైన నెల అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పనులను ముఖ్యమంత్రి శనివారం పరిశీలించారు. ఈనెల 29న ప్రారంభించనున్న ఐదవ బ్లాక్‌ను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లను పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు.

కుంగిన బ్లాక్‌ను పరిశీలించకుండానే వెనుదిరిగిన సీఎం
వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పనుల ప్రారంభం నుంచి రకరకాల ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇటీవల సచివాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం కుంగటం. ఆ తరువాత కొద్దిరోజులకే తాత్కాలిక సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో ఫ్లోర్ కుంగటంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న అధికారయంత్రాంగం, ఇంజనీర్లు ఉలిక్కిపడ్డారు. అయితే భవనం కుంగిన విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. సాక్షి ద్వారా తెలుసుకున్న మిగిలిన పత్రికలు, మీడియా ప్రతినిధులు భవనం కుంగిన విషయాన్ని ప్రముఖంగా ప్రచారం చేశాయి. అయితే ఈ విషయాన్ని అధికారపార్టీ నేతలు జీర్ణించుకోలేకపోయారు.

కొన్ని పత్రికలు, ప్రతిపక్ష పార్టీ నేతలు పనిగట్టుకుని కావాలనే ప్రచారం చేస్తున్నాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలో శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశం, తుళ్లూరులో శనివారం చేపట్టిన ప్లాట్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సాక్షిపై ప్రత్యక్ష దాడికి దిగారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలచే తిట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే తుళ్లూరులో నిర్వహించిన బహిరంగ సమావేశంలో సాక్షిపై తిరగబడాలంటూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. అదే విధంగా సాక్షితో పాటు మిగిలిన ప్రతికలు, మీడియా కూడా సచివాలయం నిర్మాణం కుంగిందని ప్రముఖంగా రాయటం, ప్రసారం చేయడంపైనా సీఎం చిందులు వేశారు.

అయితే తాత్కాలిక సచివాయలం ఫ్లోర్ కుంగిన విషయాన్ని సీఎం చంద్రబాబు పరోక్షంగా ఒప్పుకున్నారు. 'ఇంతపెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు చిన్ని చిన్న పొరబాట్లు సహజం. అదేదో జరిగిందని భూతద్దంలో చూపించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలనుకోవటం పొరబాటు. ఏదైనా ఉంటే చెబితే సరిచేసుకుంటాం' అని బాబు చెప్పటం గమనార్హం! ఇలా తప్పుడు రాతలు రాసేవారిపై, తప్పుడు ప్రచారం చేసే వైఎస్సార్ కాంగ్రెస్‌పై యాక్షన్ తీసుకుందామా? మీరు ఎలా చెబితే అలా చేస్తామంటూ అనుకూల కార్యకర్తలచేత చెప్పించే ప్రయత్నం చేశారు. అయితే శనివారం తాత్కాలిక సచివాలయం పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు కుంగిన రెండవ బ్లాక్‌లోని ఫ్లోర్‌ను పరిశీలించకుండా వెనుదిరిగి వెళ్లిపోవటం గమనార్హం!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement