పారిస్‌లో షూటౌట్ | At least two die in police raid on group planning new Paris attack | Sakshi
Sakshi News home page

పారిస్‌లో షూటౌట్

Nov 19 2015 2:56 AM | Updated on Aug 21 2018 6:12 PM

పారిస్‌లో షూటౌట్ - Sakshi

పారిస్‌లో షూటౌట్

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉగ్రవాద దాడికి సంబంధించి పోలీసులు బుధవారం కీలక ఆపరేషన్ నిర్వహించారు.

ఉగ్రదాడుల సూత్రధారి కోసం పారిస్ అపార్ట్‌మెంట్‌పై పోలీసుల దాడి

ఒక మహిళా మానవబాంబు ఆత్మాహుతి.. కాల్పుల్లో ఉగ్రవాది మృతి

ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన భద్రతా బలగాలు

పారిస్ దాడుల సూత్రధారి బెల్జియంకు చెందిన అబౌద్‌గా గుర్తింపు

ఉగ్రదాడి అనంతరం టెలిఫోన్ నిఘాతో సూత్రధారి ఆచూకీ లభ్యం

ఏడు గంటల పాటు సాగిన పోరు... ఐదుగురు పోలీసులకు గాయాలు

అబౌద్ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామన్న ఫ్రాన్స్ రాయబారి
 
 సెయింట్ డెనిస్(ఫ్రాన్స్): ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉగ్రవాద దాడికి సంబంధించి పోలీసులు బుధవారం కీలక ఆపరేషన్ నిర్వహించారు. శుక్రవారం నాటి దాడుల సూత్రధారి, ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) తీవ్రవాది అబ్దెల్‌హమీద్ అబౌద్ పారిస్ శివార్లలో ఒక అపార్ట్‌మెంట్‌లో దాక్కుని ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు బుధవారం వేకుజామున ఆ అపార్ట్‌మెంట్‌పై దాడి చేశారు. లోపలున్ను ఉగ్రవాదులు తుపాకీ కాల్పులతో ఎదురు దాడికి దిగటంతో ఏడు గంటలు ఆపరేషన్ కొనసాగింది. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఒక మహిళ ఆత్మాహుతి బాంబుతో తనను తాను పేల్చివేసుకోగా.. మరొక ఉగ్రవాది పోలీసు కాల్పుల్లో చనిపోయాడు.
 
 అపార్ట్‌మెంట్‌లోని ఐదుగురు ఉగ్రవాదులతో పాటు సమీప ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను (ఒక మహిళ, ఒక పురుషుడు).. మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పారిస్ శివార్లలోని సెయింట్ డెనిస్ ప్రాంతంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఐదుగురు పోలీసులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. అదుపులోకి తీసుకున్న వారిని ఇంకా గుర్తించాల్సి ఉందని పారిస్ అధికారులు తెలిపారు.  పారిస్ దాడుల అనంతరం దర్యాప్తులో భాగంగా టెలిఫోన్ నిఘా, ప్రత్యక్ష సాక్షుల కథనాల ద్వారా.. సూత్రధారి అబౌద్ అని, అతడు సెయింట్ డెనిస్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉన్నాడని తెలిసిందని పారిస్ ప్రాసిక్యూటర్ ఫ్రాంకోయ్ మొలిన్ తెలిపారు. ఈ అపార్ట్‌మెంట్ పారిస్ నగరంలో ఉత్తర దిక్కుగా.. స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంకు 2 కి.మీ. దూరంలో ఉంది.
 
 ఈ స్టేడియం వద్ద శుక్రవారం రాత్రి ముగ్గురు మానవబాంబులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డం తెలిసిందే. ఫ్రాన్స్‌లో ఎంతో చరిత్ర గల ప్రాంతాల్లో సెయింట్ డెనిస్ ఒకటి.  ప్రస్తుతం ఇది విభిన్న జాతుల ప్రజలకు ఆవాసం. ఇక్కడ గల ఉగ్రవాదుల అపార్ట్‌మెంట్ ముట్టడికి యాంటీ టైస్ట్ పోలీసు దళాలతో పాటు సైనికులనూ రంగంలోకి దించారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు అపార్ట్‌మెంట్ దగ్గర్లో పేలుడు శబ్దం వినిపించిందని.. భయభ్రాంతులకు గురయ్యామని స్థానికులు తెలిపారు. దాని వెంట వరుసగా బాంబు పేలుళ్ల శబ్దాలు వినవచ్చాయని, ఆ తర్వాత చాలాసేపు తుపాకీ కాల్పులు కొనసాగాయన్నారు.. పోలీసులు అపార్ట్‌మెంట్ పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు.
 
 ఇళ్లలోని వారు ఎవరూ బయటకు రావద్దని నిషేధాజ్ఞలు విధించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు  హోలాండ్ తన మంత్రులతో అత్యవసరంగా భేటీ అయి పోలీస్ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. ఆపరేషన్ తర్వాత అపార్ట్‌మెంట్‌లో ఇంకా మరొక వ్యక్తి ఉన్నాడని.. అతడెవరో తెలియదని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో అబౌద్ లేడని, పేర్కొన్నారు. మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. అయితే.. ఈ దాడి సందర్భంగా అబౌద్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తనకు సమాచారం అందిందని భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయ్ రిచీ చెప్పారు.  అతడు చనిపోయాడా లేదా అన్న విషయంపై తుది నిర్ధారణ కోసం వేచిచూస్తున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement