రెండో గమన సూత్రాన్ని న్యూటన్ కనుక్కోలేదు! | Sakshi
Sakshi News home page

రెండో గమన సూత్రాన్ని న్యూటన్ కనుక్కోలేదు!

Published Mon, Nov 11 2013 2:17 AM

రెండో గమన సూత్రాన్ని న్యూటన్ కనుక్కోలేదు!

షిమ్లా: ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించిన గమన సూత్రాలలో లోపాలున్నాయని భారతీయ పరిశోధకుడు అజయ్ శర్మ వెల్లడించారు. ద్రవ్యరాశి, వేగానికి సంబంధించిన న్యూటన్ రెండో గమనసూత్రం(ఎఫ్‌ఎంఏ)ను వాస్తవానికి ఆయన కనుక్కోనే లేదని శర్మ స్పష్టం చేశారు. న్యూటన్ 1686లో రచించిన ‘ప్రిన్సిపా’ పుస్తకాన్ని నిశితంగా అధ్యయనం చేయగా ఎఫ్‌ఎంఏను కనుగొన్నవారు ఎవరో తెలియదన్న విషయం స్పష్టమైందని శర్మ ఈ మేరకు తాను రాసిన ‘బియాండ్ న్యూటన్ అండ్ ఆర్కిమెడిస్’ గ్రంథంలో పేర్కొన్నారు.

ఎఫ్‌ఎంఏ సూత్రాన్ని ఇచ్చినవారెవరో ఇప్పటిదాకా తెలియదని, భవిష్యత్తు తరాలకు వాస్తవం చెప్పాల్సిన అవసరం ఉన్నందున ఆ మేరకు ప్రపంచంలోని 220 దేశాల పాఠ్యపుస్తకాలన్నింటిలోనూ మార్పులు చేయాలన్నారు. న్యూటన్ రెండో గమనసూత్రంలో లోపాలున్నాయంటూ ఆయన తన పుస్తకంలో ఉదహరణనిచ్చారు.

ఒక కుర్రాడు రబ్బరు బంతిని, గుడ్డ బంతిని 2ఎన్(న్యూటన్)ల బలంతో గోడకు కొట్టినప్పుడు రబ్బరు బంతి 10 మీటర్లు వెనక్కి వస్తే, గుడ్డ బంతి 5 మీటర్లు మాత్రమే వెనక్కి వస్తుందని పేర్కొన్నారు. అందువల్ల చర్యకు ప్రతిచర్య ఉన్నా, అన్నిసార్లూ అవి రెండూ సమానమే కావల్సిన అవసరంలేదని వివరించారు.

హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖలో అసిస్టెంట్ డెరైక్టర్ అయిన అజయ్ శర్మ(50) 31 ఏళ్లుగా ప్రాథమిక సూత్రాలపై పరిశోధనలు సాగిస్తున్నారు. శర్మ రాసిన ‘బియాండ్ న్యూటన్ అండ్ ఆర్కిమెడిస్’ పుస్తకాన్ని నిపుణులు ఏడు నెలలపాటు పరిశీలించి నిపుణులు పచ్చజెండా ఊపాకే ‘కేంబ్రిడ్జి ఇంటర్‌నేషనల్ సైన్స్ పబ్లిషింగ్’ సంస్థ దానిని అక్టోబరు 28న ప్రచురించింది.
 

Advertisement
Advertisement