దావూద్ గ్యాంగ్‌కు ఎదురుదెబ్బ | Dawood Gang contract killing bid foiled as police nab shooters | Sakshi
Sakshi News home page

దావూద్ గ్యాంగ్‌కు ఎదురుదెబ్బ

Feb 25 2017 6:37 PM | Updated on Sep 5 2017 4:35 AM

దావూద్ గ్యాంగ్‌కు ఎదురుదెబ్బ

దావూద్ గ్యాంగ్‌కు ఎదురుదెబ్బ

అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఓ వ్యాపారవేత్తను హతమార్చేందుకు వచ్చిన దావూద్ మనుషులు పోలీసులకు దొరికిపోయారు.

అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఓ వ్యాపారవేత్తను హతమార్చేందుకు వచ్చిన దావూద్ మనుషులు పోలీసులకు దొరికిపోయారు. ఒక షార్ప్ షూటర్, మరో ముగ్గురిని పోలీసులు రాజ్‌కోట్ నగర శివార్లలో అరెస్టు చేశారు. దావూద్ సోదరుడు అనీస్ సూచనల మేరకు వాళ్లు ఇక్కడికొచ్చినట్లు పోలీసులు తెలిపారు. దావూద్ ఇబ్రహీం తరఫు వ్యవహారాలన్నింటినీ దగ్గరుండి చూసుకునే అనీస్ ఇబ్రహీం.. జామ్‌నగర్‌ వ్యాపారవేత్తను చంపేందుకు రామ్‌దాస్ రహానే, మరో ముగ్గురికి రూ. 10 లక్షలు ఇచ్చినట్లు చెప్పారు. వాళ్లు ముగ్గురూ ఓ ప్రైవేటు బస్సులో వస్తున్నారని, కన్‌స్ట్రక్షన్ కంపెనీ నడిపే వ్యాపారి అష్ఫఖ్ ఖత్రీ వాళ్ల టార్గెట్ అని రాజ్‌కోట్ డీసీసీ ఎస్ఆర్ ఒడెదరా చెప్పారు. ఆయన నేతృత్వంలోని పోలీసు బృందం షూటర్లను పట్టుకుంది. 
 
ఖత్రీని వాళ్లు టార్గెట్ చేసిన విషయం తెలిసి రాజ్‌కోట్ - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఉన్న కువదవా పట్టణంపై తాము గట్టిగా దృష్టిపెట్టామని, మహారాష్ట్ర నుంచి నలుగురు వ్యక్తులు ఒక ప్రైవేటు బస్సులో అనుమానాస్పదంగా వస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఒడెదరా తెలిపారు. బస్సులో నలుగురు అలాగే కనిపించారని, వాళ్ల లగేజి చెక్ చేస్తే అందులో ఒక పిస్టల్, ఆరు లైవ్ కార్ట్రిడ్జులు, రెండు కత్తులు, గుజరాత్, మహారాష్ట్ర పేర్లతో ఉన్న నకిలీ నంబర్‌ ప్లేట్లు దొరికాయని వివరించారు. రామదాస్ అనే వ్యక్తి దావూద్ గ్యాంగు తరఫున కాంట్రాక్టు కిల్లర్‌గా వ్యవహరిస్తాడని, అతడిపై మహారాష్ట్రలో పలు ఆరోపణలున్నాయని చెప్పారు. దావూద్ గ్యాంగు వీళ్లకు పది లక్షలకు సుపారీ ఇచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ముందుగా ఏదో ఒక వాహనం దొంగిలించి, దానికి నకిలీ నంబర్ ప్లేటు పెట్టి ఇక్కడ పని పూర్తయ్యాక అందులోనే మహారాష్ట్ర వెళ్లిపోవాలనుకున్నారని, అందుకే ఆ ప్లేట్లు తెచ్చారని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement