
టీవీ నటి దుర్మరణం
కన్నడ టీవీ నటి రేఖా సింధు కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.
బెంగళూరు: కన్నడ టీవీ నటి రేఖా సింధు కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన దుర్ఘటనలో ఆమె మృతి చెందింది. ఆమె ప్రయాణిస్తున్న కారు తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని సున్నంపకొట్టయ్ గ్రామం సమీపంలో ప్రమాదానికి గురైంది. కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదంలో చనిపోయిన మిగతా ముగ్గురిని అభిషేక్ కుమారన్(22), జయకంద్రన్(23), రక్షణ్(20)గా గుర్తించారు. మృతదేహాలను తిరుపట్టూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డివైడర్‌ను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని వెల్లూరు ఎస్పీ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఆరుగురు ఉన్నారని వెల్లడించారు. గాయపడిన వారిలో ఇద్దరినీ వెల్లూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే దుర్ఘటన జరిగివుండొచ్చని అనుమానిస్తున్నారు. రేఖా సింధు తమిళ, కన్నడ టీవీ షోల్లో నటించింది. షూటింగ్ కోసం చెన్నై వెళుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది.
అయితే ప్రమాదంలో మరో నటి రేఖా కృష్ణప్ప మృతి చెందినట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. తాను బతికేవున్నానని ఆమె తన ఫేస్‌బుక్ పేజీలో వీడియో పోస్ట్ చేసింది. శృంగేరి శారద పీఠం ఆలయంలో ఉన్నానని ఆమె తెలపడంతో చనిపోయింది రేఖా సింధుగా గుర్తించారు.