
వ్యవసాయ ఎగుమతుల్లో వృద్ధి
గడిచిన పదేళ్లుగా దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఏటా సగటున 20 శాతం చొప్పున వృద్ధి చెందుతూ 36 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడిచిన పదేళ్లుగా దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఏటా సగటున 20 శాతం చొప్పున వృద్ధి చెందుతూ 36 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దేశం నుంచి జరుగుతున్న మొత్తం ఎగుమతుల్లో ఇది 12 శాతానికి సమానమని, కాని ఈ రంగంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ఐటీసీ వ్యవసాయ వ్యాపార విభాగం అధిపతి ఎస్.శివకుమార్ సోమవారం తెలిపారు. సరైన మౌలికవసతులు లేకపోవడంతో దేశీయంగా రూ.50,000 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు ఏటా వృధా అవుతున్నాయన్నారు. ఫుడ్ ప్రోసెసింగ్‌తో ఈ నష్టాన్ని అరికట్టవచ్చన్నారు.
హైదరాబాద్‌లో ‘ఫుడ్ 360’ పేరిట నవంబర్‌లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సు వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశీయ వ్యవసాయ రంగం పెట్టుబడుల విలువ రూ.1.50 లక్షల కోట్లకు చేరిందన్నారు. వ్యవసాయరంగంలో దిగుమతుల కంటే ఎగుమతులే ఎక్కువ జరుగుతున్నాయని, వీటిని ప్రోసెస్ చేస్తే మరిన్ని ఎగుమతికి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు.
గతంలో రెండుసార్లు నిర్వహించిన ఫుడ్ 360 విజయవంతమయ్యిందని, ఈ సంవత్సరం నవంబర్ 6-7 తేదీల్లో జరిగే ఈ రెండురోజుల సదస్సును లక్షమంది సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు ఫిక్కీ ఏపీ చాప్టర్ కోచైర్మన్ జేఏ చౌదరి తెలిపారు. గత సంవత్సరం 2,600 మంది ప్రతినిధులు పాల్గొన్నారని, ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.