పాక్పై బాంబు పేల్చిన ఆ దేశ మాజీ రక్షణ మంత్రి | Sakshi
Sakshi News home page

పాక్పై బాంబు పేల్చిన ఆ దేశ మాజీ రక్షణ మంత్రి

Published Wed, Oct 14 2015 8:37 AM

పాక్పై బాంబు పేల్చిన ఆ దేశ మాజీ రక్షణ మంత్రి

న్యూఢిల్లీ: పాకిస్ధాన్ మరోఇరకాటంలో పడింది. ఆ దేశానికి చెందిన మాజీ రక్షణ శాఖమంత్రి ఓ భారతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాంబు పేల్చారు. అల్ ఖాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ గురించి పాకిస్థాన్కు ముందే తెలుసని, తమ దేశమే అతడికి ఆశ్రయం కూడా ఇచ్చిందని పాకిస్థాన్ మాజీ రక్షణ శాఖమంత్రి చౌదరీ అహ్మద్ ముక్తార్ చెప్పారు. అహ్మద్ వ్యాఖ్యలు తెలుసుకున్న పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ డైరెక్టర్ జనరల్ పర్వేశ్ ముషార్రప్, రషీద్ ఖురేషి తీవ్రంగా ఖండించారు.

అహ్మద్ ఒక అబద్ధాలకోరు అని, ఆయన చెప్పేవన్నీ అసత్యాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అసలు తమ దేశంలో ఒసామా బిన్ లాడెన్ ఉన్నట్లు తమకు తెలియనే తెలియదని, తమకు తెలియకుండానే అమెరికా అబోటాబాద్లోని లాడెన్ నివాసంపై దాడులు చేసి హతమార్చిందని పాకిస్థాన్ ప్రపంచాన్ని నమ్ముతూ వచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ రక్షణశాఖ మంత్రి స్వయంగా పాకిస్థాన్కు అంతా తెలుసని వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

'అహ్మద్ ముక్తార్ ఇలాంటి మాటలను అన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఒక వేళ ఆయన నిజంగా ఈ మాటలు అంటే ముక్తార్కు ఏదో అయి ఉంటుంది. ముక్తార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మొత్తం పాకిస్థాన్ను షాక్కు గురిచేసింది. అయితే, పాక్ అధ్యక్షుడికి నాటి లాడెన్ గురించి ముందే తెలుసు అని అన్నట్లు నేను మాత్రం విన లేదు' అని రషీద్ ఖురేషి అన్నారు.

2008 నుంచి 2012 మధ్య కాలంలో అహ్మద్ ముక్తార్ పాక్ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. నాటి ప్రధాని యూసఫ్ రజా గిలానీ కేబినెట్లో ఉన్న ఐదుగురు మంత్రుల్లో ముక్తార్ కూడా ఒకరు. లాడెన్ చనిపోయిన దాదాపు నాలుగన్నరేళ్ల తర్వాత తొలిసారి పాకిస్థాన్ ఇప్పటి వరకు అబద్ధాలతో ప్రపంచాన్ని నమ్మించిందని ముక్తార్ వ్యాఖ్యలతో అర్థమైందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.

Advertisement
Advertisement