‘సున్నా’తో పరిధి సమస్య ఉండదు! 

Zero FIR System Need To Implement In AP And Telangana - Sakshi

ముంబైలో జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానం

పరిధి కాని నేరాలపై కేసుల నమోదుకు వినియోగం

ప్రియాంకరెడ్డి ఉదంతంతో దీనికి ప్రాధాన్యం

సాక్షి, హైదరాబాద్‌ :  ప్రియాంకరెడ్డి మిస్సింగ్‌ కేసు నమోదు చేయించడానికి ఆమె కుటుంబీకులు బుధవారం అర్ధరాత్రి రెండు ఠాణాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇది కేవలం వీరొక్కరికే కాదు... ఏటా అనేక మంది బాధితులకు ఎదురవుతున్న సమస్య. ఇక్కడ అమలులో ఉన్న చట్టం ప్రకారం జ్యురిస్‌డిక్షన్‌లోకి (పరిధి) వచ్చే అంశాలను మాత్రమే కేసుగా నమోదు చేయాల్సి ఉందని సిబ్బంది  చెబుతున్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ముంబై పోలీసులు ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇది ఇక్కడా అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రియాంక కేసు స్పష్టం చేసింది. ఠాణాల పరిధులు తెలుసుకోవడం సామాన్యుడికే కాదు ఒక్కోసారి పోలీసులకూ ఇబ్బందికరంగా మారుతోంది. ఈ పరిధుల సమస్య ఎక్కువగా ఒకచోట నుంచి మరో చోటుకి ప్రయాణాల నేపథ్యంలో జరిగే మిస్సింగ్, చోరీ, యాక్సిడెంట్‌ కేసుల్లో ఉత్పన్నమవుతోంది. ప్రతి పోలీసు స్టేషన్‌కు జ్యురిస్‌డిక్షన్‌గా పిలిచే అధికారిక పరిధి ఉంటుంది.

ఆయా పరిధుల్లో జరిగిన నేరాలపై మాత్రమే సదరు ఠాణా అధికారులు కేసు నమోదు చేస్తుంటారు. దీన్ని విస్మరిస్తే చట్ట పరంగా అధికారులు సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు చెప్తుంటారు. ఈ నిబంధనలు సామాన్యులకు ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోంది. అప్పటికే సమస్య ఎదురైన, ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొని నష్టపోయిన బాధితులకు ఇబ్బందికరంగా మారడంతో పాటు పోలీసుల పట్ల వ్యతిరేక భావాన్ని కలిగేలా చేస్తోంది. ఇలాంటి సమస్యల పరిష్కారానికే ముంబై పోలీసులు ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ విధానం అమలు చేస్తున్నారు.

బాధితుడి నుంచి అందుకున్న ఫిర్యాదును పోలీసుస్టేషన్‌లో కేసుగా నమోదు చేస్తూ ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) జారీ చేస్తారు. ప్రతి ఎఫ్‌ఐఆర్‌కు సీరియల్‌ నెంబర్‌/ఆ సంవత్సరం సూచిస్తూ సంఖ్య కేటాయిస్తారు. ముంబైలో పరిధులు కాని నేరాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ఎలాంటి నెంబర్‌ కేటాయించకుండా ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ నమోదు చేస్తున్నారు. 2014లో వెలుగులోకి వచ్చిన సంచలనం సృష్టించిన ముంబై మోడల్‌పై అఘాయిత్యం కేసే దీనికి ఉదాహరణ. 2013 డిసెంబర్‌ 31న కొందరు దుండగులు కుట్రతో ముంబై మోడల్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

చదవండి : శంషాబాద్‌లో మరో ఘోరం

స్ఫృహలో లేని స్థితిలో ఉన్న ఆమెను ముంబై పంపేశారు. అక్కడకు చేరుకున్న ఆమె వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’తో కేసు నమోదైంది. ప్రాథమిక విచారణ నేపథ్యలంలో ఉదంతం హైదరాబాద్‌లో జరిగినట్లు గుర్తించిన అక్కడి పోలీసులు కేసును ఇక్కడకు బదిలీ చేశారు. దాదాపు ప్రతి ఉదంతంలోనూ జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, ప్రాథమిక దర్యాప్తు చేసి, సంబంధిత స్టేషన్‌కు బదిలీ చేసే ఆస్కారం ఉంది. బాధితుడు ఠాణాకు వచ్చినప్పుడు పరిధులు పేరు చెప్పి తిప్పడం కంటే ముందు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, ప్రాథమిక విచారణ చేపడితే ఉత్తమం అని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రియాంక హత్య; అనేక ప్రశ్నలు

ప్రియాంక హత్యపై స్పందించిన నిర్భయ తల్లి

అందుకే ఆలస్యం: సీపీ సజ్జనార్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top