అమరావతి అతిపెద్ద కుంభకోణం

అమరావతి అతిపెద్ద కుంభకోణం - Sakshi


మచిలీపట్నం : అమరావతి నిర్మాణం దేశంలోని అతి పెద్ద కుంభకోణానికి నాంది అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం భూసమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ భూ దోపిడీని నిరసిస్తూ భూపరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో శనివారం జరిగిన అవగాహన సదస్సులో వడ్డే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతానికి భిన్నంగా పరిపాలన కొనసాగిస్తున్నారని, స్విస్ చాలెంజ్‌పై పరిశీలన జరిగితే సరైన విధానం కాదని కోర్టులో తీర్పు వస్తుందని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు పొరపాటు చేశామని అనుకుంటున్నట్లు తెలిపారు.



గతంలో పోర్టుల నిర్మాణానికి 1200 ఎకరాల భూమి చాలని ఆందోళన చేసిన టీడీపీ నాయకులు నేడు 4,800 ఎకరాలు పోర్టుకు, పారిశ్రామిక కారిడార్ కోసం 28,801 ఎకరాలను ఎలా సమీకరిస్తున్నారని వడ్డే దుయ్యబట్టారు.గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ సంస్థ రూ.1.80 లక్షల కోట్ల వ్యయంతో ఆయిల్ రిఫైనరీని 7,500 ఎకరాల్లో నిర్మించిందని చెప్పారు. మూడు బెర్త్‌లు నిర్మించే బందరు పోర్టుకు 4,800 ఎకరాలు, పారిశ్రామిక కారిడార్ కోసం 33,601 ఎకరాలను ఎలా సమీకరిస్తున్నారని ప్రశ్నించారు. రైతులు భూసమీకరణకు వ్యతిరేకంగా ఫారం-2 ఇచ్చి, అధికారుల నుంచి రశీదు పత్రం పొందాలని సూచించారు.



8వేల ఎకరాలను కాపాడుకున్నాం : ఎమ్మెల్యే ఆర్కే

ఇదే సదస్సులో మాట్లాడిన మంగళిగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే).. రాజధాని అమరావతిలో భూసమీకరణకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసి 8వేల ఎకరాలను కాపాడుకున్నామని చెప్పారు. ప్రభుత్వం రాజధాని కోసం 33వేల ఎకరాలను సేకరించినట్లు చెబుతున్నా అందులో వాస్తవం లేదని, భూములు ఇచ్చిన రైతులకు వైద్యం, పిల్లలకు ఉచిత విద్య అనంతరం ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పినా ఎక్కడా అవి అమలు జరగడం లేదని తెలిపారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆయన.. ఈ నెల 4వ తేదీలోగా అభ్యంతర పత్రాలను ప్రతి ఒక్క రైతు అందజేయాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా లేనప్పుడు మచిలీపట్నంలో పరిశ్రమలు ఎలా స్థాపిస్తారని ప్రశ్నించారు.



ఫారం-2 ఇవ్వండి :సుధాకరరెడ్డి

హైకోర్టు న్యాయవాది సుధాకరరెడ్డి మాట్లాడుతూ రైతుల అంగీకారం తెలపకుండా ప్రభుత్వం సెంటుభూమిని కూడా భూసమీకరణ ద్వారా తీసుకోలేదని స్పష్టంచేశారు. ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకోవాలని చూస్తుంటే, హైకోర్టు రైతుల హక్కులను కాపాడేందుకు వెన్నుదన్నుగా ఉందన్నారు. రాజధాని భూసమీకరణలో ఈ అంశం రుజువైందన్నారు. భూసమీకరణను వ్యతిరేకిస్తూ రైతులంతా ఫారం-2ను ఎంఏడీఏ అధికారులకు అందజేస్తే 15 రోజుల తరువాత భూసమీకరణ నుంచి బయటపడొచ్చన్నారు.



ప్రలోభాలకు లొంగొద్దు:  పేర్నినాని

వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ భూసేకరణ నోటిఫికేషన్ అమలులో ఉండగానే మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) పేరుతో ప్రభుత్వం భూసమీకరణకు దిగిందన్నారు. భూసమీకరణకు అభ్యంతరాలు, అంగీకరపత్రాలు ఇచ్చేందుకు అక్టోబర్ 4ను ఆఖరు తేదీగా ప్రకటించి మళ్లీ ఈ గడువును నవంబరు 4వ తేదీకి అధికారులు పెంచారని తెలిపారు. అయినప్పటికీ అక్టోబర్4వ తేదీకే రైతులంతా అభ్యంతర పత్రాలు ఇవ్వాలన్నారు. భూపరిరక్షణ పోరాట సమితి కన్వీనరు కొడాలి శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహన్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘు, సీపీఐ కార్యదర్శి అక్కినేని వనజ, ప్రజాసంఘాలు, రైతు సంఘాల నాయకులు ప్రసంగిస్తూ రైతులతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top