ప్రతిష్టాత్మకంగా షర్మిల పరామర్శ యాత్ర | YS Sharmila's Paramarsha Yatra from June 29 to July 2 | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మకంగా షర్మిల పరామర్శ యాత్ర

Jun 23 2015 3:10 AM | Updated on Mar 28 2018 11:08 AM

ప్రతిష్టాత్మకంగా షర్మిల పరామర్శ యాత్ర - Sakshi

ప్రతిష్టాత్మకంగా షర్మిల పరామర్శ యాత్ర

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 29 నుంచి రంగారెడ్డి జిల్లాలో...

29న కర్మన్‌ఘాట్‌లో.. జూలై1న చేవెళ్లలో బహిరంగ సభలు
* వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్
* పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యకర్తలతో సమీక్షా సమావేశం
* పరామర్శ యాత్ర తెలంగాణలో పార్టీకి దిక్సూచి కావాలని పిలుపు

సాక్షి, హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 29 నుంచి రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించనున్న పరామర్శ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి కార్యకర్తలకు సూచించారు.

సోమవారం లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్, రాఘవరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 15 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని చెప్పారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం షర్మిల స్వయంగా వారిని కలుసుకుని ధైర్యం చెపుతారన్నారు. ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరిస్తారన్నారు.

కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ చౌరస్తాలోని మంద మల్లమ్మ ఫంక్షన్‌హాల్ దగ్గర ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగసభ నిర్వహిస్తారని చెప్పారు. అలాగే జూలై 1న ఉదయం 11 గంటలకు చేవెళ్లలో బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరామర్శ యాత్రను జయప్రదం చేయడానికి ఏడు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను ఏర్పాటు చేశావున్నారు. షర్మిల పరామర్శయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడిక్కడ బ్రహ్మరథం పట్టాలని, ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేయాలని, బస్తీల్లో వాల్‌పోస్టర్లు అంటించాలన్నారు.

మహానేత వైఎస్సార్ 116 సార్లు ఇక్కడి నుంచే తన కార్యక్రమాలను ప్రారంభించారన్నారు. ఈ పరామర్శ యాత్ర తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి దిక్సూచి కావాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు సురేష్‌రెడ్డి మాట్లాడుతూ పరామర్శ జరిగే ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్లి విస్తృత ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు.

పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, రంగారెడ్డి జిల్లా మహిళా నేత అమృతసాగర్, పార్టీ ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముజ్‌తబ అహ్మద్, రాష్ట్ర కార్యదర్శి జి. ధనలక్ష్మి, ఐటీ విభాగం అధ్యక్షుడు ఎం.సందీప్ కుమార్, హైదరాబాద్ నగర యువజన విభాగం అధ్యక్షుడు అవినాష్‌గౌడ్, సేవాదళ్ అధ్యక్షుడు బండారి సుధాకర్, పార్టీ ప్రొగ్రాం కో-ఆర్డినేటర్ పి. సిద్దార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement