థాయిలాండ్‌లో సరోగసీ దుమారం | Sakshi
Sakshi News home page

థాయిలాండ్‌లో సరోగసీ దుమారం

Published Sat, Aug 9 2014 11:24 AM

థాయిలాండ్‌లో సరోగసీ దుమారం

బ్యాంకాక్: థాయిలాండ్‌లో సరోగసీ (అద్దెకు తల్లిగర్భం) విధానం మితిమీరుతుండటంతో సర్వత్రా దుమారం చెలరేగుతోంది. సరోగసీని వ్యాపారంగా మార్చివేయకుండా అడ్డుకునేందుకు చట్టాలను సవరించాలంటూ ఓ పక్క చర్చలు ఊపందుకుంటుండగానే మరోపక్క సరోగసీకి సంబంధించి కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. థాయిలాండ్‌లో ఏకంగా 9 మంది పిల్లలను అద్దెతల్లుల ద్వారా పొందిన జపాన్ వ్యాపారవేత్త షిగెటా మిత్సుతోకి(24) బుధవారం దేశం నుంచి పారిపోయారు. రెండు వారాల నుంచి రెండేళ్ల వయసుల మధ్య ఉన్న 9 మంది పిల్లలను, గర్భంతో ఉన్న ఓ సరోగేట్ తల్లిని లాట్ పారో జిల్లాలోని ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో పోలీసులు కనుగొన్నారు. ఇంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన దంపతులు సరోగేట్ తల్లి ద్వారా ఇద్దరు కవలలను పొందారు. అయితే వారిలో మగపిల్లాడు గ్యామీకి జన్యుపరమైన డౌన్స్ సిండ్రోమ్ రుగ్మత రావడంతో వాడిని వదిలేసి ఆడపిల్లను మాత్రమే తీసుకెళ్లారు.

 

ఈ సంఘటనపై ఆగ్రహం, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. చట్టాలను మార్చాలన్న డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కాగా, సరోగసీ నియంత్రణకు థాయిలాండ్‌లో ప్రత్యేక చట్టాలు లేవు. దీనికోసం కొత్తగా రూపొందించిన చట్టాన్ని ఆ దేశ జాతీయ అసెంబ్లీ త్వరలోనే ఆమోదించనుంది. అయితే డబ్బుకు అద్దెగర్భం ఇవ్వడాన్ని థాయిలాండ్ వైద్య మండలి నిషేధించింది. సంతానం పొందేవారి బంధువులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం ఆ దేశంలో 45 కేంద్రాలు, 240 మంది వైద్యులకు మాత్రమే దీనిపై అనుమతి ఉంది. నిబంధనలను ఉల్లంఘించిన వైద్యుల లైసెన్సులు రద్దుచేయడంతో పాటు ఏడాది జైలు శిక్ష, గరిష్టంగా రూ.40 వేల జరిమానా విధించే అవకాశముంది.  

Advertisement
 
Advertisement