
భారత్, చైనా మాటల యుద్ధం
ఆధ్యాత్మిక గురువు దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై భారత్, చైనాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దలైలామా పర్యటనను వెంటనే నిలిపివేయాలని భారత్‌కు చైనా అల్టిమేటం జారీ చేసింది.
► దలైలామా పర్యటనను నిలిపేయకుంటే
► చర్యలు తీసుకుంటామన్న చైనా
► అది ఆధ్యాత్మిక పర్యటన.. ఆపేది లేదన్న భారత్
బీజింగ్/న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై భారత్, చైనాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దలైలామా పర్యటనను వెంటనే నిలిపివేయాలని భారత్‌కు చైనా అల్టిమేటం జారీ చేసింది. లేకుంటే ద్వైపాక్షిక సంబం ధాలు దెబ్బతింటాయని, తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే దలైలామాది ఆధ్యాత్మిక పర్యటన అని.. ఈ విషయంలో రాద్ధాంతం చేయడం తగదని భారత్ చైనాకు హితవు పలికింది.
మరోవైపు ఈ వివాదానికి కేంద్రమైన దలైలామా మాట్లాడుతూ చైనాకు వ్యతిరేకంగా భారత్ తనను ఎప్పుడూ ఉపయోగించుకోలేదని స్పష్టం చేశారు. ఆయన మంగళవారం నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై బీజింగ్‌లోని భారత రాయబారి విజయ్ గోఖలేకు చైనా తమ నిరసనను తెలియజేసింది.
చైనా, భారత్ సంబంధాలకు విఘాతం
చైనా తన ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని, చట్టబద్ధమైన హక్కులను, ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలను దృఢంగా తీసుకుంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ అన్నారు. ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ.. ‘చైనా ఆందోళనను పట్టించుకోకుండా చైనా–భారతదేశపు తూర్పు సరిహద్దులోని వివాదాస్పద భాగంలో పర్యటించేందుకు దలైలామాకు భారత్ మొండిగా అనుమతిచ్చింది.
ఇది చైనా ప్రయోజనాలను, చైనా–భారత్ సంబం ధాలను దెబ్బ తీస్తుంది’ అని పేర్కొన్నారు. భారత్ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే స్పందిస్తూ.. ‘దలైలామా ఆధ్యాత్మిక గురువు. ఆయన అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్‌లో ఆరుసార్లు పర్యటిం చారు. ఆయన పర్యటనకు రాజకీయ రంగు పులమొద్దని.. కృత్రిమ వివాదం సృష్టించొ ద్దని చైనాకు మేము చెప్పాం’ అని అన్నారు.
చైనాకు వ్యతిరేకంగా వాడుకోలేదు
చైనాకు వ్యతిరేకంగా భారత్ తనను ఎప్పుడూ ఉపయోగించుకోలేదని దలైలామా స్పష్టం చేశారు. అరుణాచల్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ప్రాచీన భారత తత్వ ప్రచారకుడిని. ఎక్కడికి వెళ్లినా అహింస, శాంతి, సామరస్యం, లౌకిక విలువల గురించి మాట్లాడతాను. చైనాలో దాదాపు 400 మిలియన్ల బౌద్ధులు ఉన్నారు. వారికి ఇప్పటికీ స్వాతంత్య్రం రాలేదు. కానీ మేము చైనాలోనే ఉండాలని అనుకుంటు న్నాం. టిబెట్ భౌతికంగా వెనుకబడి ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా చాలా మెరుగ్గా ఉంది. చైనాలో ఉంటూనే భౌతికంగా అభివృద్ధి చెందేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని దలైలామా పేర్కొన్నారు.