స్థాయి మరచి ధిక్కారమా?: దామోదర్ రాజనర్సింహ | Sakshi
Sakshi News home page

స్థాయి మరచి ధిక్కారమా?: దామోదర్ రాజనర్సింహ

Published Thu, Feb 6 2014 2:47 AM

స్థాయి మరచి ధిక్కారమా?: దామోదర్ రాజనర్సింహ - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తన స్థాయి, మూలాలు మరచి సీఎం కిరణ్ కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా ధిక్కారం వినిపిస్తున్నారని డిప్యూటీ సీఎం దామోదర్ రాజ నర్సింహ మండిపడ్డారు. ఇందుకు సీఎంపై సరైన చర్యలుంటాయని విశ్వసిస్తున్నామన్నారు. ఢిల్లీలో బుధ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక ప్రాం తానికి సీఎంగా వ్యవహరిస్తున్న కిరణ్‌కు నైతిక విలువలుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని సీఎంను అడగడానికి వెళ్లిన మంత్రులు గీతారెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డి, డీకే అరుణ సహా తెలంగాణ మంత్రులపై ఢిల్లీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం తమ ప్రాంత ప్రజలను, ప్రజాప్రతినిధులను అవమానించడమేనని ధ్వజమెత్తారు.
 
  సీఎం ఆదేశాల మేరకే ఆడపడుచులైన మంత్రుల పట్ల ఢిల్లీ పోలీసులు ఇలా ప్రవర్తించారన్నారు. చంద్రబాబు, కిరణ్, జగన్‌లా మోసం చేయకుండా తెలంగాణ బిల్లుకు సహకరించాలని బీజేపీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. కుట్రలు, కుతంత్రాలకు కిరణ్ పర్యాయపదం అన్నారు. తెలంగాణపై ఇచ్చినమాట నిలబెట్టుకున్న సోనియాకు రుణపడి ఉంటామన్నారు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని చేసిన తీర్మానం, సీడబ్ల్యూసీ నిర్ణయం వచ్చాక కొత్త రాజధానికి ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు అడిగిన విషయాన్నీ గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీలో బీజేపీని కలసి చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ విలీనం విషయాన్ని  హైకమాండ్ చూసుకుంటుందన్నారు.
 
 కన్నీళ్లు పెట్టుకున్న గీతారెడ్డి..
 పోలీసుల చర్యలను మీడియా సమావేశంలో వివరిస్తూ మంత్రి గీతారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. కిరణ్‌ను రాష్ట్రానికి  సీఎంగా సోనియా నియమిస్తే ఆయన సీమాంధ్ర కోసమే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. సీమాంధ్ర కోసమే సీఎం అయితే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తానన్న కిరణ్ ఇప్పుడు ధిక్కరిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎంపీలు అంజన్ కుమార్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, వీహెచ్, రాజయ్య, మంత్రి పొన్నాల, చీఫ్‌విప్ గండ్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement