 
															ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కంటాక్స్ రూల్స్..
ఏప్రిల్ 1, 2017 నుండి కొన్ని ఆదాయ పన్ను చట్టాలు మారనున్నాయి.
	న్యూఢిల్లీ: 2017-18  ఆర్థికబిల్లును  బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో  2017-18 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రక్రియను కేంద్రం పూర్తి చేసింది.  దీని ప్రకారం  ఏప్రిల్ 1, 2017 నుండి కొన్ని ఆదాయ పన్ను చట్టాలు మారనున్నాయి.  2017 ఆర్థిక బడ్జెట్ సందర్భంగా  ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివిధ ఆదాయ పన్ను చట్ట సవరణలను  ప్రకటించారు. వీటికి అదనంగా, కొన్ని సవరణలను కూడా  లోక్‌సభ ఆమోదించింది.  దీని  ప్రకారం  ఏప్రిల్ 1 నుంచి  ఇన్‌కంటాక్స్ రూల్స్ ఇలా ఉండనున్నాయి.
	
	1. రూ. 2.5 లక్షలు- రూ. 5 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి పన్ను శాతం  తగ్గనుంది.  అలాగే మొత్తం ఆదాయం రూ.1 కోటి లోపు ఉంటే,  ఆదాయపు పన్ను 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గనుంది. దీంతో ఏడాదికి రూ. 12, 500 పన్ను తగ్గనుంది. సర్‌ఛార్జ్, సెస్‌లతో కలుపుకుని రూ. 14, 806 రూపాయలు ఆదా కానుంది.  రూ.3-5లక్షల ఆదాయం ఉన్నవారు రూ.7700, రూ. 5-50 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.12,900 ఆదా కానున్నాయి. 87ఎ సెక్షన్  ప్రకారం ఈ తగ్గింపు   లభించనుంది. అయితే రూ.3.50 లక్షలు  ఆదాయ పన్నుచెల్లించేవారికి మాత్రం ఈ  రిబేటు వర్తించదు.
	 
	2. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి లోపు ఆదాయం ఉన్న సంపన్నులకు పన్నుపై  పది శాతం  సర్‌ఛార్జ్ విధింపు.  ఇదిగతంలో  15 శాతంగా ఉంది. అయితే రూ. 1 కోటి కంటే ఎక్కువ  ఆదాయం గల కుబేరులపై మాత్రం ఈ సర్‌ఛార్జ్  విధింపులో మార్పులేకుండా 15 శాతంగా ఉండనుంది. ఆదాయం రూ. 3.5 లక్షల ఉన్న వారికి పన్ను రిబేటును రూ. 5000ల నుంచి రూ. 2,500కు తగ్గించారు(గతంలో ఇది రూ.5 లక్షలుగా ఉండేది). ట్యాక్స్, రిబేట్‌లలో మార్పుల ఉమ్మడి ప్రభావంతో గతంలో రూ. 3.5 లక్షల ఆదాయంలోపు ఉన్నవారు రూ. 5,150 పన్ను చెల్లించగా.. ఇప్పుడు రూ. 2,575 చెల్లిస్తే సరిపోతుంది.
	
	3. రూ. 5లక్షలలోపు ఆదాయం ఉన్న  వారికోసం సింపుల్ వన్ పేజీ ఫాంను కొత్తగా పరిచయం చేసింది.  అంటే రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు (వ్యాపార ఆదాయం కాకుండా) సులభమైన ఒకటే పేజ్‌తో పన్ను రిటర్న్ దాఖలు చేయవచ్చు. ఈ విభాగంలో మొదటిసారిగా దాఖలు చేసే పన్ను రిటర్న్‌లపై సహజంగానే స్క్రూటినీ ఉండదు.
	
	4.  నేషనల్ పెన్షన్ స్కీం విత్ డ్రాలపై ఎలాంటి పన్ను వుండదు.  ఖాతాదారులకు 25 శాతం  అత్యవసరాలకోసం విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే  రిటైర్‌మెంట్ తర్వాత  విత్‌డ్రాలపై వచ్చే  మొత్తంగా  40శాతానికి  ఎలాంటి టాక్స్ ఉండదు.
	
	5. లిస్టెడ్ ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్స్‌లో లిక్విడ్ యూనిట్స్‌లో మొదటిసారి పెట్టుబడులకు మినహాయింపును ఇచ్చే రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్‌ను 2017-18 నుంచి ఉపసంహరిస్తున్నారు. చిన్న ఆదాయ దారులను పెట్టుబడులను స్టాక్ మార్కెట్లలో ప్రోత్సహించేందుకు గాను 2012-13 లో  ప్రత్యేకంగా  పరిచయం చేసిన ఈ విధానంలో మార్పుల ద్వారా 2018-19 నుంచి  ఎలాంటి మినహాంపులు లభించవు.
	
	6. స్థిరాస్థులపై పెట్టుబడులను లాంగ్‌టెర్మ్‌గా పరిగణిచేందుకు అవసరమైన కాలపరిమితిని 3 ఏళ్ల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించారు. దీంతో స్థిరాస్తులపై 2 సంవత్సరాలకు మించిన పెట్టుబడులపై పన్ను 20 శాతానికి పరిమితం చేయడంతో పాటు, తిరిగి పెట్టుబడులు చేయడంపై పలు మినహాయింపులకు అర్హత లభిస్తుంది.
	
	7. ప్రతిఫలంలో సవరణల్లో మార్పుల కారణంగా.. లాంగ్‌టెర్మ్ కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తక్కువ పేఅవుట్స్‌కు కారణం కానుంది. ధర ఇండెక్సేషన్‌కు బేస్ ఇయర్‌ను 1981 ఏప్రిల్ 1 నుంచి, 2001 ఏప్రిల్ 1 కి మార్చారు. దీంతో అమ్మకాలపై లాభాలు తగ్గనున్నాయి.
	
	8.అంతే కాకుండా, నోటిఫైడ్ రెడీమబుల్ బాండ్లలో కేపిటల్ గెయిన్స్‌పై రీఇన్వెస్ట్‌మెంట్‌కు పన్ను మినహాయింపు వర్తిస్తుంది(ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్ఈసీ బాండ్లలో పెట్టుబడులకు అదనంగా).
	
	9. ఆదాయ పన్ను చట్టంప్రకారం దీనిపై ట్రాన్సాక్షన్ మొత్తంపై 100శాతం జరిమానా. ట్యాక్స్ రిటర్న్ పునస్సమీక్షించేందుకు కాలపరిమితిని రెండేళ్ల నుంచి అదే ఆర్థిక సంవత్సరం చివరకు లేదా అసెస్మెంట్ ఏడాది చివరకు.. ఏది త్వరగా ముగియనుంటే దానికి పరిమితం చేశారు.
	
	10.  2017-18 ఆర్థిక సంవత్సరానికి పన్ను రిటర్న్‌ను ఆలస్యంగా.. అంటే 2018 డిసెంబర్ 31వరకూ దాఖలు చేసినవారు రూ. 5,000వేలు, ఆ తర్వాత దాఖలు చేసే వారు రూ. 10వేలు అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న చిన్న పన్ను చెల్లింపుదారులపై మాత్రం ఈ పెనాల్టీని రూ. 1000కి పరిమితి విధించారు.
అలాగే నల్లధనాన్ని నిరోధించే ఉద్దేశంతో నగదులావాదేవీలపై పరిమితి విధించింది. ఈ పరిమితిని బడ్జెట్ లో ప్రతిపాదించిన రూ.3లక్ష నుంచి రూ. 2 లక్షలకు తగ్గించింది. రూ. 2లక్షల పైన లావాదేవీలపై ఆంక్షలు. దీని ప్రకారం లావాదేవీలపై 100శాతం జరిమానా. పాన్ కార్డు దరఖాస్తుకు , ట్యాక్స్ రిటర్న్‌కు ఆధార్ కార్డు తప‍్పనిసరి. జులై 2017నుంచి ఈ నిబంధన అమలుకానుంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
