సర్కార్‌పై రగులుతున్న ఉద్యోగులు

సర్కార్‌పై  రగులుతున్న ఉద్యోగులు


సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంపై ఉద్యోగుల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామంటూ ఊదరగొట్టిన టీడీపీ... అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయించడాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. రొటీన్‌గా వెలువడాల్సిన జీవోల కోసం ఉద్యోగ సంఘాల నేతలు కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. గురువారం విజయవాడ యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన జేఏసీ కార్యనిర్వాహక వర్గ సమావేశం... పెల్లుబుకుతున్న ఉద్యోగుల అసంతృప్తికి వేదిక అయింది.జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐ.వెంకటేశ్వరరావు, చంద్రశేఖరరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కత్తినరసింహారెడ్డి, కమలాకరరావు, రఘురామిరెడ్డి సహా 32 ప్రధాన సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలంలో ఉద్యోగులకు ఏం చేశారో చెప్పాలంటూ కిందిస్థాయి నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని, ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో జేఏసీ నాయకత్వం విఫలమవుతోందంటూ పలు సంఘాల నేతలు ఘాటుగా విమర్శలు చేశారు.

 

సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్రతో భేటీ

ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్రతో జేఏసీ ప్రతినిధిబృందం గురువారం భేటీ అయింది. జేఏసీ సమావేశంలో ప్రభుత్వం మీద వ్యక్తమైన తీవ్ర అసంతృప్తిని ఆయన దృష్టికి తీసుకెళ్లింది. పీఆర్సీ జీవోలు జారీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని, స్పెషల్ పే, అలవెన్స్‌లు, డీఏ.. తదితర అంశాలు సీఎం స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలని సతీష్‌చంద్ర చెప్పారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్‌తో సతీష్‌చంద్ర మాట్లాడారు. స్పెషల్ పే, గ్రాట్యుటీ పరిమితి పెంపు ప్రతిపాదనలను నవంబర్ 2న జరగనున్న మంత్రివర్గ సమావేశం ఎజెండాలో చేర్చనున్నామని రమేష్ తెలిపారు.

 

3న సీఎంతో జేఏసీ భేటీ!

2వ తేదీన జరగనున్న మంత్రివర్గ భేటీలో తీసుకొనే నిర్ణయాలను చూసిన తర్వాత, 3న సీఎం చంద్రబాబుతో భేటీ కావడానికి ప్రయత్నించాలని జేఏసీ నిర్ణయించింది. సీఎం స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసుకోవడానికి 4-5 తేదీల్లో జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top