రామగుండం ఎరువుల ప్లాంటు పునరుద్ధరణ చర్యలు వేగవంతం అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలు నేషనల్ ఫెర్టిలైజర్స్ (ఎన్‌ఎఫ్‌ఎల్),
న్యూఢిల్లీ: రామగుండం ఎరువుల ప్లాంటు పునరుద్ధరణ చర్యలు వేగవంతం అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలు నేషనల్ ఫెర్టిలైజర్స్ (ఎన్‌ఎఫ్‌ఎల్), ఇంజినీర్స్ ఇండియా (ఈఐఎల్), ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐఎల్) కలిసి బుధవారం జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ. 5,000 కోట్లుగా ఉండనుందని ఎన్‌ఎఫ్‌ఎల్ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. రామగుండం ఎరువుల కర్మాగారం కరీంనగర్ జిల్లాలో ఉంది. కార్యకలాపాలు లాభదాయకంగా లేకపోవడంతో 1999 నుంచి ఇందులో యూరియా, అమోనియా ఉత్పత్తిని నిలిపివేశారు.
అయితే, మూతబడిన ఎఫ్‌సీఐఎల్ యూనిట్లను పునరుద్ధరించాలని ఎన్‌డీఏ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రామగుండం ప్లాంటు కూడా తెరపైకి వచ్చింది. పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం రోజుకూ 2,200 టన్నుల అమ్మోనియా, 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి సామర్థ్యంతో కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దనున్నారు. 2018 నాటికి ప్రాజెక్టు పూర్తి కాగలదని ఎన్‌ఎఫ్‌ఎల్ పేర్కొంది. దీనికి అవసరమైన నిధుల్లో ఎన్‌ఎఫ్‌ఎల్ 26 శాతం సమకూరుస్తుంది. ప్లాంటుకు అవసరమైన సహజ వాయువును ప్రతిపాదిత మల్లవరం-భిల్వారా పైప్‌లైన్ ద్వారాను, నీటి వనరులను గోదావరి నదిపై నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి అందించనున్నారు.