పార్టీని మార్చిన ఫోన్‌కాల్‌ 

ZPTC Santosh Kumar Join In TRS Party - Sakshi

టీఆర్‌ఎస్‌లో చేరిన జెడ్పీటీసీ  

ఎంపీ అభ్యర్థి నుంచి ఫోన్‌  

పార్టీలోనే పనిచేయాలని సూచన  

సాక్షి, వేమనపల్లి: మండల రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. పంతుళ్లుగా చలామణిలో ఉన్న జెడ్పీటీసీ సంతోష్‌కుమార్, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ కోళివేణుమాధవ్‌లు కలిసి పనిచేయాలని అధిష్టానం మరోసారి తేల్చి చెప్పింది. తెల్లవారితే కాంగ్రెస్‌ పార్టీలో చేరాల్సి ఉన్న జెడ్పీటీసీ వర్గం ఒక్కఫోన్‌కాల్‌తో టీఆర్‌ఎస్‌ వైపు మారింది. దీంతో ఇద్దరు పంతుళ్లు ఒకే ఒరలో రెండు కత్తులయ్యారని కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. మరో ఐదేండ్లు ఇద్దరు పంతుళ్లు మండలాన్ని పంచుకునుడేనని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జెడ్పీటీసీ 2016లో టీఆర్‌ఎస్‌లో చేరారు. దుర్గం చిన్నయ్య నుంచి సరైన ఆదరణ లేక రెబెల్‌గానే ఉండిపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి గడ్డం వినోద్‌కు మద్దతుగా పనిచేశారు. ఆయన ఓటమి పాలు కావటంతో అడ్రస్‌ లేని బీఎస్పీలో ఉండలేక కాంగ్రెస్‌ వైపు అడుగులు వేశారు. 

ఒక్క ఫోన్‌కాల్‌తో.. 
తెల్లవారితే కాంగ్రెస్‌లో చేరాల్సిన జెడ్పీటీసీ అనుచర గణం ఎంపీ అభ్యర్థి నేత ఫోన్‌కాల్‌తో రద్దయ్యింది. స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావ్‌ సమక్షంలో సోమవారం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ఇందుకోసం నీల్వాయిలో సమావేశ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. సంతోష్‌ మీరు కాంగ్రెస్‌కు వెళ్లొద్దు..  టీఆర్‌ఎస్‌లోనే పని చేయాలని.. ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ వేణును మిమ్మల్ని సమానంగా చూస్తాం అని ఫోన్‌కాల్‌ వచ్చింది. దీంతో పురాలోచనలో పడ్డ జెడ్పీటీసీ కాంగ్రెస్‌ వెళ్లే ఆలోచన పక్కన పెట్టి ఒక రోజు ముందే టీఆర్‌ఎస్‌లోకి పయనమయ్యారు. దీంతో కార్యకర్తలు, అనుచరులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆదివారం కన్నెపల్లి మండలం జన్కాపూర్‌లో మంత్రి కొప్పుల ఈశ్వ ర్, ఎమ్మెల్యేలు బాల్కసుమన్, దుర్గం చిన్నయ్యల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top