'గాసిప్స్ నమ్మి కలవరపడకండి' | Sakshi
Sakshi News home page

'గాసిప్స్ నమ్మి కలవరపడకండి'

Published Thu, Feb 9 2017 7:45 PM

'గాసిప్స్ నమ్మి కలవరపడకండి'

బెంగళూరు : టాటా గ్రూప్లో నెలకొన్న యుద్ధం మాదిరి, ఇన్ఫోసిస్లోనూ కలకలం మొదలైందని, కంపెనీ సీఈవో విశాల్ సిక్కా వేతనాన్ని భారీగా పెంచడంపై వ్యవస్థాపకులు కన్నెర్రజేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇలాంటి ఊహాగానాలను నమ్మొద్దని విశాల్ సిక్కా తన ఉద్యోగులకు తెలిపారు. ఊహాగానాలు నమ్మి పాలనలో, విలువల్లో కంపెనీకి ఉన్న అంకితభావంపై ఎలాంటి కలవరం చెందవద్దని సూచించారు. కోర్ ఇన్ఫోసిస్ విలువలను ఉల్లంఘిస్తూ కంపెనీ పాలన నడుస్తుందని వ్యవస్థాపకులు అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. తాము క్యూ4లో నిమగ్నమై ఉన్నామని, తమ వ్యూహాలను అమలుచేయడంలో దృష్టిసారించాలని, కంపెనీని గ్రేట్గా రూపొందించేందుకే కృతనిశ్చయంతో పనిచేయాలని సిక్కా ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
 
''మనం పని చేస్తున్నాం.. మనం కలిసే పని చేయాలి'' అని ఉద్యోగులకు తెలిపారు. తాజాగా ఇన్ఫోసిస్లో వివాదాలు ముదురుతున్నాయంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. సిక్కాతో పాటు కంపెనీని వీడిన ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్లకు భారీగా ప్యాకేజీ ఇవ్వడంపైనా ప్రమోటర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారని సమాచారం.  ఈ అంశాలపై కంపెనీ కీలక వ్యవస్థాపకులు ఎన్‌.ఆర్‌.నారాయణ మూర్తి, క్రిస్‌ గోపాలకృష్ణన్, నందన్‌ నీలేఖని గత నెలలో ఇన్ఫోసిస్‌ డైరెక్టర్ల బోర్డుకు లేఖ రాసినట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. 

Advertisement
Advertisement