
మోదీ రాష్ట్రంలో ఆయన బ్యాగుల కలకలం!
మాజీ సీఎం బొమ్మలతో కూడిన బ్యాగులు కలకలం రేపుతున్నాయి.
అహ్మదాబాద్: గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం సేవలందించిన నరేంద్రమోదీ ఆ తర్వాత దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన రాష్ట్రంలో అఖిలేశ్ యాదవ్ బొమ్మలతో కూడిన బ్యాగులు కలకలం రేపుతున్నాయి. అసలు సంగతి ఏమిటంటే.. గుజరాత్‌లోని ఛోటా ఉడేపూర్‌లో స్థానిక యంత్రాంగం ఇటీవల పాఠశాల విద్యార్థులకు 12వేల బ్యాగులను పంచింది. ఆ బ్యాగులపై గ్రామపంచాయతీ లోగులో ఉన్నాయి. ఆటపాటల్లో పిల్లలు ఆ లోగులను పీకేయడంతో అసలు సంగతి బయటపడింది. ఆ లోగుల కింద ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ బొమ్మలు ఉన్నాయి.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న అఖిలేశ్ యాదవ్ సర్కారు పాఠశాల పిల్లలకు పంచేందుకు పెద్ద ఎత్తున స్కూలు బ్యాగులు తయారుచేయించింది. ఆ బ్యాగులపై అఖిలేశ్ యాదవ్ బొమ్మలు ఉన్నాయి. అయితే, ఈ బ్యాగులు పంచేలోపే ఎన్నికల కోడ్ రావడంతో వీటి పంపిణీకి బ్రేక్ పడింది. అనంతరం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో బీజేపీ సర్కారు రావడంతో వీటిని పంపిణీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ బ్యాగులు అనూహ్యంగా గుజరాత్‌లోకి ఎలా వచ్చాయన్నది ఆసక్తికరంగా మారింది. ఛోటా ఉడేపూర్ అనే మారుమూల పట్టణంలో ఇవి దర్శనమివ్వడం అధికారులను సైతం విస్తుపోయేలా చేసింది. ఈ బ్యాగుల పంపిణీపై విద్యాశాఖ అధికారులు వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు.