‘వలస నిషేధం’ స్టే కొనసాగింపు

‘వలస నిషేధం’ స్టే కొనసాగింపు - Sakshi


- హవాయి కోర్టు ఉత్తర్వు

- ట్రంప్‌ సర్కారుకు మరోసారి ఎదురుదెబ్బ




వాషింగ్టన్‌: ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ఆరు ముస్లిం దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారిపై విధించిన నిషేధానికి సంబంధించి ట్రంప్‌ సర్కార్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ట్రావెల్‌ బ్యాన్‌పై ఇచ్చిన స్టే కొనసాగుతుందని హవాయి స్థానిక కోర్టు బుధవారం ప్రకటించింది. ఈ మేరకు హవాయిలోని అమెరికా ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి డెరిక్‌ వాట్సన్‌ స్పష్టం చేశారు. ఆరు ముస్లిం మెజారిటీ దేశాలైన ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమెన్‌ నుంచి అమెరికాకు వచ్చే వారిపై ట్రంప్‌ సర్కారు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.



ట్రావెల్‌ బ్యాన్‌కు సంబంధించి ట్రంప్‌ సర్కారు జారీ చేసిన ఉత్తర్వును రెండు నెలల క్రితం హవాయి స్థానిక కోర్టు నిలుపుదల చేసింది. ఈ నిర్ణయాన్ని దీర్ఘకాలిక పార్లమెంటరీ ఇన్‌జంక్షన్‌గా మార్చాలని పిటిషనర్లు న్యాయమూర్తిని కోరగా.. దానికి ఆయన అంగీకరించారు. ఆరు ముస్లిం దేశాల నుంచి విదేశీయుల రాకను అడ్డుకునే 90 రోజుల బ్యాన్‌తో పాటు.. శరణార్థులందరూ దేశంలోకి ప్రవేశించకుండా విధించిన 120 రోజుల నిషేధంపై స్టే నిరవధికంగా కొనసాగుతుందని న్యాయమూర్తి వాట్సన్‌ ప్రకటించారు. ప్రభుత్వం దాఖలు చేసిన లా సూట్‌ పరిష్కారమయ్యే వరకూ ఇది కొనసాగుతుంది.  



6న జీ జిన్‌పింగ్‌తో ట్రంప్‌ భేటీ

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఏప్రిల్‌ 6,7 తేదీల్లో జిన్‌పింగ్‌ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఫ్లోరిడాలో ట్రంప్‌ నివాసమైన మార్‌–ఎ–లాగోలో వారు కలుస్తారు.



సలహాదారుగా ట్రంప్‌ కూతురు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పెద్ద కూతురు ఇవాంకా తన జీవి తంలో కొత్త పాత్ర పోషిస్తున్నారు. జీతం తీసుకోకుండా తండ్రికి ఇవాంకా సలహాదారుగా పని చేస్తున్నట్లు వైట్‌హౌస్‌ తెలిపింది.  ఆమె భర్త జేర్డ్‌ కుష్నర్‌ జీతం తీసుకోకుండా ట్రంప్‌కు సీనియర్‌ సలహాదారుడిగా పనిచేస్తున్నారు. జనవరిలో జపాన్‌ ప్రధాని షింజో అబేతో ట్రంప్‌ సమావేశమైన సందర్భంలో, ఫిబ్రవరిలో ట్రంప్‌తో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో, జర్మన్‌ నాయకులతో జరిగిన భేటీలోనూ ఇవాంకా పాలుపంచుకున్నారని తెలిపింది. దీనిపై ఇవాంకా స్పందిస్తూ ‘నేను స్వచ్ఛందంగా జీతం తీసుకోకుండా పని చేస్తున్నాను. అన్ని నియమాలకు లోబడి ఒక సాధారణ  ఉద్యోగిలా  విధులు నిర్వహిస్తున్నాను’ అని చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top