హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికారుల తొలగింపు | HDFC sacks employees for AT1 bond mis selling | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికారుల తొలగింపు

Mar 21 2026 11:26 AM | Updated on Mar 21 2026 12:34 PM

HDFC sacks employees for AT1 bond mis selling

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లపై హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ వేటు వేసింది. ఎన్నారై (NRI) క్లయింట్లకు 'క్రెడిట్ సూయిస్ AT-1' బాండ్లను తప్పుదోవ పట్టించి విక్రయించినట్లు తేలడంతో బ్యాంక్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. మరోవైపు బ్యాంక్ ఛైర్మన్ అతాను చక్రవర్తి ఆకస్మిక రాజీనామాతో గురువారం స్టాక్ మార్కెట్‌లో బ్యాంక్ షేర్లు 2.4% మేర పతనమయ్యాయి.

వేటు పడిన అధికారులు వీరే..
దుబాయ్ బ్రాంచ్ ద్వారా జరిగిన ఈ బాండ్ల విక్రయ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు ఉన్నతాధికారులను బ్యాంక్ విధుల నుంచి తొలగించింది. వారిలో బ్రాంచ్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ సంపత్ కుమార్, ఈవీపీ (మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా & ఎన్నారై బిజినెస్) హర్ష్ గుప్తా, ఎస్‌వీపీ స్థాయి అధికారి పాయల్ మంధ్యాన్ ఉన్నారు.

అసలేం జరిగింది?
జనవరి 2025లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై బ్యాంక్ అంతర్గత విచారణ చేపట్టింది. దుబాయ్, బహ్రెయిన్ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది, భారత ఎన్నారై క్లయింట్లను తప్పుదోవ పట్టించి అధిక రిస్క్ ఉన్న AT-1 బాండ్లను విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి.

క్లయింట్ల వద్ద ఉన్న ఎఫ్‌సీఎన్‌ఆర్‌ డిపాజిట్లను ఈ బాండ్లలోకి మళ్లించేలా ఒత్తిడి తెచ్చారు.  ఈ బాండ్లను సురక్షితమైన 'ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ' ఉత్పత్తులుగా ప్రచారం చేశారు. పెట్టుబడిదారుల నుంచి ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని, బాండ్లలోని రిస్క్ అంశాలను వారికి వివరించకుండా దాచిపెట్టారని విచారణలో తేలింది.

రెగ్యులేటరీ చర్యలు - భారీ నష్టం
క్రెడిట్ సూయిస్ బ్యాంక్ పతనం తర్వాత, యూబీఎస్ (UBS) నేతృత్వంలో జరిగిన బెయిలౌట్ సమయంలో ఈ AT-1 బాండ్ల విలువ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారు. ఎన్నారైల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా నిషేధం విధించింది.

బ్యాంక్ వివరణ
"మా యూఏఈ బ్రాంచ్‌లో క్లయింట్ ఆన్-బోర్డింగ్ ప్రక్రియలో కొన్ని లోపాలను గుర్తించాం. అంతర్గత విచారణ అనంతరం నిబంధనల ప్రకారం బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకున్నాం" అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది.

ఏమిటీ AT-1 బాండ్లు?
ఇవి ఈక్విటీ లక్షణాలున్న రుణ సాధనాలు. ఇందులో వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, రిస్క్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటే లేదా దివాలా తీస్తే, ఈ బాండ్లలో పెట్టిన పెట్టుబడిని తిరిగి చెల్లించాల్సిన అవసరం బ్యాంకులకు ఉండదు.

Advertisement
 
Advertisement
Advertisement