ఈ భారీ అడ్డు 'గోడ'ను శ్రీకాంత్‌ దాటుతాడా? | Sakshi
Sakshi News home page

ఈ భారీ అడ్డు 'గోడ'ను శ్రీకాంత్‌ దాటుతాడా?

Published Wed, Aug 17 2016 2:20 PM

ఈ భారీ అడ్డు 'గోడ'ను శ్రీకాంత్‌ దాటుతాడా?

కిదంబి శ్రీకాంత్‌ ముందు ఇప్పుడో ఓ భారీ సవాల్‌ ఉంది. రియో ఒలింపిక్స్‌లో సెమీస్‌లోకి ప్రవేశించాలంటే అతను.. చైనా ప్రత్యర్థి లిన్ డాన్‌ను ఓడించాలి. రెండుసార్లు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్‌ సాధించి.. డిపెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న లిన్ డాన్‌ ఓడించడమంటే మాటలు కాదు.

శ్రీకాంత్‌ ఇప్పటివరకు మూడుసార్లు లిన్‌ డాన్‌తో తలపడ్డాడు. రెండుసార్లు ఓడిపోయాడు. కానీ, ఒక్కసారి గెలిచాడు. అది మామూలుగా కాదు లిన్‌ డాన్‌ను అతని సొంత గడ్డపై.. 2014లో చైనా ఓపెన్‌ సీరిస్‌ ఫైనల్‌లో చిత్తు చేశాడు.

చైనా బ్యాడ్మింటన్‌ స్టాన్‌ లిన్‌ డాన్ అంటే ప్రత్యర్థులు హడలిపోతారు. ఒలింపిక్స్‌లో అతను ఎప్పుడూ ఓడిపోలేదు. సొంత గడ్డపై కూడా పరాజయం రుచి ఎలా ఉంటుందో అతనికి తెలియదని చెప్తారు. కానీ, సొంత గడ్డపైనే లిన్‌ డాన్‌కు ఓటమిని రుచి చూపించాడు శ్రీకాంత్‌.

పక్కా ఫామ్‌తో ఒలింపిక్స్‌ బరిలోకి దిగాడు డాన్. 32 ఏళ్ల వయస్సున్న ఈ ఆటగాడికి ఇది చివరి ఒలింపిక్స్‌ అయ్యే అవకాశముంది. కాబట్టి రియోలో అతన్ని ఓడించడం అంటే మాటలు కాదు.

కానీ, 23 ఏళ్ల మన శ్రీకాంత్‌ అతన్ని చూసి బెదిరిపోవడం లేదు. సొంతగడ్డపై అతన్ని ఓడించలేమన్న అభిప్రాయాన్ని తుత్తునియలు చేసిన శ్రీకాంత్ ఇప్పుడు ఒలింపిక్‌ వేదికపైనా అతనికి పరాజయాన్ని రుచి చూపించాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. ఇందుకోసం నెట్‌లో చెమటలు కక్కేలా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో క్వార్టర్‌ ఫైనల్‌ పోరుకు సిద్ధమవుతున్నానని చెప్పిన శ్రీకాంత్‌.. అతన్ని ఓడించడం అంత సులువు కాదు.. ఇందుకు చివరివరకు పోరాడాల్సి ఉంటుందనే విషయాన్ని పదేపదే మననం చేసుకుంటున్నానని తెలిపాడు.

'నేను అతన్ని ఓడించగలనన్న ధీమా నాకుంది. నేను అతి ఆత్మవిశ్వాసంతో ఏమీ లేను కానీ, నాకూ అవకాశాలు ఉన్నాయి' అని శ్రీకాంత్‌ మీడియాతో చెప్పాడు. 'ఈ టోర్నమెంటులో ఇప్పటివరకు బాగా ఆడటం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అంతేకాకుండా అతని కోసం మేం ఓ వ్యూహాన్ని సిద్ధం చేశాం' అని శ్రీకాంత్‌ తెలిపాడు.

Advertisement
Advertisement