‘జయలలితకు భారతరత్న ఇవ్వకూడదు’ | Sakshi
Sakshi News home page

‘జయలలితకు భారతరత్న ఇవ్వకూడదు’

Published Fri, Dec 23 2016 9:01 AM

‘జయలలితకు భారతరత్న ఇవ్వకూడదు’

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్‌ను పీఎంకే యూత్‌వింగ్‌ నాయకుడు అన్బుమణి రాందాస్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎలాంటి మచ్చలేని సమగ్ర వ్యక్తిత్వం, దేశ అభివృద్ధికి నిస్వార్థ కృషి చేసినవారికే ఈ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని, ఈ పురస్కారం పొందే అర్హత జయలలితకు లేదని ఆయన పేర్కొన్నారు. జయలలిత 15 అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారని, ఆమెను నిర్దోషిగా వదిలేసిన కేసుకు సంబంధించి అప్పీల్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని రాందాస్‌ ’’ద హిందూ’  పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

అన్నాడీఎంకే ఏకవ్యక్తి పార్టీ కావడంతో జయలలిత మృతితో తమిళనాడులో కొంత రాజకీయ శూన్యం ఏర్పడిందని పేర్కొన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రానున్న నాలుగున్నరేళ్లు అధికారంలో నిలుపాలన్న తాపత్రయంతోనే ఆ పార్టీ నేతలు శశికళకు అండగా నిలుస్తున్నారని అన్నారు. నిజానికి శశికళకు ప్రజామద్దతు లేదని చెప్పారు. జయలలిత ఏనాడు ఆమెను తన రాజకీయ వారసురాలిగా పరిగణించలేదని, ఒకవేళ పరిగణించి ఉంటే ఈపాటికే ఆమెకు పార్టీలో ఏదో ఒక పదవి ఇచ్చి ఉండేవారని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement