మోదీకి దమ్ముందా.. ఎన్నికలకు వెళ్దామా?
ప్రధాని మోదీకి దమ్ముంటే లోక్‌సభను రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని మాయావతి సవాల్ చేశారు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన యాప్‌లో నిర్వహించిన సర్వేలో 90శాతం మంది ప్రజలు పెద్దనోట్ల రద్దుకు మద్దతు తెలిపారన్న వాదనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా స్పందించారు. ఈ సర్వే ఫేక్, స్పాన్సర్డ్ అని కొట్టిపారేశారు. ప్రధాని మోదీకి దమ్ముంటే లోక్‌సభను రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని ఆమె సవాల్ చేశారు. అప్పుడు ప్రజలు తమ నిజమైన సర్వే ఫలితాలు వెల్లడిస్తారని పేర్కొన్నారు.
పెద్దనోట్ల రద్దును బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల పేదలు తీవ్రంగా కష్టాలు పడుతున్నారని ఆమె పేర్కొంటున్నారు. మరోవైపు పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనతో లోక్‌సభ గురువారం మధ్యాహ్నం వాయిదా పడగా,, రాజ్యసభలో గందరగోళం కొనసాగుతోంది. పెద్దనోట్ల రద్దుపై చర్చలో భాగంగా ప్రధాని రాజ్యసభకు రావాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.