మావోయిస్టుల భారీ ఎటాక్: 12 మంది జవాన్ల మృతి!

మావోయిస్టుల భారీ ఎటాక్: 12 మంది జవాన్ల మృతి!


ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మళ్లీ విరుచుకుపడ్డారు. సుకుమా జిల్లా బెజ్జి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దాంతో సీఆర్పీఎఫ్ 219 బెటాలియన్‌కు చెందిన 12 మంది జవాన్లు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సంఘటన స్థలంలోనే 11 మంది మరణించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో జవాను ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఐఈడీ అమర్చి, దాన్ని పేల్చడంతో పాటు ఆ షాక్‌లో ఉన్న జవాన్లను చుట్టుముట్టి కాల్పులు జరపడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ మరిన్ని ఐఈడీలను అమర్చారని అంటున్నారు. ఇటీవలి కాలంలో వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు.. ఒక్కసారిగా విరుచుకుపడి జవాన్లను హతమార్చారు. కూంబింగ్ చేస్తున్న సీఆర్పీఎఫ్‌ బలగాల మీదకు కాల్పులు జరిపారు. దాంతో 12 మంది మరణించారు. ఈ కాల్పుల్లో కొందరు మావోయిస్టులు కూడా మరణించినట్లు అనుమానిస్తున్నారు.



ఇంతకుముందు ఫిబ్రవరి మొదటివారంలో ఛత్తీస్‌గఢ్‌లోనే నారాయణపూర్ జిల్లాలోని అకాబీడా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మరణించారు. అది మావోయిస్టులకు పెద్ద దెబ్బగా అప్పట్లో భావించారు. నిజానికి అప్పటినుంచి ప్రతీకారం తీర్చుకోడానికి ఎదురుచూస్తున్న మావోయిస్టులు.. తాజాగా సుకుమా జిల్లాలో విరుచుకుపడ్డారు.


మృతుల వివరాలు

ఇన్‌స్పెక్టర్ జగ్జీత్ సింగ్, ఏఎస్ఐ హెచ్‌బీ భట్, ఏఎస్ఐ నరేందర్ కుమార్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ పీఆర్ మిండే, కానిస్టేబుల్ మంగేష్ పాల్ పాండే, కానిస్టేబుల్ రాంపాల్ సింగ్ యాదవ్, కానిస్టేబుల్ గోరక్‌నాథ్, కానిస్టేబుల్ నందకుమార్ పాత్రా, కానిస్టేబుల్ సతీష్ కుమార్ వర్మ, కానిస్టేబుల్ కె. శంకర్, కానిస్టేబుల్ సురేష్ కుమార్, హెడ్‌ కానిస్టేబుల్ జగదీష్ ప్రసాద్‌ విష్ణోయ్.



క్షతగాత్రులు వీరే

కానిస్టేబుల్ జైదేవ్ ప్రామాణిక్, కానిస్టేబుల్ సలీం

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top