ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్‌కౌంటర్ వల్ల కశ్మీర్‌లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రలో చిక్కుకున్న ఏపీ యాత్రికులను క్షేమంగా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఢిల్లీలోని ఏపీ భవన్ వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ: ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్‌కౌంటర్ వల్ల కశ్మీర్‌లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రలో చిక్కుకున్న ఏపీ యాత్రికులను క్షేమంగా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఢిల్లీలోని ఏపీ భవన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి యాత్రికుల తరలింపునకు చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ శ్రీకాంత్ అర్జా తెలిపారు.
అనతంపురానికి చెందిన 15 మందితో కూడిన యాత్రికుల బృందం బుధవారం క్షేమంగా ఏపీ భవన్‌కు చేరుకుంది. ఈ నెల 9వ తేదీన వీరు యాత్ర పూర్తి చేసుకొని పహల్గామ చేరుకున్నారు. ఈ తరుణంలో అల్లర్లు చెలరేగడంతో వీరంతా అక్కడే చిక్కుకున్నారు. రెండురోజుపాటు స్థాకంగా హోటళ్లలో బస చేయాల్సివచ్చింది. అల్లర్ల నేపథ్యంలో దుకాణాలు అన్ని మూతపడడంతో భోజన వసతికి త్రీవ ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి, డీజీపీ రాముడు వీరిని ఫోనులో సంప్రదించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భద్రతా దళాలు వీరందరికీ రక్షణ కల్పించి పహల్గాం నుంచి సురక్షితంగా జమ్మూ చేర్చారు. అక్కడి నుంచి రైలులో ఢిల్లీ చేరుకున్నారు. ఏపీ భవన్‌లో వీరందరికీ వసతి, భోజనం ఏర్పాటు చేశారు.