ఆఖరికీ అక్కడ కూడా నోట్ల కష్టాలే! | currency problems at notes printing press | Sakshi
Sakshi News home page

ఆఖరికీ అక్కడ కూడా నోట్ల కష్టాలే!

Nov 28 2016 3:36 PM | Updated on Sep 22 2018 7:51 PM

ఆఖరికీ అక్కడ కూడా నోట్ల కష్టాలే! - Sakshi

ఆఖరికీ అక్కడ కూడా నోట్ల కష్టాలే!

పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజలు పెను ఇబ్బందులు పడుతున్న విషయం తెల్సిందే.

  • నోట్ల ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉన్నా.. ప్రజలకు తప్పని కష్టాలు!
  • న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజలు పెను ఇబ్బందులు పడుతున్న విషయం తెల్సిందే. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రజలకు కూడా వారితోపాటు సమానంగా ఇబ్బందులు పడటాన్ని మాత్రం కాస్త ప్రత్యేకంగా చూడాలి. ముంగిట్లోనే ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని కూడా వారు కొత్త నోట్లను అందుకోలేక పోతున్నారు.

    పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని సల్బోనిలో 1995లో ఏర్పాటు చేసిన ఆర్బీఐ కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ ఆ నాటి నుంచి నిర్విరామంగా ఐదు వందల నోట్లను ముద్రిస్తూ వస్తోంది. గత సెప్టెంబర్ నెలలో హఠాత్తుగా ఈ ప్రింటింగ్ ప్రెస్‌ను ప్రధాని కార్యాలయం నుంచి నోట్ల ప్రింటింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు వచ్చాయి. ఆ తర్వాత రెండువేల రూపాయల నోట్లను ముద్రించాలంటూ ప్రెస్‌కు ఆదేశాలతోపాటు డిజైన్ తాలూకు బ్లాకులు కూడా వచ్చాయి. డిజైన్ మారినప్పుడల్లా కొత్త డిజైన్‌ను సెట్‌చేసుకొని ప్రింటింగ్ ఊపందుకోవడానికి 22 రోజులు పడుతుందని ప్రెస్ అధికారులు తెలిపారు.

    సాధారణంగా రెండు షిప్టులు నడిచే ఈ ప్రెస్‌లో ప్రస్తుతం రాత్రి 11.30 నుంచి ఉదయం ఆరున్నర గంటల వరకు మూడు షిప్టులు నడుపుతున్నా డిమాండ్‌ను అందుకోలేక పోతున్నామని అధికారులు తెలిపారు. పైగా ప్రభుత్వం నుంచి రోజుకోరకమైన ఉత్తర్వులు వస్తుండడం వల్ల కూడా గందరగోళం ఏర్పడుతుందని వారన్నారు. ఈ ప్రెస్‌లో ముద్రిస్తున్న నోట్లు కూడా స్థానిక ఆర్బీఐ బ్రాంచి ద్వారా తమకు రాకుండా విమానాల్లో, రైళ్లలో ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతున్నాయని రాష్ట్ర ప్రజలు ఆరోపిస్తున్నారు. బంగాళ దుంపలు, వరి పంటలు కోతకొచ్చిన సందర్భంలో నోట్ల కష్టాలు రావడం పంట నష్టాలకు దారితీస్తోందని వారు ఆరోపిస్తున్నారు. సహకార బ్యాంకులు తమకు పంట రుణాల కింద 80 వేల రూపాయలను మంజూరు చేసినప్పటికీ వారానికి 20వేల రూపాయలు ఇస్తామంటే ఎలా అని, అప్పటి వరకు పంటలు నష్టపోతామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    సల్బోని ప్రింటింగ్ ప్రెస్‌కు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే వైమానిక స్థావరానికి సంబంధించిన రన్‌వే ఉండడం, కోల్‌కతా నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు రైలు లింకులు ఉండడంతో ఆ రాష్ట్రాలకే నోట్ల కట్టలు తరలిపోతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ప్రింటింగ్ ప్రెస్ అధికారులను ప్రశ్నించగా, ప్రభుత్వ ఆదేశాలను పాటించడం తప్ప ప్రశ్నించడం తాము చేయకూడదని, ఎలాంటి వివరాలను కూడా బయటకు వెల్లడించకూడదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement