
ఏపీలో మరో బస్సు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్‌లో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 75 మంది స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు 40 అడుగుల బ్రిడ్జిపైనుంచి బోల్తాపడింది.
- 75 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా
- ప్రకాశం జిల్లా పెదఅలవలపాడు వద్ద ఘటన
ఒంగోలు: కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు బస్సు ప్రమాద ఘటనలో నెత్తుటిచారలు ఆరకముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 75 మంది స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సు 40 అడుగుల బ్రిడ్జిపైనుంచి బోల్తాపడింది. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెదాలవలపాడు వద్ద గురువారం తెల్లవారుజాము 3:15 గంటలకు ఈ సంఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కరేడు జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు ఈ నెల 28న విహారయాత్రకు వెళ్లి.. తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థులను 108 సిబ్బంది, స్థానికల సహాయంతో కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైఎస్‌ఆర్‌సీపీ నేత బుద్రా మధుసూదన్ యాదవ్ గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. మిగిలిన విద్యార్థులను ప్రత్యేక బస్సులో ఆయన కరేడుకు పంపించారు. ఎస్‌వీఎల్‌టీ ట్రావెల్స్‌కు చెందిన ఈ టూరిస్టు బస్సును.. మలుపు వద్ద డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
మరో ఘటనలో ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. గోపవరం మండలం శ్రీనివాసపురం వద్ద ఆర్టీసీ బస్సు గోడను ఢీ కొట్టింది. అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.
(చదవండి: బస్సు ప్రమాదం ఘటనలో ప్రభుత్వ బాధ్యతను మరచిన అధికారులు)